ఏపీలో మద్యం విక్రయ ఉద్యోగాలకు ఎంటెక్, ఎంబీఏ పట్టభద్రుల దరఖాస్తు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు నిర్దేశించిన సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌ పోస్టులకు ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు దరఖాస్తు చేసినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఈ పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. అయితే ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారి సంఖ్య మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది.

దరఖాస్తుదారుల్లో 40-50 శాతం మంది మాత్రమే ఎంపిక ప్రక్రియలకు హాజరవుతున్నారు. చాలా జిల్లాల్లో పరిస్థితి ఇలానే ఉంది.

ఇంటర్వ్యూలకు వస్తున్నవారిలో బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ తదితర ఉన్నత విద్యలను అభ్యసించిన వారు 4-5 శాతం వరకు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికి మాత్రమే ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

''కేసీఆర్ మాట తప్పారు.. టీఆర్‌ఎస్‌కు నేనూ ఓనర్నే''

టీఆర్‌ఎస్‌కు తానూ ఓనర్నేనని, కిరాయిగాళ్లు ఎప్పుడైనా బయటకు పోతారని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే… 'ముఠా గోపాల్‌ను గెలిపించుకురా… మంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన మాట తప్పారు' అని నాయిని అన్నారు.

ఆ సమయంలో.. 'నాకైనా, మా అల్లుడికైనా టికెట్ ఇవ్వమని అడిగాం. కానీ అలా జరగలేదు. ఇప్పుడు నాకు ఏ కార్పొరేషన్ ఛైర్మన్ పదవీ వద్దు' అని ఆయన చెప్పారు.

''రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పని చేశాను. ఇప్పుడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తానంటే ఎవరికి కావాలి?'' అని ఆయన వ్యాఖ్యానించారు.

అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ టాప్‌

ఆంధ్రప్రదేశ్‌లో మోసపూరిత, డబుల్‌ రిజిస్ట్రేషన్లలో విజయవాడ అగ్రస్థానంలో ఉందని సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

దీని ప్రకారం.. రాష్ట్రం మొత్తమ్మీద ఇటీవల కాలంలో 282 తప్పుడు/డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

రాష్ట్రంలో 26 రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఉండగా.. ఆరింటిలో ఎలాంటి ఫిర్యాదుల్లేవు. మిగిలిన 20 రిజిస్ట్రేషన్‌ జిల్లాలను పరిశీలిస్తే.. విజయవాడలో 84, విశాఖపట్నంలో 39, ఒంగోలులో 27, చిత్తూరులో 24, అనంతపురంలో 20 అక్రమ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఫిర్యాదులున్నాయి.

ఈ ఫిర్యాదులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ జరిపింది. 44 కేసులకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ సాగుతోంది. భూములు, స్థలాలు తదితర స్థిరాస్తుల విలువలు భారీగా పెరిగినందువల్లే భారీ మోసాలు జరుగుతున్నట్లు సాక్షి తెలిపింది.

టీడీపీ పునరావాస కేంద్రాల్లోని వారంతా పెయిడ్ ఆర్టిస్టులే: ఏపీ హోం మంత్రి సుచరిత వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకాలేదని హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

పెయిడ్‌ ఆర్టిస్టులతో పునరావాస శిబిరాలు నిర్వహిస్తూ ప్రశాంతతకు భంగం కలిగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చూస్తున్నారని, శిబిరాలకు ఉన్నత పోలీసు అధికారులను పంపించి నిజాలు తేలుస్తామని సుచరిత వ్యాఖ్యానించారు.

పల్నాడు ప్రాంతంలో దాడుల బాధితులుగా చెబుతున్నవారిలో నిజమైన బాధితులను గుర్తించేందుకు విచారణ బృందాలు ఏర్పాటుచేశామని తెలిపారు. వారు నిజంగా బాధితులే అయితే పోలీసు బందోబస్తుతో సొంత గ్రామాలకు తీసుకెళ్లి ప్రశాంత వాతావరణంలో బతికేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక ఎక్కడా రాజకీయ హత్యలు జరగలేదని చెప్పారు. ప్రజల్ని రెచ్చగొట్టినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చర్యలు తప్పవన్నారు.

టీడీపీ తలపెట్టిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి ఇప్పటి వరకు తమను ఎవరూ అనుమతి కోరలేదన్నారు. మరోవైపు, పల్నాడు ప్రాంతంలో బయట నుంచి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చేపట్టే ఊరేగింపులకు అనుమతులు ఇవ్వబోమని డీజీపీ గౌతం సవాంగ్‌ స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)