JLL ఇండెక్స్: హైదరాబాద్ ప్రపంచంలోనే నంబర్-1 డైనమిక్ సిటీ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ 'జోన్స్ లాంగ్ లసాల్' (జేఎల్‌ఎల్) విడుదల చేసిన సిటీ మూమెంటం ఇండెక్స్-2020లో సామాజిక-ఆర్థిక, వాణిజ్య రియల్ ఎస్టేట్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరం(డైనమిక్ సిటీ)గా నిలిచిందని నమస్తే తెలంగాణ తెలిపింది.
నిరుడు ఈ సూచీలో మొదటి స్థానాన్ని దక్కించుకొన్న బెంగళూరును ఈసారి హైదరాబాద్ రెండో స్థానానికి నెట్టేసింది.
జేఎల్‌ఎల్ సిటీ మూమెంటం ఇండెక్స్- 2020ను రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ నగరాల జాబితాలో హైదరాబాద్ మూడేండ్లలో రెండుసార్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ఆయన చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా 130 నగరాల్లోని వాణిజ్య సముదాయాల కార్యకలాపాలను జేఎల్‌ఎల్ అధ్యయనం చేసి హైదరాబాద్‌కు ప్రథమ స్థానాన్ని కట్టబెట్టింది.
హైదరాబాద్ తర్వాత బెంగళూరు, హోచిమిన్ సిటీ, నైరోబీ, చెన్నై, దిల్లీ, హనోయి, మనీలా, సిలికాన్‌వ్యాలీ, షెన్‌జెన్ నగరాలు టాప్-10లో ఉన్నాయి. పుణె 12వ, కోల్‌కతా 16వ, ముంబై 20వ స్థానాల్లో నిలిచాయి.
2014లో జేఎల్‌ఎల్ విడుదలచేసిన సిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌కు టాప్-20లో చోటు లభించలేదు. ఆ మరుసటి ఏడాదే టాప్-20లో చేరిన హైదరాబాద్, అప్పటి నుంచి తన స్థానాన్ని మెరుగుపరుచుకొని 2016లో ఐదో స్థానానికి 2017లో మూడో స్థానానికి, 2018లో అగ్రస్థానానికి ఎగబాకింది.

ఫొటో సోర్స్, Twitter/@iamRashmika
విచారణకు రావాలంటూ రశ్మికకు ఐటీ నోటీసులు
బహు భాషా నటి రశ్మికా మందన్న నివాసంపై ఇటీవల దాడులు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ, దీనికి సంబంధించి ఈ నెల 21న మంగళవారం బెంగళూరులోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రశ్మికతో పాటు ఆమె తండ్రి మదన్, తల్లి సుమన్‌కు నోటీసులు జారీ చేసిందని సాక్షి తెలిపింది.
మూడు రోజుల క్రితం కర్నాటకలోని కొడగు జిల్లా విరాజపేటెలో ఉన్న రశ్మికా నివాసం, వారి కుటుంబానికి చెందిన కల్యాణ మండపం, కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
తాము ఎలాంటి తప్పూ చేయలేదని మదన్ చెప్పారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనన్నారు. ఐటీ విచారణకు హాజరవుతామని తెలిపారు.

ఫొటో సోర్స్, IWMP.TELANGANA.GOV.IN
తెలంగాణ: ఆరు లోక్‌సభ స్థానాల పరిధిలోని మున్సిపాలిటీలు అత్యంత కీలకం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మునిసిపాలిటీలు అత్యంత కీలకంగా మారాయని, తొమ్మిది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొందడమే దీనికి కారణమని ఆంధ్రజ్యోతి రాసింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీఆర్‌ఎస్, 2019 ఏప్రిల్లో లోక్‌సభ ఎన్నికల్లో అదే స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.
మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు చోట్ల కాంగ్రెస్ గెలుపొందాయి. ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరిగి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీలు మూడు పార్టీలకూ అగ్నిపరీక్షగా మారాయి.
నిరుడు ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో, కాంగ్రెస్ భువనగిరి, నల్లగొండ, మల్కాజిగిరిలలో విజయం సాధించాయి.
బీజేపీకి ఉన్న నలుగురు లోక్‌సభ సభ్యుల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలు లేవు.

ఫొటో సోర్స్, iStock
ఆంధ్రప్రదేశ్: ఆంగ్ల మాధ్యమంపై అభిప్రాయ సేకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై తల్లిదండ్రుల అభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈనాడు తెలిపింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు, విద్యావేత్తల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉత్తర్వులు విద్యా హక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని ఆంగ్ల మాధ్యమంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా డిసెంబరు 20న హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఉత్తర్వులు తమ ఆదేశాలకు లోబడి ఉంటాయని, పాఠ్యపుస్తకాల ముద్రణకు ఖర్చు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యావేత్తలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు ఈ నెల 7న ఆంగ్ల మాధ్యమంపై చర్చించి, మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు మద్దతుగా తీర్మానాలను సమర్పించాయి.
ఆంగ్ల మాధ్యమం కావాలా? లేదా తెలుగు మాధ్యమం కావాలా? అనే దానిపై తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలను తీసుకునేందుకు 21న సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక దరఖాస్తును రూపొందించారు. అందులో ఆయా మాధ్యమాలకు ఎదురుగా ఖాళీ గడులను ఇచ్చారు. వీటిల్లో కావాల్సిన మాధ్యమం ఎదురుగా టిక్ మార్కు చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- NRC ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొచ్చిందా
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?
- కేరళలో రెండు ఎత్తయిన భవనాలు క్షణాల్లో నేలమట్టం
- అమిత్ షా ర్యాలీలో CAA వ్యతిరేక బ్యానర్ పట్టుకున్న అమ్మాయి ఏమన్నారు...
- జేఎన్‌యూలో దాడి నిందితుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























