రాజధాని అమరావతే... మార్చే ప్రతిపాదన లేదు: శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Botcha Satyanarayana/FB
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందని ఈనాడు తెలిపింది. అమరావతి నుంచి రాజధానిని మార్చే ప్రతిపాదన లేదని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
శాసనమండలి సభ్యులు పి.శమంతకమణి, జి.దీపక్‌కుమార్, పి.అశోక్‌బాబు శుక్రవారం అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స రాతపూర్వక సమాధానమిచ్చారు.
సభ్యులపై మార్షల్స్ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష టీడీపీ సభ్యులు రెండో రోజూ ఆందోళనకు దిగడంతో ప్రశ్నోత్తరాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చివరిగా మండలిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రశ్నోత్తరాలపై ఇచ్చిన సమాధానాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
11,629 నంబరు ప్రశ్నలో సభ్యులు ప్రత్యేకంగా రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ మూడు ప్రశ్నలు వేశారు. అమరావతి నుంచి రాష్ట్ర రాజధానిని మార్చే ప్రతిపాదన ఉందా, అమరావతి అభివృద్ధికి ఇప్పటివరకు ఖర్చు చేసిన వివరాలు ఏమిటి, రాజధానిని మార్చితే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎలా ఉండబోతోంది అని వారు అడిగారు.
రాజధానిని మార్చే ప్రతిపాదన లేదని, అందువల్ల మిగతా రెండు ప్రశ్నలూ ఉత్పన్నం కావని మంత్రి బొత్స తన సమాధానపత్రంలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆయేషా కేసు: 12 ఏళ్ల తర్వాత మళ్లీ శవపరీక్ష
విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ఆధారాల కోసం 12 ఏళ్ల తర్వాత ఈ రోజు మరోసారి శవపరీక్ష నిర్వహిస్తున్నారని ప్రజాశక్తి తెలిపింది.
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట శ్మశానంలో ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
తెనాలి వాసులు షంషాద్‌బేగం, ఇక్బాల్‌భాషాల పెద్ద కుమార్తె ఆయేషా. ఆమె విజయవాడలో బీఫార్మసీ చదువుతూ, ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో ఉండేది.
2007 డిసెంబరు 27న హాస్టల్‌లో ఆయేషా రక్తపు మడుగులో కనిపించింది. 2008 ఆగస్టు 17న మరో కేసులో అరెస్టయిన సత్యంబాబును ఈ కేసులో నిందితుడుగా పోలీసులు పేర్కొన్నారు. ఆయేషాను హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు చెప్పారు.
2010 సెప్టెంబరులో అతనికి విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తర్వాత కేసు హైకోర్టుకు వెళ్లింది. సుదీర్ఘ విచారణ తర్వాత, సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి, విడుదల చేసింది. దీంతో ఆయేషా కేసు మళ్లీ మొదటికి వచ్చింది. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
వైరస్‌ల గుర్తింపునకు హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం
అన్నిరకాల వైరస్‌లను గుర్తించేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ల్యాబ్, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఈ కేంద్రంలో, విస్తరిస్తున్న వైరస్‌లన్నింటినీ గుర్తించి, పరిశోధిస్తారని, వారంలో ల్యాబ్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు.
కొత్తగా వచ్చే వైరస్‌లను గుర్తించేందుకు నమూనాలను ప్రస్తుతం పుణె, దిల్లీ ల్యాబ్‌లకు పంపాల్సి వస్తోందని, ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ఆ అవసరం ఉండదని రాజేందర్ వివరించారు. దీని ఏర్పాటుకు మానవ వనరులు, మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం సాయంచేస్తుందన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ కోఠిలోని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ కార్యాలయ ప్రాంగణంలోని ఒక భవనంలో తాత్కాలికంగా ఈ ల్యాబ్ సేవలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం శుక్రవారమిక్కడ మంత్రితో సమావేశమైంది.
పురుషులకూ కావాలి ఓ కమిషన్: సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్
దేశంలో రోజురోజుకూ భార్యా బాధితుల సంఖ్య పెరిగిపోతోందని, చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పురుషులను వేధిస్తున్నారని 'సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్' ఆరోపించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
మహిళల కోసం మహిళా కమిషన్ ఉన్నట్లుగానే పురుషుల కోసం ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటుచేయాలని ఈ ఫౌండేషన్ డిమాండ్ చేసింది.
మహిళల కోసం 48 చట్టాలు ఉండగా పురుషుల కోసం ఒక్క చట్టం కూడా లేదని, కుటుంబ సమస్యల కారణంగా దేశంలో ప్రతి ఆరున్నర నిమిషాలకో మగవాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఫౌండేషన్ అధ్యక్షుడు రాజేశ్ వకారియా చెప్పారు.
శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫౌండేషన్‌కు చెందిన పాండురంగ కత్తి, స్వామినాథన్, జీత్‌బనిక్, విజయ్, ఆర్‌పీ షా మీడియాతో మాట్లాడారు. 498 సెక్షన్ పూర్తిగా మహిళలకే అనుకూలంగా ఉందని, తప్పుడు కేసు అని తెలిసి కూడా ఏమీ చేయలేక పోతున్నామన్నారు. భర్తలపై భార్యలు, వారి కుటుంబసభ్యులు 498 (ఏ)తోపాటు మరో ఐదు కేసులు పెడుతున్నారని, ఒక చోట ఒక కేసును, ఇంకోచోట మరో కేసును పెడుతుండటంతో మగవాళ్లు, వారి కుటుంబీకులు కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నారని చెప్పారు.
కుటుంబ తగాదాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవడమే కాకుండా ఒకే ప్రదేశంలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- బోరిస్ జాన్సన్: ఒక జర్నలిస్టు.. బ్రిటన్ ప్రధాని ఎలా అయ్యారు?
- మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?
- 'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు... అతి చౌక నగరాలు
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- భారత 'యూనికార్న్'లు మరీ శక్తిమంతంగా ఎదుగుతున్నాయా?
- ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























