హాజీపూర్: 'అసలు నాకు మగతనమే లేదు.. ఆ అత్యాచారాలు, హత్యలు నేను చేయలేదు' అన్న నిందితుడు - ప్రెస్ రివ్యూ

తమ గ్రామంలో హత్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులే తనను ఇరికించారని హాజీపూర్ వరుస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డి జడ్డి ఎదుట చెప్పారని 'సాక్షి' కథనం తెలిపింది.
'అంతా అబద్ధం సార్.. హాజీపూర్‌లో జరిగిన హత్యలకు, నాకు ఎలాంటి సంబంధమూ లేదు. పోలీసులే నన్ను ఇరికించారు. ఆ హత్యలకు సంబంధించి సాక్ష్యాలన్నీ అబద్ధమే. మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు నాకు సంబంధం లేదు. పోలీసులు సిరంజి ద్వారా నాదగ్గర నుంచి వీర్యం తీసుకెళ్లారు. నాకు ఆండ్రాయిడ్ ఫోనే లేదు. బూతు బొమ్మలు చూశాననడం అబద్ధం' అంటూ హాజీపూర్ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. జడ్జి ఎదుట చెప్పాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో జరిగిన శ్రావణి, కల్పన, మనీషాల అత్యాచారం, హత్యలపై శుక్రవారం నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్ కోర్టులో న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి విచారణ నిర్వహించారు. 6 గంటల పాటు విచారణ సాగింది.
ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్, నిందితుడి తరఫున న్యాయవాది ఎస్.ఆర్. ఠాగూర్‌లు హాజరయ్యారు. కాగా ఇదివరకే మనీషా హత్యకు సంబంధించి సాక్ష్యాలపై విచారణ జరిగింది. శుక్రవారం శ్రావణి, కల్పనలకు సంబంధించి 72 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను న్యాయమూర్తి ఒక్కొక్కటి చదివి నిందితుడికి వినిపించారు. అతనినుంచి ఒక్కో దానిపై సమాధానం తీసుకొని రికార్డు చేశారు. 'సాక్షులు అందరూ శ్రీనివాస్‌రెడ్డే నిందితుడని సాక్ష్యం చెప్పారు. దీనిపై ఏమి చెబుతావు' అని న్యాయమూర్తి అడగగా 'నాకూ ఆ హత్యలకు సంబంధంలేదు. కావాలనే నన్ను ఇరికించారు' అంటూ సమాధానం చెప్పాడు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.
'నాలుగు సంవత్సరాల క్రితం కల్పన అనే అమ్మాయిని కూడా అత్యాచారం, హత్య చేసి బస్తాలో మూటకట్టి అదే మర్రిబావిలో పాతిపెట్టావు, అది కూడా అందరి ముందు నేనే పాతిపెట్టానని ఒప్పుకున్నావు' కదా అని న్యాయమూర్తి అడగ్గా 'అంతా అబద్ధం.. నన్ను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. బావి వద్దకు తీసుకెళ్లలేదు' అని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. 'మృతుల బట్టలపై ఉన్న వీర్యం నీదేనని పరీక్షలో తేలింది. నువ్వే అత్యాచారం చేశావు' అన్నప్పుడు 'నాకు మగతనం లేదు' అంటూ సమాధానం చెప్పాడు. వైద్యులు నువ్వు ఫిట్‌గానే ఉన్నావని 'నువ్వు పని చేసే చోట ఒక వేశ్యని తీసుకొచ్చి చంపి నీటి ట్యాంక్‌లో వేశావని, అప్పట్లో నిన్ను కర్నూల్‌లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు కదా' అని అడగ్గా అది కూడా అబద్ధమేనని నిందితుడు సమాధానం చెప్పాడు.
మర్రిబావి సమీపంలో ఓ చెట్టు దగ్గర ఉన్న బీరు సీసాలను ఫింగర్‌ప్రింట్స్ నిపుణులు పరీక్షలు చేస్తే ల్యాబ్‌లో నీ వేలిముద్రలేనని తేలిందని, దానికి నీ సమాధానం.. అంటూ జడ్జి అడగ్గా పోలీసులు బలవంతంగా బీరు సీసాను పట్టించారని చెప్పాడు. 'నీకు నాలుగైదు ఫోన్ నంబర్లు ఉన్నాయి, నీ ఫోన్ లో చనిపోయిన శ్రావణి, కల్పన, మనీషాల ఫొటోలు ఉన్నాయి. నీఫోన్ సీజ్ చేసి డేటాను పరిశీలించగా నువ్వు బూతు బొమ్మలు చూసేవాడివని తేలింది, దానికి నీ సమాధానం ఏమిటి 'అని అడగ్గా నిందితుడు 'నాకు చిన్న ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లేదు' అని చెప్పాడు.
