You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

శ్రీలంక అధ్యక్ష పదవికి గొటాబయ రాజపక్ష రాజీనామా

శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష తమ దేశానికి వచ్చినట్లు సింగపూర్ ధ్రువీకరించింది. తొలుత మాల్దీవులు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ వెళ్లిపోయారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు సెలవు.

  2. బ్రేకింగ్ న్యూస్, గొటాబయ రాజపక్ష రాజీనామా

    శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష ఎట్టకేలకు అధికారికంగా రాజీనామా చేశారు.

    ఈమేరకు రాజీనామా లేఖను ఈమెయిల్ ద్వారా స్పీకర్‌కు పంపించారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి శుక్రవారం అధికారికంగా రాజీనామాను వెల్లడిస్తామని స్పీకర్ తెలిపారు.

    తొలుత మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి ఆయన సింగపూర్ చేరుకున్నారు.

  3. ఆ సింహానికి ఇయర్ డ్రాప్స్ వేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు?

  4. మోదీ పార్లమెంటు కొత్త భవనంపై మూడు సింహాల విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమా?

  5. శ్రీలంక: ‘గొటాబయ రాజపక్ష రాజీనామా చేశారు’

    శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష రాజీనామా చేశారని మాల్దీవుల పీపుల్స్ మజిలిస్ స్పీకర్ మహ్మద్ నషీద్ తెలిపారు.

    ‘ఇక శ్రీలంక ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నా. శ్రీలంకలో ఉండి ఉంటే గొటాబయకు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదని భావిస్తున్నా. ఆయన విషయంలో మాల్దీవులు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా.’ అని ఆయన ట్వీట్ చేశారు.

    శ్రీలంక నుంచి తొలుత మాల్దీవులకు పారిపోయిన గొటాబయ రాజపక్ష, నేడు అక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లారు.

  6. కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన పార్లమెంట్

  7. విరాట్ కోహ్లీ కెరియర్ ప్రమాదంలో పడిందా, వెస్టిండీస్ వెళ్లే టీ20 జట్టులో ఎందుకు స్థానం దక్కలేదు?

  8. బ్రేకింగ్ న్యూస్, ‘గొటాబయ రాజపక్ష సింగపూర్‌లో ఉన్నారు... ఆయనకు మేం ఆశ్రయం ఇవ్వలేదు’

    శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష తమ దేశానికి వచ్చినట్లు సింగపూర్ ధ్రువీకరించింది.

    ‘కేవలం ప్రైవేటు ట్రిప్‌గా పరిగణిస్తూ ఆయనకు అనుమతి ఇచ్చాం. రాజపక్ష మమల్ని ఆశ్రయం కోరలేదు. మేం ఇవ్వలేదు. ఆశ్రయం కోరుతూ వచ్చే అభ్యర్థనలను సింగపూర్ సాధారణంగా ఆమోదించదు.’ అని మీడియా సమావేశంలో సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

  9. క్యాన్సర్‌ ఉన్నట్లు గోళ్ల మీద కనిపించే రంగులు, మచ్చలు కూడా చెప్పగలవా, నిపుణులు ఏమంటున్నారు?

  10. ‘ద వారియ‌ర్': డాక్ట‌ర్ చేసిన `పోలీస్‌` ట్రీట్‌మెంట్‌

  11. దిల్లీలోని శ్రీలంక హై కమిషన్ వద్ద భారీగా భద్రత

    దిల్లీలోని శ్రీలంక హై కమిషన్ కార్యాలయం వద్ద భద్రత భారీగా పెంచారు. నిరసనలు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

    మరొకవైపు పరారీలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మాల్దీవుల నుంచి సింగపూర్‌కు వెళ్లి పోయారు.

    శ్రీలంకలో శాంతి భద్రతలను కాపాడే పనిని ఆ దేశ సైన్యం తీసుకుంది. ఇప్పటికే అధ్యక్ష భవనం నుంచి నిరసనకారులను ఖాళీ చేయించి తమ అధీనంలోకి తెచ్చుకుంది.

  12. సౌదీ ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్‌కు గొటాబయ రాజపక్ష!

    శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మాల్దీవుల నుంచి సౌదీ ఎయిర్‌లైన్ విమానంలో సింగపూర్ బయలుదేరినట్లు అధికారిక వర్గాలు బీబీసీకి వెల్లడించాయి.

    ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంకలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. గొటాబయ మాల్దీవులకు పారిపోయారు. ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉంటారా? లేదా అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్తారా? అనే విషయంలో స్పష్టత లేదు.

    జులై 13న రాజీనామా చేస్తానని గతంలో గొటాబయ రాజపక్ష ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆయన అధికారికంగా రాజీనామా సమర్పించలేదు.

