You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా ఉంది, మరేం చేస్తాం.. క్షమాపణలు చెప్పిన రష్మి: ప్రెస్ రివ్యూ
జబర్దస్త్ యాంకర్, నటి రష్మి తన అభిమానులకు క్షమాపణలు చెప్పారని 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం తెలిపింది.
''రీసెంట్‌గా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజమండ్రి వెళ్లారు రష్మి. ఆమె వస్తోందన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.
అయితే కరోనా కారణంగా పోలీసులు వారందరినీ వెనక్కి పంపారు. అయితే తనని చూడటానికి వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిన ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలిపారు రష్మి.
‘‘కరోనాతో అందరూ వణికిపోతుంటే.. ఇలా ఓపెనింగ్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్?’’అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
దీనికి బదులిచ్చిన ఆమె ‘‘ఇది ఎప్పుడో కమిటైన ప్రోగ్రాం. ప్రభుత్వం కూడా దీనికి అనుమతి ఇచ్చింది. ప్రజలు ఎవరూ కరోనా వలన రారని అనుకున్నాం. మేం కూడా ఎవరూ రాకపోయినా ఫర్వాలేదని భావించాం. కానీ ఇంత పెద్ద ఎత్తున వస్తారని ఊహించలేదు. అయితే పోలీసులు వారందరినీ ఆంక్షల కారణంగా పంపంచి వేశారు. ఇప్పటికైనా ప్రజలందరూ ఓ అవగాహనకి రండి, ప్రభుత్వాలు చెప్పే సూచనలు పాటించండి’’ అని రష్మి కోరారు'' అని ఆ కథనంలో తెలిపారు.
'నాపై కత్తికట్టారు'
ఏపీ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆరోపిస్తూ ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి తన గోడు వెళ్లగక్కారంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''నాపై కత్తికట్టారు. అడుగడుగునా అవమానిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీలో నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. చైర్మన్ ఆధ్వర్యంలో కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ సెక్రెటరీ ద్వారానే జరుగుతున్నాయి. ఫైళ్లపై మెంబర్లు గుడ్డిగా సంతకాలు పెడుతున్నారు. ఈ పరిణామం నన్ను తీవ్రంగా కలిచి వేస్తోంది. ఇప్పటి వరకు ఓర్చుకున్నాను. సహించాను'' అని ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ గవర్నర్‌కు మూడు పేజీల లేఖను అందజేశారు.
గత ప్రభుత్వ హయాంలో తాను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా రాజ్యాంగ బద్ధమైన పదవిలో నియామకం పొందానని పిన్నమనేని వివరించారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో తనను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన గవర్నర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులపాటు కనీసం చాంబర్‌కు వచ్చి కూర్చోలేని పరిస్థితులు కూడా కల్పించారని తెలిపారు. చైర్మన్ ఉండగానే ఎలాంటి సమాచారం, కారణం లేకుండానే మెంబర్ రంగరాజన్‌ను ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించారని, వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇన్‌చార్జి చైర్మన్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉంటుందని వివరించారు. కానీ, ఈ వ్యవహారంలో గవర్నర్ అధికారాలను కూడా సెక్రెటరీ లాగేసుకున్నారని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీలో చైర్మన్‌కు కనీసం పేషీ లేకుండా తీసేశారని తెలిపారు. నిబంధనల ప్రకారం.. చైర్మన్ పేషీలో పీఏ ఉండాలి. కానీ, అప్పటి వరకు ఉన్న పీఏని తొలగించారు. అలాగే చైర్మన్ రూం తెరిచేందుకు డోర్ అటెండర్ ఉన్నా అతన్నీ తొలగించారు. పర్సనల్ అటెండర్‌ను సైతం లేకుండా చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన కమిషన్‌లో చైర్మన్‌గా తనకు అనేక ఇబ్బందులు సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు గత నాలుగు నెలల కాలంలో ఒక్క ఫైలు కూడా పంపించలేదని, చైర్మన్‌తో ప్రమేయం లేకుండానే అన్ని బాధ్యతలను సెక్రెటరీనే నిర్వహిస్తున్నారని ఉదయభాస్కర్ పేర్కొన్నారు. కమిషన్‌లో తనకు పూర్తిగా సహాయ నిరాకరణ జరుగుతోందన్నారు. సెక్రెటరీ గానీ, మెంబర్లు గానీ తనతో మాట్లాడే పరిస్థితి లేదన్నారు. కానీ ఈ నాలుగు నెలల కాలంలో అనేక రిక్రూట్‌మెంట్లకు సంబంధించి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారని గుర్తుచేశారు. చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన బాధ్యతలను, కార్యకలాపాలను సెక్రెటరీ నిర్వహిస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. మెంబర్లు కూడా సెక్రెటరీకి పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ తాను ఆఫీసుకు వెళ్లి వస్తున్నానని వివరించారు. నియమ, నిబంధనల ప్రకారం.. ఏపీపీఎస్సీలో రోజువారీ కార్యకలాపాలు జరిగేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు'' అని ఆ కథనంలో వెల్లడించారు.
రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో తెలంగాణ, 6వ స్థానంలో ఏపీ
దేశంలోని 9 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో గత అయిదేళ్లుగా రైతుల ఆత్మహత్యలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారని 'ఈనాడు' కథనం వెల్లడించింది.
''మంత్రి సమాధానం ప్రకారం 2014-18 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 31,645 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
బిహార్, గోవా, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, దమన్ దీవూ, దిల్లీ, లక్షద్వీప్‌లలో రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు.
13 రాష్ట్రాల్లో అయిదేళ్లుగా అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మొత్తం ఆత్మహత్యలలో వీటి వాటా 99.51 శాతం. అత్యధికంగా మహారాష్ట్రలో 12,813 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా కర్ణాటక రెండో స్థానంలో ఉంది. 4,634 మంది రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ మూడో స్థానంలో.. 1,655 ఆత్మహత్యలతో ఏపీ ఆరోస్థానంలో ఉంది'' అని ఆ కథనం తెలిపింది.
నల్లగొండలో కరోనా కలకలం
నల్లగొండ జిల్లాలో 'కరోనా' కలకలం సృష్టించింది. వియత్నాం నుంచి 12 మంది మతబోధకులు జిల్లా కేంద్రానికి వచ్చినట్టు తెలియడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని 'సాక్షి' కథనం ప్రచురించింది.
''వియత్నాం నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన 12 మంది మత బోధకులను గుర్తించిన జిల్లా పోలీసులు వారిని గురువారం రాత్రి రెండు అంబులెన్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడి ఫీవర్ ఆస్పత్రిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. 'నల్లగొండలోని జైల్‌ఖానా సమీపంలో ఒక ప్రార్థనా మందిరంలో వియత్నాంకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారికి కరోనా లక్షణాలు లేకున్నా.. ముందు జాగ్రత్తగా పరీక్షల కోసం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించాం..' అని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ వార్త శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వియత్నాం నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ ఉందా? లేదా? అనే విషయమై వైద్య పరీక్షలకోసం హైదరాబాద్‌కు తరలించామని, వారంతా బాగానే ఉన్నారని అధికార వర్గాలు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు'' అని ఆ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- నిర్భయ హంతకులు నలుగురికీ ఉరిశిక్ష, తీహార్ జైలులో అమలుచేసిన అధికారులు
- నిర్భయ దోషుల ఉరితీత; సుప్రీం కోర్టులో అర్ధరాత్రి విచారణలో ఏం జరిగింది
- నిర్భయ ఘటన: విషాదం, ఆగ్రహం కమ్మేసిన భారత్‌ను ఒక్కతాటి పైకి తెచ్చిన కేసు
- భారత్‌లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?
- నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. మహిళలపై నేరాల విషయంలో దేశం ఎంత మారింది
- రాష్ట్రపతులతో ప్రమాణ స్వీకారం చేయించే పదవి నుంచి రిటైరయ్యాక రాజ్యసభ ఎంపీగా..
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)