You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జస్టిస్ డీవై చంద్రచూడ్: ‘న్యాయమూర్తులను విమర్శించడానికి ఒక హద్దు ఉండాలి’

‘నేను కరోనాతో బాధపడుతూ సెలవు తీసుకున్నా. అందువల్ల ఆ కేసు వాయిదా పడింది. కానీ న్యాయమూర్తులు కేసును తీసుకోవడం లేదంటూ మీడియాలో వచ్చిన వార్తలు చూశా.’

లైవ్ కవరేజీ

  1. ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అన్నారంటూ బీజేపీ ఆందోళన

    ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధరి పిలిచారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది.

    కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తోపాటు ఇతర బీజేపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసనకు దిగారు.

    ‘ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆమెను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంది. ఆమె గెలిచిన తరువాత కూడా అది ఆగలేదు’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.

  2. తొలిసారి తగ్గిన ‘ఫేస్‌బుక్’ ఆదాయం

    ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఆదాయం తొలిసారి తగ్గింది.

    2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 28.82 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2021 ఇదే త్రైమాసికంలో 29.07 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.

    మొత్తం మీద ఆదాయంలో 1శాతం తగ్గుదల కనిపించింది. 2007లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తరువాత మెటా ఆదాయం తగ్గడం ఇదే తొలిసారి.

    ఇక లాభం కూడా 36శాతం తగ్గి 6.69 బిలియన్ డాలర్లు నమోదైంది.

    ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వల్ల డిజిటల్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ తెలిపారు.

    మూడో త్రైమాసికంలోనూ ఆదాయం తగ్గొచ్చని మెటా అంచనా వేస్తోంది.

  3. వెస్టిండీస్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్

    వెస్టిండీస్‌ మీద మూడో వన్డే గెలిచిన భారత్, సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.

    మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 257 లక్ష్యాన్ని విధించగా వెస్టిండీస్ 137 పరుగులకే ఆలవుట్ అయింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 98 పరుగులు చేయగా కెప్టెన్ శిఖర్ ధవన్ 58 కొట్టాడు.

    వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 35 ఓవర్లకు 257 పరుల లక్ష్యాన్ని వెస్టిండీస్‌కు విధించారు.

    చేజింగ్‌లో తడబడిన వెస్టిండీస్ 26 ఓవర్లకే అన్ని వికెట్లు పోగొట్టుకుని 137 పరుగులు చేసింది.

    వెస్టిండీస్‌లో బ్రాండన్ కింగ్ 42, నికోలస్ పూరన్ 42 పరుగులు చేశారు. ఇక యజువేంద్ర చాహల్ 17 పరుగులకే నాలుగు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

  4. గత 8 ఏళ్లలో 7.22 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

    గత 8 సంవత్సరాలలో 7.22 లక్షల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది, శిక్ష వ్యవహారాల శాఖ తెలిపింది.

    ఇదే కాలంలో 22 కోట్ల 5 లక్షల 99 వేల 238 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.

    తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా ప్రభుత్వం ఈ వివరాలు ఇచ్చింది.

    కేంద్ర ప్రభుత్వంలో 2020 మార్చి 1 నాటికి సుమారు 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

    సంవత్సరాల వారీగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు:

    • 2014-15: 1,30,423
    • 2015-16: 1,11,807
    • 2016-17: 1,01,333
    • 2017-18: 76,147
    • 2018-19: 38,100
    • 2019-20: 78,555
    • 2020-21: 38,850
  5. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.