‘నీ మీద కేసు ఎందుకు పెట్టినట్లు'.. అని అడగ్గా 'మా భూమి అమ్మలేదని కొందరు చేశారు. కావాలనే ఇరికించారు' అని చెప్పారని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/Rohit Sharma
రోహిత్ శర్మపేరుతో హైదరాబాద్‌లో క్రికెట్ స్టేడియం
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ శుక్రవారం హైదరాబాద్‌లో శివారులోని కన్హాశాంతివనం ఆశ్రమంలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''భార్య రితికాతో కలిసి హైదరాబాద్ వచ్చిన రోహిత్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా కన్హాశాంతివనంకు వెళ్లాడు. అక్కడ ఆశ్రమం గురూజీ కమలేష్ పటేల్‌తో కలిసి హార్ట్‌ఫుల్‌నెస్ స్టేడియం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమం ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను రోహిత్ అభినందించాడు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.
రోహిత్ శర్మ యువతకు స్ఫూర్తిదాయకం కావడంతో ఆయన పేరునే స్టేడియానికి పెడుతున్నట్లు కమలేశ్ పటేల్ చెప్పినట్లు పలు ఇతర పత్రికలు తెలిపాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY
సీఎం జగన్ జనవరి 10న కోర్టుకు రావాల్సిందే
అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఏ1-వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏ2- వి.విజయసాయిరెడ్డి జనవరి 10న విచారణకు హాజరు కావాల్సిందేనంటూ శుక్రవారం సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని 'ఈనాడు' కథనం తెలిపింది.
''ముఖ్యమంత్రి హోదాలో వివిధ పనుల నేపథ్యంలో రాలేకపోతున్నట్లు మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్‌లను పరిశీలించి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది మార్చి 1న హాజరైన జగన్ తిరిగి ఇప్పటివరకు రాకుండా మినహాయింపు కోరుతూ వస్తుండడాన్ని కోర్టు ప్రస్తావించింది. ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు ప్రతివారం రాకపోవడాన్ని ప్రశ్నించింది.
జగన్ అక్రమాస్తుల కేసులపై శుక్రవారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. ముఖ్యమంత్రిగా అధికారిక విధుల్లో ఉన్నందున జగన్మోహనరెడ్డి, దిల్లీలో సమావేశం ఉన్నందున ఎంపీ విజయసాయిరెడ్డి రాలేకపోతున్నట్లు ఎంపీ తరఫు న్యాయవాది మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వీటితో పాటు అన్ని అంశాలను పరిశీలించిన న్యాయమూర్తి.. దీర్ఘకాలంగా జగన్, సాయిరెడ్డి హాజరుకాకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈసారికి హాజరు మినహాయింపు నిమిత్తం సీఆర్‌పీసీ సెక్షన్ 317 కింద దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తున్నామని, వచ్చే విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. జనవరి 10కి విచారణను వాయిదా వేస్తూ ఆ రోజు జగన్, విజయసాయిరెడ్డి హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/Kalvakuntla Taraka Rama Rao - KTR
సిరిసిల్లలో షాపర్స్‌స్టాప్
ప్రముఖ లైఫ్‌ైస్టెల్ బ్రాండ్ సంస్థ షాపర్స్‌స్టాప్.. సిరిసిల్లలో దుస్తుల తయారీ యూనిట్ ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చిందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''శుక్రవారం ముంబైలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో షాపర్స్ స్టాప్ ఒప్పందం చేసుకొన్నది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, షాపర్స్‌స్టాప్ ఎండీ, సీఈవో రాజీవ్‌సూరి అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు. సిరిసిల్ల పట్టణంలో వస్త్ర పరిశ్రమకు ఉన్న అనుకూల అవకాశాలను పరిశీలించిన తరువాత అక్కడే తమ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకొన్నట్లు షాపర్స్‌స్టాప్ సంస్థ తెలిపింది. సిరిసిల్లలో ఉన్న మానవ వనరులు, టెక్స్‌టైల్ పార్క్, అపారెల్ పార్క్ వంటి మౌలిక వసతులతోపాటు.. వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి పలు అంశాలు తమను పెట్టుబడి పెట్టేలా ప్రభావితంచేశాయని రాజీవ్‌సూరి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా సిరిసిల్ల అపారెల్ పార్క్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటుచేస్తామని, పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే సంస్థ తరఫున ప్రకటిస్తామని తెలిపింది. దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన షాపర్స్‌స్టాప్ సిరిసిల్ల పట్టణానికి రావడం పట్ల పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడిద్వారా సిరిసిల్లలో వందల మందికి ఉపాధి లభించడంతోపాటు.. స్థానిక మహిళలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందన్నారు. షాపర్స్‌స్టాప్ రాక.. సిరిసిల్ల అపారెల్ పార్క్ అభివృద్ధికి దోహదంచేస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశార''ని ఆ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- తెలంగాణ: బొంగులో కల్లు.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- బాలీవుడ్‌తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్
- 'సావిత్రికి అభిమానిని.. ఆ తర్వాతే అల్లుడిని!'
- ఫ్రెంచ్ సావిత్రి దేవికి జర్మన్ హిట్లర్‌కు ఏమిటి సంబంధం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























