హైదరాబాద్ క్రికెట్ అకాడమీపై కేటీఆర్‌కు అంబటి రాయుడు ఫిర్యాదు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెటర్ అంబటి రాయుడు హైదరాబాద్ క్రికెట్ అకాడమీ(హెచ్‌సీఏ)పై సీరియస్ అయ్యారని, హైదరాబాద్ క్రికెట్ సంఘం అవినీతిలో కూరుకుపోయిందని రాయుడు ఆవేదన వ్యక్తం చేశారని 'నమస్తే తెలంగాణ'లో కథనం రాశారు.
''హెచ్‌సీఏలో అవినీతిని కట్టడి చేయాలని రాయుడు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌లో రాయుడు, హలో.. కేటీఆర్ సర్.. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిపై దృష్టి సారించాలని, దానిని నిర్మూలించాలని కోరుతున్నానన్నాడు. అవినీతి పాలకులు క్రికెట్ జట్టుపై ప్రభావం చూపిస్తుంటే, హైదరాబాద్ క్రికెట్ గొప్ప స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందని ఆయన తెలిపారు. హెచ్‌సీఏ పాలకులపై కుప్పలు తెప్పలుగా ఏసీబీ కేసులున్నాయి. వాటిని దాచిపెట్టారని కేటీఆర్‌కు అంబటి ట్విట్టర్‌లో తెలియజేశారు. గతంలోనూ హెచ్‌సీఏ పై 100 కోట్ల ఆరోపణలున్నాయని గుర్తు చేశాడు. కాగా, ఈ మధ్యే జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో సహా అతని ప్యానల్ మొత్తం విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో అజహర్ ఓటమి పాలయ్యారు. ఈ సారి భారీ మెజార్టీతో గెలిచి, అధ్యక్ష భాద్యతలు స్వీకరించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమిత్ షాపై చంద్రబాబు ప్రశంసలు
కేంద్రమంత్రి అమిత్ షాపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసల వర్షం కురిపించారని 'ఆంధ్రజ్యోతి' కథనం వెల్లడించింది.
''ఇటీవల కేంద్రం విడుదల చేసిన భారతదేశ పటంలో ఏపీ రాజధాని అమరావతిని గుర్తించపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పటంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నా.. రాజధాని లేకపోవడం వివాదాస్పదమైంది. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో ప్రస్తావించారు. స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో సవరించిన మ్యాప్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్టే శుక్రవారం కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేయడంపై చంద్రబాబునాయుడు స్పందించారు. మ్యాప్ విషయంలో త్వరగా స్పందించి సరిచేసినందుకు నిజంగా అభినందనీయులని పేర్కొన్నారు. ఈ ఒక్క పనితో తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారని ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ చిత్రపటంలో అమరావతిని చేర్చే విషయంలో వెంటనే స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొంటూ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, FACEBOOK/REVANTH REDDY ANUMULA
సభ్యత్వం కోసమైతే వస్తావా? చావుకు రావా?
మూడు వేల కోట్ల అప్పు ఉన్న ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తానంటే మరి 30 వేల కోట్ల అప్పు ఉన్న మెట్రోను ఏం చేస్తవని మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారని 'సాక్షి' కథనం వెల్లడించింది.
''ఆర్టీసీ సమ్మె శనివారానికి 50 రోజులకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యత్వం కోసం తెలంగాణకు వచ్చే అమిత్ షా, కార్మికులు చనిపోయినా స్పందించడం లేదన్నారు. ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందంటున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల చావులను మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. వారి చావులను కూడా 66 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 33 శాతం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరి ఒక్కటేనంటూ, ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, janasena
మాతృభాష పరిరక్షణకు పవన్ కల్యాణ్ ఉద్యమం
తెలుగు భాష, సంస్క్రతి, నదీ జలాల పరిరక్షణకు నడుం బిగించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారంటూ 'ఈనాడు' కథనం ప్రచురించింది.
''ఇందులో భాగంగా 'మన నుడి-మన నది' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. దీనిపై భాషా నిపుణులు, నదీ జలాల శాస్త్రవేత్తలు సలహాలు ఇవ్వాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 25 నుంచి డిసెంబరు 24 వరకు విజయవాడ బెంజి సర్కిల్‌లోని జనసేన కార్యాలయ చిరునామాకు, మెయిల్ ఐడీ mananudi_mananadi@janasenaparty.org కి, వాట్సాప్ నంబర్ 6304900788కి సూచనలు పంపించాలని కోరారు'' అని ఆ కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- 'జాత్యహంకార' గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘనా యూనివర్శిటీ
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
- యోని గురించి మీరు తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























