పవన్ కల్యాణ్: తెలుగు హీరోలకు తెలుగు రాదు- ప్రెస్‌రివ్యూ

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, JANASENA

ప్రచురణ

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలకు తెలుగు మాట్లాడటం అటుంచితే రాయడం కూడా రాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

''తెలుగు సినిమాలు కావాలి... తెలుగు సినిమాల ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి... కానీ తెలుగు భాష అంటే పట్టింపు ఉండదు. నేను కూడా మొదట్లో అలాగే ఉండేవాడిని. చాలామందికి కాళిదాసు ఎవరో, ఆముక్త మాల్యద అంటే ఏంటో తెలియదు.

మేడసాని వంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉంటే మంచి సినిమాలు వచ్చేవి. బూతులు, తిట్లే సినిమాలో ప్రమాణాలైపోతుంటే సమాజం కూడా అటే పోతోంది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతిలో 'మన నుడి- మన నది' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''ఇంగ్లిష్ మీడియంలో చదివితేనే జీవితాలు మారిపోతాయనుకుంటే, అదే మీడియంలో చదివినవారు జైలుకు ఎందుకు వెళతారు? అంటే జైలుకెళ్లడం ఇంగ్లిష్ నేర్పిందా?'' అని ప్రశ్నించారు.

''మన రాష్ట్రంలో 64,630 ప్రభుత్వ పాఠశాలలు ఉండి, ఎనిమిది భాషామాధ్యమాలలో బోధన జరుగుతుంటే కేవలం తెలుగు మీదే ఎందుకు పడ్డారని, మాతృభాషనే ఎందుకు చంపాలని కంకణం కట్టుకున్నారని ప్రశ్నించారు. ''భాషల జోలికి రాకండి. లేదంటే సరస్వతి.. అపర దుర్గగా మారి సమూలంగా నాశనం చేస్తుంది'' అని పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

ఫొటో సోర్స్, Andhrapradeshcm/fb

వేలెత్తి చూపడానికి ఏమీ లేదు

‘ఆరునెలల్లోనే మంచి పాలన అందించా, వేలెత్తి చూపడానికి ఏమీ లేదు’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారని ఈనాడు తెలిపింది.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నూతనంగా అమల్లోకి తెచ్చిన 'ఆరోగ్యశ్రీ ఆసరా' పథకాన్ని సోమవారం గుంటూరులో ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

''ఆరు నెలల్లోనే మంచి పాలన అందించా. వేలెత్తి చూపడానికి ఏమీ లేదు. అయినా కొందరు విమర్శలు చేస్తున్నారు. చివరకు నా కులం, మతం గురించి మాట్లాడటం చూస్తే బాధనిపిస్తోంది. అయినా అవేం పట్టించుకోకుండా ప్రజల కోసం ముందుకెళ్తా. పేదవారు ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకుని ఇంటికి వెళ్లగానే కడుపు నింపుకొనే ఆర్థికస్థోమత లేక పనులకు వెళ్లడం, పస్తులు ఉండడటం వంటివి చేస్తున్నారని పాదయాత్రలో తెలుసుకున్నా. వారికి ఆరోజే ఆసరాగా ఉంటానని మాటిచ్చి దాన్ని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నందుకు గర్వపడుతున్నా. ఏ శస్త్రచికిత్సకు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమో వైద్యులు నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే రోగులకు 'ఆరోగ్య ఆసరా' కింద విశ్రాంతి భత్యాన్ని ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చెల్లిస్తాం'' అని పేర్కొన్నారు.

వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారందరికీ జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వీటికి క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తామని చెప్పారు. ప్రతి పేషెంట్‌ మెడికల్‌ ట్రాక్‌ రికార్డు అందులో నమోదు చేస్తామని తెలిపారు.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని 1200 జబ్బులకు విస్తరించామని, మున్ముందు దీన్ని 2వేల రోగాలకు వర్తింపజేస్తామని హామీనిచ్చారు. రూ.1000కు మించి ఖర్చయ్యే వైద్యానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, దీన్ని తొలుత ప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరిలో జనవరి నుంచి మూడు నెలల పాటు అమలు చేసి, ఏప్రిల్‌ నుంచి ఒక్కో జిల్లాలో అమలు చేస్తూ ముందుకెళ్తామని వివరించారు. 2వేల వ్యాధులకు విస్తరించే పథకాన్ని కూడా మొదట పశ్చిమగోదావరిలోనే అమలు చేస్తామని తెలిపారని ఈనాడు వెల్లడించింది.

తెలంగాణలో ఆర్టీసీ

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT

ఆర్టీసీ డ్రైవర్లకు '60 ఏళ్లు' వద్దు

తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లకు 60 ఏళ్ల పదవీ విరమణ వయసు నిబంధనను అమలు చేయడం శ్రేయస్కరం కాదని సంస్థ ఉద్యోగులు (కార్మికులు) అభిప్రాయపడ్డారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఇది ఇతర సమస్యలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటగానే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే డ్రైవర్లు 60 ఏళ్ల వరకు బస్సు నడపాలంటే కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులతో సీఎం కేసీఆర్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ప్రగతి భవన్‌లో అభిప్రాయాల బాక్స్‌ను ఏర్పాటు చేశారు. అందులో కార్మికులు తమ అభిప్రాయాలను కాగితాలపై రాసి బాక్సులో వేశారు.

చాలా మంది ఉద్యోగులు డ్రైవర్లకు 60 ఏళ్ల వయసు నిబంధన వద్దన్నారు. సుదీర్ఘ కాలంగా బస్సులు నడపడం వల్ల డ్రైవర్లు దృష్టి లోపాలు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, గుండె నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.

డబుల్‌ డ్యూటీలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, గుండెపోటుతో డ్రైవర్లు స్టీరింగ్‌పైనే చనిపోతున్నారని వివరించారు. ఇలాంటి వారికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్‌ఎస్‌) అమలు చేస్తే బాగుంటుందని తెలిపారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

విజయశాంతి

ఫొటో సోర్స్, Getty Images

‘పెదవి విప్పేందుకు 72 గంటలా?’

'దిశ' హత్యోదంతం జరిగిన 72 గంటల తర్వాత సీఎం కేసీఆర్‌ పెదవి విప్పడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి అన్నారని సాక్షి తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారని పేర్కొంది.

ఇలాంటి దారుణ ఘటనలపై ఫిర్యాదు అందిన వెంటనే పరిధుల పేరుతో జాప్యం చేయకుండా పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారో సీఎం చెప్పలేదని విజయశాంతి విమర్శించారు. అసలు విషయాల గురించి మాట్లాడకుండా కేవలం కంటితుడుపు చర్యగా ఓ ప్రకటన జారీచేసి తప్పించుకున్నారని అన్నారు.

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారణ పేరుతో మొక్కుబడిగా ఒక ప్రకటన జారీ చేసి దొరగారు చేతులు దులుపుకున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారని సాక్షి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)