సీఎం జగన్ ఇల్లు, క్యాంప్ కార్యాలయానికి అల్యూమినియం కిటీకీలు, తలుపుల కోసం రూ.73 లక్షలు - ప్రెస్ రివ్యూ

జగన్

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM

ప్రచురణ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన తాడేపల్లిలోని ఇళ్లు, క్యాంపు ఆఫీసుకు కొత్తగా అల్యూమినియం కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ గత నెల్లో ఉత్తర్వులు జారీచేసిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

జగన్‌ ఎన్నికల ముందే ఈ నివాసాన్ని నిర్మించుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక క్యాంప్‌ ఆఫీసుగా ఉపయోగించుకుంటున్నారు. కొత్త భవనమే అయినప్పటికీ... భద్రత దృష్ట్యా కొన్ని గదులకు అల్యూమినియం తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాలని భావించారు.

జగన్‌ ఇళ్లు, క్యాంపు ఆఫీసులో కొత్తగా ఆల్యూమినియం కిటికీలు, తలుపులు ఇతర సదుపాయాలు కల్పించేందుకు రూ. 73 లక్షలు కేటాయిస్తూ అక్టోబరు 15న ఆర్‌అండ్‌బీ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ భవనాల మరమ్మత్తులు, నిర్వహణ, వసతి కల్పన, అభివృద్ధి పథకాల పద్దు కింద నిధులను ఖర్చు చేస్తారు.

ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు ఆయన ఇళ్లు, దాని పరిసరాల్లో అభివృద్ధి, భద్రతా చర్యల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసింది.

బస్సు

ఫొటో సోర్స్, FACEBOOK/TSRTC

టీఎస్ ఆర్టీసీ చట్టబద్ధతను ప్రశ్నించిన హైకోర్టు

టీఎస్‌ఆర్టీసీ అంశంపై విచారణ సందర్భంగా ఈ సంస్థ చట్టబద్ధతను హైకోర్టు ప్రశ్నించిందని ఈనాడు తెలిపింది.

ఈ సంస్థ ఆవిర్భావానికి తమ అనుమతి లేదని, దాని ఉనికికి గుర్తింపులేదని కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు. కేంద్రానికి సమాచారమిచ్చి అనుమతి తీసుకున్నాకే విభజన జరుగుతుందని, తమ 31 శాతం వాటా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉందని చెప్పారు. విభజనను కేంద్రం ఆమోదించలేదన్నారు.

దీనిపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సమాధానమిస్తూ- రవాణా చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఆర్టీసీ ఏర్పాటైందన్నారు. సెక్షన్ 47ఏతో సంబంధం లేదన్నారు. దీంతో ధర్మాసనం విభేదిస్తూ- సెక్షన్ 47ఏ ప్రకారం పునర్ వ్యవస్థీకరణ జరిగి టీఎస్‌ ఆర్టీసీగా కేంద్రం ఆమోదించినపుడే ఉనికి ఉంటుందని పేర్కొంది. కేంద్రం ఆమోదం లేనపుడు ఆర్టీసీ ఉనికికి చట్టబద్ధత ఏముందని ప్రశ్నించింది.

గజాలా హష్మీ

ఫొటో సోర్స్, FB/Hashmi4VASenate

ఫొటో క్యాప్షన్, గజాలా హష్మీ

అమెరికా ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్ ముస్లిం మహిళ

అమెరికాలో జరిగిన రాష్ట్రస్థాయి, స్థానిక ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన గజాలా హష్మీ (మున్నీ) చరిత్ర సృష్టించినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది.

చిన్నతనంలోనే దాదాపు 50 ఏళ్ల కింద తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడిన గజాలా ఈ ఎన్నికల్లో వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, తొలి భారత సంతతి మహిళగా రికార్డులు సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన హష్మీ రిపబ్లికన్ పార్టీ సెనేటర్ గ్లిన్ స్టర్టివాంట్‌ను ఓడించి వార్తల్లోకి ఎక్కారు.

ఎమోరీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆమె దాదాపు 25 ఏండ్లపాటు వర్జీనియాకు చెందిన కాలేజీ అండ్ యూనివర్సిటీ సిస్టమ్‌లో లీడింగ్ ఎడ్యుకేటర్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆమె రెనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజ్‌లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో గజాలా సహా నలుగురు ప్రవాస భారతీయులు వివిధ పదవులకు ఎన్నికయ్యారని ఈనాడు తెలిపింది.

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సాంకేతిక సలహాదారుగా సేవలందించిన సుహాస్ సుబ్రహ్మణ్యం, వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

మరో తెలుగు వ్యక్తి మనో రాజు శాన్‌ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా రెండోసారి ఎన్నికయ్యారు.

ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

తిరుమలలో అద్దెగదుల ధరలు పెంపు

తిరుమలలో అద్దె గదుల ధరలు పెరిగాయని, పెరిగిన ధరలన్నింటినీ గురువారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) అమల్లోకి తెచ్చినట్లు ప్రజాశక్తి తెలిపింది.

నందకం అద్దె గదుల ధరలు ఇప్పటివరకు రూ.600గా ఉండేవి. ఇప్పుడు ఇవి రూ.1000కి పెరిగాయి. కౌస్తుభం, పాంచజన్యంలో అద్దెగదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెరిగాయి.

వేంకటేశ్వరుడి భక్తులకోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3000 వరకు వసతి సదుపాయం ఉంది. రూ.100, రూ.500, రూ.600కు లభించే గదులను సాధారణ వసతి కింద లెక్కిస్తారు.

రూ.999, రూ.1500తో లభించే గదుల్లో ఏసీ సదుపాయం ఉంటుంది.

సామాన్యులు అధికంగా రూ.100కి వచ్చే వసతి గదుల్లో ఉంటారు. ఆ గదులు దొరకకపోతే రూ.500, రూ.600 చెల్లించి సాధారణ వసతి గదుల్లో ఉంటారు.

తిరుమలలో వసతిగదుల ధరలను పెంచినప్పటికీ తిరుపతిలో మాత్రం పెంచలేదు. రూ.100, రూ.200, రూ.300, రూ.400, రూ.600, రూ.800, రూ.1000కు లభ్యమయ్యే వసతి గదులను ఎప్పటిలాగే భక్తులు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)