చైనా బెలూన్ యూఎస్ సైనిక స్థావరాల సమాచారాన్ని ఆ దేశానికి పంపించింది: అమెరికా మీడియా కథనం
తన గగనతలంలో కనిపించిన భారీ చైనా బెలూన్‌ను అమెరికా కొద్ది వారాల కిందట కూల్చేసింది.
ఇది నిఘా బెలూన్ అని అమెరికా ఆరోపించగా చైనా అలాంటి ఆరోపణలను కొట్టిపడేసింది.
అయితే, ఆ బెలూన్‌ను కూల్చేయడానికి ముందు రోజే అది అమెరికా సైనిక స్థావరాల నుంచి కొంత సమాచారాన్ని సేకరించి చైనాకు చేరవేసినట్లు యూఎస్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఆ బెలూన్ బీజింగ్‌కు ఎప్పటికప్పుడు సమాచారం పంపించే సామర్థ్యం ఉందని యూఎస్ అధికారులను ఉటంకిస్తూ ఎన్‌బీసీ న్యూస్ కథనం రాసింది.
సైనిక స్థావరాల ఫొటోలు వంటివి కాకుండా ఎలక్ట్రానిక్ సిగ్నళ్లను ఈ బెలూన్ సేకరించి బీజింగ్ పంపించిందని ఆ కథనంలో రాశారు.
అయితే, వైట్ హౌస్ దీనిని ఇంకా ధ్రువీకరించలేదు.
మరోవైపు ఈ బెలూన్ అమెరికా గగనతలంలో ఉన్న సమయంలో దాని నిఘా సామర్థ్యాలను తాము పరిమితం చేయగలిగామని అమెరికా అధికారులు చెప్పారు.
కాగా ఈ బెలూన్‌ను అమెరికా ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో కూల్చేసింది.
ఫైటర్ జెట్‌లతో తమ ప్రాదేశిక జలాలలోనే ఆ భారీ బెలూన్‌ను కూల్చివేశాయని అమెరికా రక్షణ శాఖ అప్పట్లో ప్రకటించింది.
బెలూన్ సముద్రంలో పడిపోతున్న దృశ్యాలు అమెరికా టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. చిన్నపాటి పేలుడు తరువాత ఆ భారీ బెలూన్ పగిలి సముద్రంలో పడిపోతుండడం ఆ వీడియోలలో కనిపించింది.
పేలిన బెలూన్ భాగాలు, అందులోని పరికరాలను సముద్రంలో 11 కిలోమీటర్ల మేర పడ్డాయి.
ఆ శిథిలాలను తాము ఇంకా పరిశీలిస్తున్నామని అమెరికా రక్షణ అధికారులు చెప్తున్నారు.