ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీలుపై విచారణను సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 13న చేపట్టనుంది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
శంకర్ వడిశెట్టి
బీబీసీ కోసం
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో ఎనిమిది గంటలపాటు విచారించారు.
కేసులో రామోజీరావు ఏ-1గా ఉన్నారు. ఆయన కోడలు, సంస్థ ఎండీ శైలజా కిరణ్ ఏ-2గా ఉన్నారు.
ఈ కేసులో కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా రామోజీరావును మళ్లీ విచారిస్తామని సీఐడీ అధికారులు చెప్పారు.
మార్గదర్శిపై ఇప్పటివరకు ఏడు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక కేసుకు సంబంధించి రామోజీరావును విచారించారు.
ఏప్రిల్ 6న శైలజను విచారిస్తామని సీఐడీతెలిపింది.
అమరేంద్ర యార్లగడ్డ
బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో పదో తరగతి పరీక్షల క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కలకలం రేగింది.
వికారాబాద్ జిల్లా తాండూరులో సోమవారం ఉదయం పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే వాట్సాప్ గ్రూపులో క్వశ్చన్ పేపర్ ప్రత్యక్షమైంది.తెలంగాణలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున తెలుగు పరీక్ష జరిగింది.
ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగానే, తెలుగు క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లోప్రత్యక్షమైంది.
తాండూరు ప్రభుత్వ నంబరు వన్ పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో రిజర్వ్ ఇన్విజిలేటర్‌గా ఉన్న బందప్ప అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు పంపినట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు.
ఓ తరగతి గదిలో పరీక్షకు హాజరుకాని విద్యార్థి బెంచీపై ఉన్న ప్రశ్నపత్రాన్ని సెల్ ఫోన్లో ఫొటో తీసినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక మీడియా గ్రూపులోనూ దానిని షేర్ చేసినట్లు కనుక్కున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ విద్యా శాఖ విచారణకు ఆదేశించింది. పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని విధుల నుంచి తప్పించింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రశ్నపత్రం పరీక్షకు ముందు లీక్ కాలేదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మీడియాతో చెప్పారు. పేపర్ లీక్ అయిన తర్వాత అది విద్యార్థుల వరకు చేరలేదని, మిగతా పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు.
స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బందప్ప ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో ఉదయం 9.35కు ఫిజికల్ సైన్స్ టీచర్ సమ్మప్పకుపంపారని ఆయన తెలిపారు. మీడియా వాట్సాప్ గ్రూపులో 9.37కు షేర్ చేశారని చెప్పారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ శివ కుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ గోపాల్, బందప్ప, సమ్మప్పతో కలిపినలుగుర్ని సస్పెండ్ చేశామని వివరించారు.
ఈ విషయంపై బందప్ప, సమ్మప్ప ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారని, విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని కలెక్టర్ చెప్పారు.
సుచిత్రా మొహంతి
బీబీసీ కోసం
2019 నాటి క్రిమినల్ పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడి, లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
ఆయనకు ఏప్రిల్ 13 వరకు కోర్టు బెయిలు మంజూరు చేసిందని ఆయన న్యాయవాది కిరీట్ పన్వాలా బీబీసీకి తెలిపారు. పరువు నష్టం కేసులో తనను కింది కోర్టు దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ రాహుల్ దాఖలు చేసిన అప్పీలుపై విచారణను సెషన్స్ కోర్టు అదే రోజు చేపట్టనుందని చెప్పారు.
ఆయన్ను దోషిగా ప్రకటిస్తూ, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 23న తీర్పు ఇచ్చింది.
నేరాన్ని నిర్ధరించడం, శిక్ష విధించడంపై సెషన్సు కోర్టు స్టే ఇవ్వలేదని న్యాయవాది కిరీట్ బీబీసీకి వివరించారు.
రాహుల్ వ్యాఖ్యలపై కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసిందని చెప్పారు.
రాహుల్ అప్పీలుపై ఏప్రిల్ 10లోపు సమాధానం దాఖలు చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ 13న రాహుల్ అప్పీలుపై విచారణ ఉంటుందని వివరించారు.
