దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి పునర్నియామకం - ప్రెస్ రివ్యూ

విజయసాయిరెడ్డి

ఫొటో సోర్స్, Twitter/@VSReddy_MP

ప్రచురణ

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించిందని, ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందని ఈనాడు తెలిపింది.

దిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పదవిని లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేయడంతో తాజాగా నియామకం జరిగింది. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

ఇంతకుముందు దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించిన కొద్దిరోజులకే, ఆ నియామకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి మరో లాభదాయక పదవి (ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌) చేపట్టడం నిబంధనలకు విరుద్ధం కావడంతో నియామకాన్ని రద్దు చేసింది.

ఆర్డినెన్స్‌తో ఆ అడ్డంకి తొలగిపోవడంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయి కొనసాగనున్నారు.

అనిత
ఫొటో క్యాప్షన్, అనిత

ఎఫ్ఆర్వో అనితపై అట్రాసిటీ కేసు

తెలంగాణలోని కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌ ఎఫ్‌ఆర్వో (ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌) అనిత, మరో 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారని ఆంధ్రజ్యోతి రాసింది.

వారం రోజుల క్రితం మండలంలోని సార్సాల గ్రామంలో మొక్కలు నాటేందుకు వచ్చిన తనను ఎఫ్‌ఆర్వో అనిత, సిబ్బంది కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు అదే గ్రామానికి చెందిన నాయిని సరోజ ఈసుగాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ ఆదివారం చెప్పారు.

ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన వివరించారు.

టీకా మందు

ఫొటో సోర్స్, Getty Images

ఉచితంగా రూ.7 కోట్ల టీకా మందులు ఇస్తాం: భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో రూ.7 కోట్ల విలువైన టీకామందులను ఉచితంగా అందిస్తామని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా ప్రకటించారని ఈనాడు చెప్పింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కడ అవసరమున్నా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని వాల్టన్‌ ఈ వాషింగ్టన్‌ సెంటర్‌లో తానా 22వ మహాసభలు శనివారం ఘనంగా ముగిశాయి.

ఈ నెల 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు జరిగిన మహాసభలకు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా నలుమూలల నుంచి సినీ, రాజకీయ, సాహిత్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సభల్లో పాల్గొన్న కృష్ణ ఎల్లా తానా తరపున మిలియన్‌ డాలర్ల టీకా ఔషధాలు అందించేందుకు ముందుకొచ్చారని సంఘ సంయుక్త కార్యదర్శి అశోక్‌ కొల్లా చెప్పారు.

తప్పుడు పార్కింగ్‌కు రూ.10 వేల జరిమానా

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై అక్రమంగా పార్కింగ్‌ చేసిన వాహనాలకు విధించే భారీ జరిమానా ఆదివారం అమల్లోకి వచ్చిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

మొత్తం 56 వాహనాలకు జరిమానా విధించగా అందులో 9 కార్ల యజమానులు రూ.10,000 చొప్పున చెల్లించారు. మిగిలినవారు పెనాల్టీతో కలిపి త్వరలో చెల్లించే అవకాశముంది.

నో పార్కింగ్‌ జోన్‌లో వాహనం నిలిపితే కనిష్ఠంగా రూ.5 వేల నుంచి గరిష్ఠంగా రూ.23 వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా 5.28 లక్షల పోలీసు ఉద్యోగాల ఖాళీ

వివిధ రాష్ట్రాల్లో 5,28,396 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ తెలిపిందని నమస్తే తెలంగాణ రాసింది.

అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (యూపీ)లో 1.29 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోంశాఖ గణాంకాలు తెలిపాయి.

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌కు 21,292 పోస్టులు మంజూరు చేయగా, అదనంగా 941 మంది పోలీసులు ఉన్నారు. గత ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి అన్ని రాష్ట్రాలకు 23,79,728 పోస్టులు మంజూరు చేయగా, 18,51,332 మంది పోలీసులు పనిచేస్తున్నారని హోంశాఖ అధికారి చెప్పారు.

యూపీకి అత్యధికంగా 4,14,492 పోలీసు ఉద్యోగాలు మంజూరు చేయగా, ప్రస్తుతం 2,85,952 మంది పనిచేస్తున్నారు.

బిహార్‌లో 50,291 పోస్టులు, పశ్చిమ బెంగాల్లో 48,981, తెలంగాణలో 30,345 పోస్టులు ఖాళీగా ఉన్నా యి.

పోలీసు ఉద్యోగ నియామకాల్లో జాప్యానికి తోడు రిటైర్మెంట్‌, అకాల మరణాల వల్లే భారీ సంఖ్యలో ఖాళీలున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)