దక్షిణాఫ్రికాలో
కొత్త జులు రాజుకు పట్టాభిషేకం జరిగింది. తీర ప్రాంతమైన డర్బన్ నగరంలో జరిగిన ఈ
చరిత్రాత్మక కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.
డర్బన్ నగరంలో
జరిగిన ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో కింగ్ మిసుజులు కా జ్వెలితినిని లాంఛనంగా
చక్రవర్తిగా గుర్తిస్తూ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ధృవపత్రం అందించారు.
దక్షిణాఫ్రికా
1994లో స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తొలి జులు పట్టాభిషేక కార్యక్రమం ఇది.
జులు గత రాజు
కింగ్ గుడ్‌విల్ జ్వెలితిని గత ఏడాది చనిపోయారు. ఆయన వారసుడి ఎంపిక కోసం అప్పటి
నుంచీ తీవ్ర సంఘర్షణ సాగింది.
కింగ్ గుడ్‌విల్
జ్వెలితిని అత్యంత సుదీర్ఘకాలం పాటు జులు చక్రవర్తిగా ఉన్నారు. యాభై ఏళ్లకు పైగా
సింహాసనంలో కొనసాగిన ఆయనకు ఆరుగురు భార్యలు, 26 మంది సంతానం ఉన్నారు.
ఆయన మరణానంతరం
ఆయన భార్యను (కింగ్ మిసుజులు తల్లిని) రాణిగా ప్రకటించారు. అయితే ఆమె కూడా నెల
రోజుల్లోనే హఠాత్తుగా చనిపోయారు. దీంతో సింహాసనం కోసం పోరాటం ముదిరింది.
ఎట్టకేలకు కింగ్ మిసుజులు చక్రవర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సామ్రాజ్యాన్ని, ప్రజలను కింగ్ మిసుజులు సమైక్యం చేస్తారని తాను నమ్ముతున్నట్లు ఆయన సోదరుడు యువరాజు బాంబినడ్లోవు జులు బీబీసీతో పేర్కొన్నారు.
‘‘జులులు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ సమయంలో చరిత్ర నన్ను ఎంచుకుందని నేను భావిస్తున్నా. పేదరికం, నిరుద్యోగం, ప్రభుత్వం మీద, సంప్రదాయ నాయకత్వం మీద విశ్వాస లోపం, వాతావరణ మార్పు, ఆహార అభద్రత అనేవి ఆ సవాళ్లు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావటానికి నేను వారధిగా పనిచేస్తానని ఆశిస్తున్నా’’ అని కింగ్ మిసుజులు తన తొలి ప్రసంగంలో చెప్పారు.
అమాజులు జాతిని కలిపి ఉంచే ఆధారం కింగ్ మిసుజులు అని అధ్యక్షుడు రామఫోసా అభివర్ణించారు.
జులు సంస్కృతికి ప్రత్యేకమైన చిరుతపులి చర్మాన్ని శరీరంపై ధరించి కింగ్ మిసుజులు పట్టాభిషిక్తులయ్యారు.