You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు ఎందుకు ఓడించారు?: ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రశ్న
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది.
లైవ్ కవరేజీ
సింగిల్ స్క్రీన్ థియేటర్స్: శిథిలాలుగా మారుతున్న ఒకనాటి భారతదేశ సినిమా వైభవ ప్రతీకలు
కృత్రిమ అవయవాలతో స్పర్శ ఎలా కలుగుతుంది?
హైదరాబాద్: నగరంలో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేడ్కర్ విగ్రహం
ఛత్తీస్‌గఢ్: భార్యను చంపి, ముక్కలు చేసి నీళ్ల ట్యాంకులో దాచాడు
భార్యను చంపి, శవాన్ని ముక్కలు చేశారనే ఆరోపణలతో చత్తీస్‌గఢ్‌లో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
పోలీసుల వివరాల ప్రకారం, బిలాస్‌పుర్‌కు చెందిన పవన్ ఠాకుర్ తన భార్య సతీ సాహును చంపేశారు. ఆ తరువాత శవాన్ని ముక్కలు చేసి, ఇంట్లోని నీళ్ల ట్యాంకులో వేశారు.
తన భార్య మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను పవన్ ఠాకుర్ చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
సుమారు ఒకటి రెండు నెలల కిందట ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో గ్రామస్థులకు దొరికిన పులి పిల్లలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడ పురం గ్రామంలో నాలుగు పులి పిల్లలు దొరికాయి.
ఉదయం గ్రామస్థులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ముళ్లపొదలో ఉన్న పులి పిల్లలను చూశారు. కొద్ది దూరంలో పులి పిల్లల తల్లిని కూడా గుర్తించారు.
పులి పిల్లలు ఎండకు తాళలేక ముళ్లపొదల్లో దాక్కోవడాన్ని చూసిన స్థానికులు వాటిని గ్రామంలోకి తీసుకొని వచ్చి గంపలో ఉంచారు.
తరువాత ఈ విషయాన్ని ఆత్మకూరు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే, వారు సంఘటన స్థలానికి చేరుకొని పులి పిల్లలను పరిశీలించారు.
పులి పిల్లల తల్లిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పెద్దపులిని పట్టుకున్నాక తల్లి పిల్లలను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.
శ్రీకాకుళం: ఆటో నుంచి కుప్పలుతెప్పలుగా ఎగిరిపడ్డ 500 రూపాయల నోట్లు
మడపాం టోల్ ప్లాజా వద్ద శ్రీకాకుళం నుంచి నరసన్నపేట జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి.
అక్కడ విధులు నిర్వహిస్తున్న టోల్‌గేట్ సిబ్బంది ఆటోను వెంబడించి కేకలు వేసినా, ఆటో డ్రైవర్ ఆపకుండా పరారయ్యారు.
రాత్రి సమయంలో ఎక్కువ లైట్లు వాడడం వల్ల వెలుగులో ఆటో నెంబర్ సీసీ ఫుటేజ్‌లో నమోదు కాలేదు.
టోల్‌గేట్ నిర్వాహకులు ఆటో నుంచి జారిపడ్డ 500 రూపాయలు ఏరి సమీప నరసన్నపేట పోలీస్ స్టేషన్లో మొత్తం 88 వేల రూపాయలను ఎస్ఐకు అందించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో షూటింగ్ సమయంలో గాయపడిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. అమితాబ్ తన బ్లాగులో దీని గురించి సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్‌లో 'ప్రాజెక్ట్ కే' చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా గాయపడ్డానని చెప్పారు.
ఆయన పక్కటెముకకు గాయమైంది. శ్వాస తీసుకోవడంలో, కదిలేటప్పుడు నొప్పిగా ఉందని, అందుకు మందులు ఇచ్చారని చెప్పారు.
అమితాబ్ బచ్చన్ కోలుకునే వరకు అన్ని కార్యక్రమాలను వాయిదా వేశారు.
కైలాస: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంత ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి?
