దేశాధ్యక్షుడి రాజీనామాతో శ్రీలంకలో సంబరాలు
శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష ఎట్టకేలకు అధికారికంగా రాజీనామా చేశారు. శ్రీలంకలో నిరసనలు పతాక స్థాయికి చేరుకోవడంతో రాజపక్ష దేశం విడిచి సింగపూర్‌కు పారిపోయారు.
పదవి నుంచి వైదొలిగిన వెంటనే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించడంతో రాజపక్ష ముందే దేశం విడిచి పారిపోయరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజపక్ష రాజీనామా లేఖను అందుకున్నట్లు శ్రీలంక స్పీకర్ ధృవీకరించారు. దీంతో, అధ్యక్షుడు అధికారికంగా రాజీనామా చేసినట్టు లెక్క.
దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యవహరిస్తారని స్పీకర్ మహింద యాపా అభయవర్ధన వెల్లడించారు. తదుపరి చర్యలు ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరుగుతాయని స్పీకర్ తెలిపారు.
రేపు జూలై 16న అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడాలని నిరసనకారులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు, ఎంపీలందరూ పార్లమెంట్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.
రాజపక్ష రాజీనామాతో శ్రీలంక రాజధాని కొలొంబోలో సంబరాలు చోటుచేసుకున్నాయి. ఈ వార్త విన్న వెంటనే నిరసనకారులు డాన్సులు చేస్తూ వేడుక చేసుకున్నారు.
"పట్టరానంత ఆనందంగా ఉంది. అంతకన్నా ఎక్కువ ఉపశమనంగా ఉంది. ఇక మేమంతా వెనక్కు వెళ్లి మా పనులు చేసుకోవచ్చు. ఇప్పటికే మేం చాలా అలిసిపోయాం. ఈ క్షణాన్ని మేం విజయంగా భావిస్తున్నాం" అని విరాగ పెరేరా బీబీసీతో అన్నారు.
రాజపక్ష ముందుగా మంగళవారం రాత్రి మాల్దీవ్స్‌కు పారిపోయి, అక్కడి నుంచి గురువారం ఉదయం సింగపూర్ చేరుకున్నారు. ఆయన భార్య, ఇద్దరు బాడీగార్డులు కూడా ఆయన వెంట ఉన్నారని రిపోర్టులు వచ్చాయి.
రాజపక్ష తమ దేశంలో ఆశ్రయం కోరలేదని, ఆశ్రయం పొందలేదని సింగపూర్ విదేశాంగ శాఖ పేర్కొంది.
"సింగపూర్ సాధారణంగా ఆశ్రయం కోసం అభ్యర్థనలను స్వీకరించదు" అని పేర్కొంది.