ఎమర్జెన్సీలో ఫోన్ ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఫోన్ ఊపితే పోలీసులు వచ్చేస్తారంటూ మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన దిశ మొబైల్ అప్లికేషన్ గురించి ఈనాడు ఓ వార్త రాసింది.

"ఆపదలో ఉన్న మహిళలకు అత్యవసర సాయం అందించేందుకు రూపొందించిన యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయ బటన్‌ను నొక్కితే చాలు.. వెంటనే క్షణాల్లో పోలీస్ కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లేలా ఈ అప్లికేషన్‌ను రూపొందించారు.

సహాయం కోరే సమయం కూడా లేనప్పుడు కేవలం యాప్‌ను ఓపెన్ చేసి ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపినా (షేక్ ట్రిగ్గర్) చాలు తక్షణం కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లిపోతుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై అందుబాటులో ఉంటుంది.

ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా ఈ యాప్ పని చేయడం విశేషం. యాప్ తెరిచి ఓసారి బటన్ నొక్కితే చాలు వెంటనే ఆ ఫోన్ లొకేషన్ వివరాలు, ఆ ఫోన్ ఎవరి పేరుపై ఉంది వారి చిరునామా అన్ని వివరాలు పోలీస్ కంట్రోల్ రూంకి చేరిపోతాయి.

ఈ యాప్‌లో 'ట్రాక్ మై ట్రావెల్' ఆప్షన్ కూడా ఉంది. ఇది కేవలం మహిళల్ని ఉద్ధేశించినప్పటికీ ఆపదలో ఉన్న వృద్ధులు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అవసరమైనప్పుడు సమీపంలో ఉన్న ఆస్పత్రులు, మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంక్‌ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు" అని ఈనాడు తెలిపింది.

ముగిసిన మేడారం జాతర

తల్లుల వన ప్రవేశం అంటూ మూడు రోజుల పాటు సాగిన మేడారం జాతర ముగింపు విశేషాలను నమస్తే తెలంగాణ ప్రధాన వార్తగా రాసింది.

"బుధవారం మొదలైన మేడారం జాతర శనివారం సాయంత్రం తల్లుల వన ప్రవేశంతో ముగిసింది. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు తిరుగుముఖం పట్టారు.

చివరి రోజైన శనివారం సైతం భారీగా జనం హాజరయ్యారు. మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా కురిసిన వర్షానికి భక్తులు తడిసిముద్దయ్యారు.

సంప్రదాయం ప్రకారం సమ్మక్క ప్రధాన పూజారి సహా ఇతర వడ్డెలు అమ్మవారికి గద్దె వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చిలుకలగుట్టకు సాగనంపగా, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును, పూనగుండ్లకు, గోవిందరాజును కొండాయికి సంప్రదాయాల ప్రకారం పూజలు చేసి సాగనంపారు.

రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతర తల్లుల వన ప్రవేశంతో ముగిసింది" అని నమస్తే తెలంగాణ తెలిపింది.

గిఫ్టు తీసుకుంటే తప్పులేదు

సంతోషంగా ఇస్తే జేబులో పెట్టుకోండంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్ధేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

"శనివారం అమరావతి తృతీయ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి పేర్ని నాని ప్రసంగించారు. ఉద్యోగులపై జరుగుతున్న ఏసీబీ దాడుల గురించి అంతకుముందు ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించడంతో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.

పని చేస్తే... ఎవరైనా సంతోషంగా ఇస్తే అది గిఫ్ట్ అవుతుంది... తీసుకోవచ్చు.

పీక మీద కత్తి పెట్టి వసూలు చేస్తే అది దారి దోపిడి. గిఫ్ట్‌లు తీసుకోండి. దారి దోపిడీ చెయ్యద్దని నా దగ్గరకు వచ్చే ఉద్యోగులకు చెబుతాను.

జగన్ ప్రభుత్వంలో ప్రతి మంత్రీ నీతిగానే బతుకుతున్నాడు. లంచగొండితనాన్ని పై నుంచి నరుక్కొద్దామని జగన్ చెబుతున్నారు. తప్పు చేస్తే రెండు రోజుల్లో మంత్రి పదవి నుంచి తొలగిస్తానని హెచ్చరించారు.

ఉద్యోగులు జనాల్ని పీడిస్తే ఏసీబీ రైడ్లు జరుగుతాయి. నీతిగా ఉంటే ప్రభుత్వం దన్నుగా ఉంటుంది. సంతోషంగా ఎవరు ఇచ్చినా తీసుకోవడం తప్పుకాదని వ్యక్తిగతంగా భావిస్తాను. డబ్బు కోసం పీక మీద కత్తి పెట్టి సతాయించడం పాపం" అని మంత్రి నాని అన్నారని ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

అమెరికా ప్రతినిధుల సభకు పోటీలో తెలుగు మహిళ

అమెరికా ప్రతినిధుల సభకు తెలుగు మూలాలున్న మహిళ మంగ అనంతాత్ముల పోటీ చేయనున్నారని ఈనాడు తెలిపింది.

"వర్జీనియాలోని 11వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ పార్టీ తరపున తెలుగు మహిళ మంగ అనంతాత్ముల అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారయ్యింది. అక్కడ నుంచి ప్రతినిధుల సభకు పోటీ పడుతున్న తొలి భారతీయ సంతతి మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించిన మంగ పాఠశాల విద్యాభ్యాసం చెన్నైలో జరిగింది. ఆగ్రా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు.

రక్షణ శాఖ కొనుగోళ్ల విభాగంలో ఫెడరల్ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా ఆమె వ్యవహవరించారు" అని ఈనాడు తన కథనంలో వివరించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)