సానియా మీర్జా ఫేర్‌వెల్: ఆట ఎక్కడ మొదలైందో అక్కడే ముగించిన టెన్నిస్ స్టార్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 20 ఏళ్ల క్రితం హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తన కెరీర్‌లోని మొదటి మ్యాచ్ ఆడారు.
ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా ఆదివారం అదే స్టేడియంలో వీడ్కోలు మ్యాచ్ ఆడారు.
భారత టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్నతో సింగిల్స్ ఆడారు. బోపన్న, సానియా కలిసి ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్‌తో డబుల్స్ ఆడారు.
ఈ వీడ్కోలు మ్యాచ్ చూడ్డానికి వచ్చిన క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా సరదాగా సానియాతో టెన్నిస్ ఆడారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిరిజు సానియా చివరి వీడ్కోలు మ్యాచ్ చూసేందుకు వచ్చారు.
అనంతరం, సానియా మిర్జా వీడ్కోలు పార్టీ ఘనంగా జరిగింది. దీనికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు క్రికెటర్లు వచ్చారు.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, నటుడు మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత సహా అనేకమంది సెలెబ్రిటీస్ పార్టీలో సందడి చేసారు.
రెహ్మాన్, మహేశ్ పార్టీలో తీసుకున్న సెల్ఫీలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
"ఎంత గొప్ప ప్రయాణం! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం" అంటూ మహేశ్ బాబు సానియా మీర్జాను అభినందించారు.
బంగ్లాదేశ్: రోహింజ్యా శిబిరాల్లో మంటలు... ఆశ్రయం కోల్పోయిన వేలమంది శరణార్థులు
చైనా రక్షణ బడ్జెట్ 7 శాతం పెంపు.. సైన్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
చైనా ఈ ఏడాది సైనిక బడ్జెట్‌ను ఏడు శాతం పెంచనున్నట్టు వార్షిక పార్లెమెంటు సమావేశంలో నిర్ణయించింది. చైనాకు "ముప్పు పెరుగుతోందని" చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా ప్రీమియర్ లీ కెకియాంగ్ ప్రకటించారు.
ఈ సమావేశాల్లోనే షీ జిన్‌పింగ్ మూడవసారి అధికారికంగా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.
చైనా రక్షణ బడ్జెట్ సుమారు 225 బిలియన్ డాలర్లు ఉంటుంది. అమెరికా రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే ఇది తక్కువే. అమెరికా బడ్జెట్ దీనికి నాలుగింతలు ఎక్కువ.
అయితే, చైనా రక్షణ కోసం చేసే ఖర్చును తక్కువ చేసి చూపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
పార్లమెంటులో ప్రస్తుత చైనా ప్రీమియర్ లీ కెకియాంగ్ మాట్లాడుతూ, "చైనాను నియంత్రించడానికి, అణచివేయడానికి బయటి నుంచి ప్రయత్నాలు పెరుగుతున్నాయని, సైనిక బలగాలు మిలటరీ శిక్షణ, సంసిద్ధతను ముమ్మరం చేయాలని" అన్నారు.
మరోవైపు, చైనా ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యాన్ని 5 శాతానికి తగ్గిస్తుందని ఈ సమావేశంలో ప్రకటించారు.
ఈ సమావేశం షీ జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా ధృవీకరిస్తుంది. గత ఏడాది అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ జిన్‌పింగ్‌కు తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఇప్పుడు చైనా అధ్యక్షుడిగా, సాయుధ దళాల అధిపతిగా షీ జిన్‌పింగ్ పదవిని చేపడతారు.
జపాన్ వంటి ఇతర శక్తిమంతమైన దేశాలు కూడా తమ సైనిక బడ్జెట్‌ను పెంచుతున్నాయి.
భారత్ 2023-24 సంవత్సరానికి 72.4 బిలియన్ డాలర్ల సైనిక బడ్జెట్‌ను ప్రకటించింది. 2022-23లో ఇది 76.88 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది కొంత తగ్గినట్టే.
రక్షణ బడ్జెట్ విషయంలో అమెరికా, చైనా తరువాత భారత మూడో స్థానంలో ఉంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.