నేటి నుంచి ప్రభుత్వ బ్యాంకుల పనివేళల్లో మార్పులు - ప్రెస్ రివ్యూ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళల్లో అక్టోబరు 1 నుంచి మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి.

రిజర్వు బ్యాంకు సూచించిన 3 రకాల పనివేళల్లో ఒకదానిని ఎంపిక చేసుకుని అమలు చేస్తారు.

భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు ఈ మూడు రకాల పనివేళలు రూపొందించారు.

  • ఉదయం 9 నుంచి మధ్నాహ్నం 3 వరకు
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు
  • ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు

అలాగే ఇక నుంచి ఖాతాదారులు తమ రుణచరిత్రను తెలిపే సిబిల్ స్కోరు సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యాంకర్ల సమితి అధికారులు సూచించారు. రైతులైనా సరే.. సిబిల్ స్కోరు ఆధారంగానే రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.

గాంధీ ఆస్పత్రిలో రోగులు

ఫొటో సోర్స్, Getty Images

క్లినికల్ ట్రయల్స్‌పై కొత్త విధానం తేవాలి

క్లినికల్ ట్రయల్స్‌పై నూతన విధానాన్ని తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సాక్షి ఓ కథనంలో తెలిపింది.

హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నపిల్లలపై ఔషధ ప్రయోగాలు జరిగినట్లు ఆరోపణలు రావడంపై ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది తీసుకొచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మరింత పకడ్బందీగా రాష్ట్రంలోనూ తీసుకురావాలని చూస్తోంది. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

ప్రస్తుతం ట్రయల్స్‌లో పాల్గొనేవారి వివరాలపై ఎలాంటి రికార్డులూ నమోదు చేయకపోవడం, కనీసం వారికి తెలియకుండా జరుగుతున్నాయనేదే ప్రధాన విమర్శ.

విమర్శలకు తావులేకుండా, నిబంధనల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించొద్దని సీఎం ఆదేశించినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి.

చంద్రబాబు

ఫొటో సోర్స్, CHANDRABABU/FB

మళ్లీ చీకటి రాజ్యం వచ్చింది

"ఇది రివర్స్ డెవలప్‌మెంట్ ప్రభుత్వం. అందుకే మళ్లీ కరెంటు కోతలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన నిరంతర విద్యుత్‌ను కూడా రివర్స్ చేసేశారు" అని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

9 గంటల విద్యుత్ అని చెప్పి, అందులో సగం కోసేశారని చంద్రబాబు అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండుతున్నా రాష్ట్రం చీకట్లో ఉందన్నారు. పీపీఏలను రద్దుచేసిన ఫలితమే ఈ కరెంటు కోతలని ఎద్దేవా చేశారు.

మళ్లీ చీకటి రాజ్యం వచ్చింది, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆనాడే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశానన్నారు.

థర్మల్ విద్యుత్ ఆధారపడతగినది కాదని, పర్యావరణ హితమూ కాదని చంద్రబాబు ట్విటర్ వేదికగా అన్నారు.

పట్నాలోని ప్రధాన వీధులన్నీ నీటమునిగాయి.

వందేళ్లలో రికార్డు వాన

దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. పలు రాష్ట్రాలు, ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలు భారీ వరదలను చవిచూశాయని నమస్తే తెలంగాణ ఓ కథనంలో తెలిపింది.

వారంరోజులపాటు ఆలస్యంగా దేశంలోని ప్రవేశించిన రుతుపవనాలు మొదట్లో మందగమనంతో సాగి, అనుమానాలు రేకెత్తించినా.. తర్వాత పుంజుకుని దేశమంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి.

జూన్-సెప్టెంబర్ మధ్యలో ఈ స్థాయిలో వర్షాలు పడటం గత 25 ఏళ్లలో ఇదే ప్రథమం అని వాతావరణ విభాగం ప్రకటించింది. 1901 నుంచి చూస్తే ఇది మూడో అత్యధిక వర్షపాతం అని వెల్లడించింది. కేవలం సెప్టెంబర్ వర్షపాతాన్నే చూస్తే గత 102 సంవత్సరాల్లో ఇదే రికార్డు వాన అని తెలిపింది.

అధికారికంగా సోమవారంతోనే వానల సీజన్ ముగిసినా, దేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగానే ఉన్నాయి. రుతుపవనాల ఉపసంహరణలో జాప్యం జరగడంలో కూడా ఇదే సుదీర్ఘకాలమని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో నాలుగైదు రోజులుండొచ్చని అంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)