కేసులో రాహుల్ నేర నిర్ధరణ(కన్విక్షన్)పై స్టే ఇచ్చే వరకు రాహుల్‌పై అనర్హత కొనసాగుతుంది.
కన్విక్షన్‌పై అప్పీలుతోపాటు రాహుల్ రెండు దరఖాస్తులను సెషన్స్ కోర్టుకు సమర్పించారు.
వీటిలో ఒకటి నేర నిర్ధరణను సస్పెండ్ చేయడం (సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్) కోసం, మరొకటి శిక్షను సస్పెండ్ చేయడం (సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్) కోసం సమర్పించినట్లు న్యాయవాది కిరీట్ బీబీసీకి చెప్పారు.
శిక్షను సస్పెండ్ చేయాలంటూ వేసిన దరఖాస్తు సాధారణ బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తు కూడా.
నేర నిర్ధరణను సస్పెండ్ చేయాలంటూ వేసిన దరఖాస్తును కోర్టు అనుమతిస్తే, ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణకు వీలుంటుంది.
దొంగలందరి ఇంటి పేర్లలో 'మోదీ' అని ఎలా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారంటూ 2019లో ఒక క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలైంది.
ఈ కేసులో ఆయనకు సూరత్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. శిక్ష అమలును 30 రోజులు సస్పెండ్ చేసింది. అప్పీలు చేసుకొనేందుకు ఆయనకు అవకాశం ఇచ్చింది.
రాహుల్‌తోపాటు కోర్టుకు వచ్చిన ప్రియాంకా గాంధీ
సూరత్ సెషన్స్ కోర్టుకు రాహుల్ గాంధీ వెంట ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా వచ్చారు.
అంతేకాదు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ వెంట కోర్టుకు వచ్చారు.
కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని ఇలత్తూర్ వద్ద కదులుతున్న రైలులో గుర్తు తెలియని వ్యక్తి, తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన ఘటన జరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
రాత్రి 10 గంటల సమయంలో అలప్పుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్‌లోని డీ-1 కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో గాయపడిన 8 మందిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో రైల్వే ట్రాక్ వద్ద ముగ్గురి మృతదేహాలను కనుగొన్నారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది.
ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై కన్నూర్ ఎంపీ, కేపీసీసీ అధ్యక్షుడు కె. సుదర్శన్, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు లేఖ రాశారు.
బాధితులతో పాటు, మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఝార్ఖండ్‌లోని ఛాత్రాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
మరణించిన అయిదుగురిలో ఇద్దరిపై రూ. 25 లక్షల చొప్పున, మరో ఇద్దరిపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పేర్కొంది.
‘‘ఛాత్రా ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు నక్సల్స్ మరణించారు. వారిలో ఇద్దరిపై రూ. 25 లక్షల చొప్పున, మరో ఇద్దరిపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉంది. వారి నుంచి 2 ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నాం. ఆపరేషన్ కొనసాగుతోంది’’ అని ఝార్ఖండ్ పోలీసులు చెప్పారు.
సినీ నటి జాన్వీ కపూర్ తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
సోమవారం వేకువన వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆమె దర్శనం చేసుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు.
కాగా జూనియర్ ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్ నటించబోతున్నారు. త్వరలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు, ఎండీ శైలజ కిరణ్‌లను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.
ఈ కేసులో ఏ-1గా రామోజీరావు, ఏ-2గా శైలజ ఉన్నారు.
హైదరాబాద్‌లోని శైలజ ఇంట్లోనే ఈ విచారణ సాగుతోంది.
మార్గదర్శి ద్వారా సేకరించిన డిపాజిట్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా దర్యాప్తుకు సహకరించాలని రామోజీరావు, శైలజలకు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా ఈ విచారణ జరుగుతోంది.
