"సీఎం క్యాంపు కార్యాలయం కుక్కకు ఇచ్చిన విలువ ప్రజలకు ఇవ్వడం లేదు": విజయశాంతి - ప్రెస్ రివ్యూ

విజయశాంతి

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

తెలంగాణలోని అమాయక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోని కుక్క జ్వరం వచ్చి చనిపోతే డాక్టర్లపై కేసులు పెడుతున్నారనే వార్తలు చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆవేదన వ్యక్తంచేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

''సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కుక్క ప్రాణాలకు ఉన్న విలువ కూడా తెలంగాణ ప్రజలకు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది" అని ఆమె ఆరోపించారు.

విషజ్వరాల బారినపడి అమాయక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఆరోగ్యశాఖ అధికారులపై చర్యలు లేవని విజయశాంతి ఆరోపించారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విషయంలో ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా, దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలూ లేవని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు ఎంతో ప్రేమగా పెంచుకున్న హస్కీ అనే కుక్క జ్వరం వచ్చి చనిపోతే మాత్రం చర్యలు మామూలుగా లేవని ఆమె వ్యాఖ్యానించారు. ఆ కుక్కకు సరైన విధంగా వైద్యం అందించకపోవడంతోనే మరణించిందనే కారణంతో దానికి చికిత్స చేసిన డాక్టర్ రంజిత్‌పై ఐపీసీ 429 సెక్షన్ 11(4) కింద, జంతువుల పట్ల క్రూరత్వాన్ని నివారించే చట్టం కింద కేసు పెట్టినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయిందని చెప్పారు.

సమంత, విజయ్ దేవరకొండ

ఫొటో సోర్స్, Instagram/FB/BBC

ఫొటో క్యాప్షన్, సమంత, విజయ్ దేవరకొండ

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు వద్దంటూ సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా చిత్రపరిశ్రమ గళమెత్తుతోందని ఈనాడు తెలిపింది. సోషల్ మీడియా వేదికగా 'సేవ్ నల్లమల' అంటూ సినీ ప్రముఖులు నినదిస్తున్నారని చెప్పింది.

ఈ అంశంపై చేంజ్.ఓఆర్‌జీ సంస్థ ద్వారా రాష్ట్రపతికి పంపుతున్న పిటిషన్‌పై నటి సమంత సంతకం చేసి తన మద్దతు తెలిపారు. మరో నటి అనసూయ కూడా మద్దతుగా సంతకం చేశారు.

సినీ నటుడు విజయ్ దేవరకొండ ట్విటర్లో స్పందిస్తూ- యురేనియం తవ్వకాల వల్ల నల్లమల నాశనమయ్యే ప్రమాదంలో ఉందని, యురేనియం కొనుక్కోవచ్చుగానీ అడవులను కొనుక్కోలేం కదా అని వ్యాఖ్యానించారు.

యురేనియం తవ్వకాలపై వ్యక్తమవుతున్న ఆందోళనను తాను పరిగణనలోకి తీసుకొంటున్నానని, దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేసిన ట్వీట్‌పై విజయ్ స్పందిస్తూ- ఇది తొలి విజయమని చెప్పారు.

"నల్లమల పరిరక్షణ జరిగే వరకు ఆపొద్దు. నల్లమలా! నీకు బేషరతుగా మద్దతు తెలిపే కోట్ల మంది సోదర సోదరీమణులున్నారు" అని ఆయన తెలిపారు.

మరో నటుడు గోపీచంద్ మాట్లాడుతూ- "చెట్లు బాగుంటే మనం బాగుంటాం. వాటిని నాశనం చేస్తే మన జీవితాన్ని మనం చేతులారా నాశనం చేసుకున్నట్లే. నల్లమలను రక్షించుకొందాం" అన్నారు.

నల్లమలను రక్షించుకుందామని నటులు రామ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కూడా ట్విటర్‌లో చెప్పారు.

అంబటి రాయుడు

ఫొటో సోర్స్, TWITTER/@RAYUDUAMBATI

ఫొటో క్యాప్షన్, అంబటి రాయుడు

హైదరాబాద్ కెప్టెన్‌గా అంబటి రాయుడు

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకున్న క్రికెటర్ అంబటి రాయుడు హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నియమితమైనట్లు సాక్షి తెలిపింది.

తనకు క్రికెట్‌పై ఆసక్తి తగ్గలేదని, తాను మళ్లీ క్రికెట్‌ ఆడటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు రాయుడు లేఖ రాయగా, అందుకు అనుమతి లభించింది.

త్వరలో విజయ్‌ హజారే ట్రోఫీ ఆడనున్న హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా రాయుడ్ని నియమిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది.

రాయుడు నేతృత్వంలోని జట్టును తాజాగా వెల్లడించారు.

12 వేల మంది టీచర్లు పరీక్ష రాస్తే 12 మంది పాసయ్యారు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) జూన్‌ 15న నిర్వహించిన గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (జీవో) టెస్ట్‌ ఫలితాలు ఉపాధ్యాయులకు మింగుడుపడడం లేదని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఈ డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల మంది ఎస్జీటీ, ఎస్‌ఏ టీచర్లు హాజరు కాగా, కేవలం 12 మందే ఉత్తీర్ణులయ్యారు. అంటే వెయ్యికి ఒక్కరు చొప్పున మాత్రమే పాసయ్యారు.

కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ఆన్‌లైన్ పరీక్షా విధానంతో ఇబ్బందులు పడుతున్న పాత టీచర్లు.. ఇటీవల ప్రవేశ పెట్టిన నెగిటివ్‌ మార్కులతో పూర్తిగా డీలా పడుతున్నారు.

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు రాసే వారిలో సింహభాగం సీనియారిటీ ఉన్న వారే.

24 సంవత్సరాల స్కేలు పొందటానికి సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ), 12 ఏళ్ల స్కేల్‌ కోసం స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), హెడ్మాస్టర్లుగా ప్రమోషన్‌ కోసం 50 ఏళ్లలోపు వయసున్న స్కూల్‌ అసిస్టెంట్లు ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ టెస్టులకు హాజరై ఉత్తీర్ణులు కావాల్సి ఉంది.

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయితేనే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే ఎంత సర్వీసు ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులు రావు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)