మార్గదర్శి కేసులో ఇప్పటికే పలు చోట్ల సోదాలు నిర్వహించారు. మార్గదర్శి సిబ్బంది, ఆడిటర్లను కూడా అరెస్టు చేసి రిమాండ్ కి పంపించిన నేపథ్యం ఉంది. దాంతో తాజా విచారణ తర్వాత సీఐడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
జాతీయ జెండాను అగౌరవపరిస్తే భారత్ సహించబోదని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
గత నెలలో లండన్‌లోని భారత హై కమిషన్ ఎదుట ఖలిస్థానీ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైకమిషన్‌లోని జెండాను తొలగించి దాని స్థానంలో ఖలిస్థాన్ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటన గురించి జై శంకర్ ప్రస్తావిస్తూ, లండన్‌లోని భారత హైకమిషన్‌లో మరింత పెద్ద జెండాను ఏర్పాటు చేసి ఖలిస్థాన్ మద్దతుదారులకు, బ్రిటన్ వారికి సందేశాన్ని ఇచ్చామని అన్నారు.
‘‘గత కొన్ని రోజులుగా కెనడా, లండన్, ఆస్ట్రేలియా, శాన్ ఫ్రాన్సిస్కోలలో జరిగిన ఘటనలను మీరు చూసే ఉంటారు. ఇది మనుపటి భారత్ కాదు, జాతీయ జెండాను అగౌరవపరిస్తే చూస్తూ సహించే భారత్ కాదు ఇది.
లండన్‌లోని భారత హైకమిషన్‌లో ఈ ఘటన జరిగిన వెంటనే భారత హైకమిషనర్ అక్కడ మరింత పెద్ద జెండాను ఎగురవేశారు. ఖలిస్థానీ మద్దతుదారులకే కాదు, ఎవరైనా భారత జెండాను అగౌరవపరిస్తే బ్రిటన్‌లో మరింత పెద్ద భారత జెండా పైకి ఎగురుతుందనే సందేశాన్ని బ్రిటన్ వారికి ఇవ్వడమే దీని వెనుక మా ఉద్దేశం’’ అని ఆయన అన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై కళాక్షేత్ర ప్రొఫెసర్ హరి పద్మన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న కళాక్షేత్ర ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మాజీ విద్యార్థిని ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీ జిల్లాలో ఆదివారం సాయంత్రం చెలరేగిన హింసలో ఒక బీజేపీ ఎమ్మెల్యేతో పాటు పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి.
రిసడా గ్రామంలో బీజేపీ చేపట్టిన శోభాయాత్రపై రాళ్ల రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం వాహనాలకు నిప్పు పెట్టడం, అల్లర్లు చెలరేగాయి.
ఈ హింసాత్మక ఘటనలో ఖానాకుల్ నియోజవర్గ ఎమ్మెల్యే విమాన్ ఘోష్ గాయపడ్డారు.
విమాన్ ఘోష్ తలకు గాయమైందని, ఆయనను ఉత్తర్‌పరా ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు. రాళ్లు రువ్వడంతో రిసడా పోలీస్ స్టేషన్‌కు చెందిన కొంతమంది పోలీసులు గాయపడ్డట్లు తెలిపారు.
ఆదివారం చెలరేగిన హింస తర్వాత ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అక్కడ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం రాత్రి నుంచి 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు చందన్ నగర్ పోలీస్ కమిషనర్ అమిత్ జవాల్గి చెప్పారు.
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ఫిన్లాండ్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనల్ కోలిషన్ పార్టీ (ఎన్‌సీపీ) పార్టీ నేత పెటోరీ ఓర్పో విజయం సాధించారు.
కన్వర్జేటివ్ నాయకుడైన పెటోరీ ఓర్పోకు ఎన్నికల్లో 20.8 శాతం ఓట్లు దక్కగా, రైట్ వింగ్ పాపులిస్ట్ ఫిన్నిస్ పార్టీకి 20.1 శాతం ఓట్లు పోలయ్యాయి. మారిన్ ప్రాతినిధ్యం వహించిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ 19.9 శాతం ఓట్లను తగ్గించుకుంది.
ఎన్నికల్లో గెలుపొందిన నేషనల్ కోలిషన్ పార్టీకి సనా మారిన్ శుభాకాంక్షలు తెలిపారు.