    రాజీనామా చేసే లోపు ఏదో ఒక దేశానికి వెళ్లిపోవాలని గొటాబయ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను అరెస్టు చేయకుండా మినహాయింపు ఉంటుంది.

    ఒకసారి ఆయన రాజీనామా చేశాక కొత్త ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసే అవకాశముంటుంది. అందుకే ఆయన విదేశాలకు వెళ్లిపోవాలని భావించినట్లు మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి.

    అపద్ధర్మ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రణిల్ విక్రమసింఘె శ్రీలంకలో కర్ఫ్యూ విధించారు.

  13. ఈ ఆర్థిక, రాజకీయ సుడిగుండం నుంచి శ్రీలంక ఇప్పటికిప్పుడు బయటపడగలదా, ఏం చేయాలి?

  14. జేమ్స్ వెబ్ టెలిస్కోప్: విశ్వం ఆవిర్భావ కాలం నాటి అద్భుత ఫొటోలు... అవాక్కవుతున్న శాస్త్రవేత్తలు

  15. యూట్యూబ్ వీడియోలతో ఇల్లు, కారు కొనుక్కున్న గణేశ్

  16. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి.. భద్రాచలం గోదావరి వంతెనపై రాక పోకలు బంద్

    ధవళేశ్వరం వద్ద 21.5 అడుగులకు నీరు చేరింది. ఈ రోజు సాయంత్రం 6.00 గంటల తరువాత 24 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఇరిగేషన్ ఎస్ ఈ ప్రకటించారు.

    17.75 వద్ద థర్డ్ వార్నింగ్ ఇస్తారు. ఆపైన 4 అడుగుల నీటిమట్టం అంటే ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నట్టు లెక్క.

    మరోవైపు, 14వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి భద్రాచలం గోదావరి వంతెనపై రాక పోకలు బంద్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వరద ముంపు దృష్ట్యా రక్షణ చర్యల్లో భాగంగా రాక పోకలు బంద్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రానున్న 48 గంటల పాటు వంతెనపై రవాణా నిలిపి వేస్తున్నామని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు.

    గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలు బయటికి రాకుండా నియంత్రించేందుకు 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ చెప్పారు.

    ఇప్పటికే గోదావరి నీటిమట్టం 61 అడుగులు దాటింది. జూలైలో ఎన్నడూ ఈ స్థాయికి చేరలేదు. దాంతో భద్రాచలం వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సమీపంలోని వాజేడు, చర్ల మండలాల్లోని గ్రామాలు వరద నీటిలో నానుతున్నాయి. ఏపీ పరిధిలోని ఎటపాక పోలీస్ స్టేషన్లలోకి కూడా వరద నీరు చేరింది. కూనవరం, వి ఆర్ పురం మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

  17. అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?

  18. తెలంగాణలో వానలు తగ్గినా వరదల భయం తీవ్రంగా ఉంది

    వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరదల భయం ఉత్తర తెలంగాణను వెంటాడుతోంది. మహారాష్ట్ర లాంటి ఎగువ ప్రాంతాల నుండి భారీ వరద నీరు ఇంకా చేరుతూనే ఉండటంతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి.

    నిన్న కడెం ప్రాజెక్ట్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి వరద ప్రవాహం చేరుతుండటంతో గేట్లు అన్నీ ఎత్తివేసిన అధికారులు ఓ సందర్భంలో చేతులెత్తేసి ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చారు. మధ్యాహ్నం కాస్త వరద తగ్గినట్టే తగ్గి, ఆ తర్వాత మళ్లీ పెరిగింది. అదే సమయంలో లెఫ్ట్ కెనాల్, పవర్ హౌజ్, హరిత రిసార్ట్ సమీపంలో మూడు చోట్ల కట్టకు గండి పడింది. దీంతో ప్రాజెక్ట్ తెగిపోతుందన్న పుకార్లు చెలరేగాయి. దానికి తోడు నీటిపారుదలశాఖ అధికారులు ఎవరూ ప్రాజెక్ట్ వద్ద లేకపోవడం, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలకు సంబందించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎప్పుడేమవుతోందన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.

    కడెం ప్రాజెక్ట్ సేఫ్‌గానే ఉందని, వరద తగ్గుముఖం పట్టిందని నిర్మల్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద ముంపుకు గురైన 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గింది. 17 గేట్ల ద్వారా లక్ష 83 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్ట్‌కు ముప్పు తప్పినట్టే అని భావిస్తున్నారు. నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లే రహదారి పలు చోట్ల దెబ్బతింది.

    మరోవైపు, కడెం ప్రాజెక్ట్ ద్వారా భారీ ప్రవాహం గోదావరి ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు చేరింది. 54 గేట్లు ఓపెన్ చేసి 12 లక్షల క్యూసెక్కుల మేర వరద దిగువకు వదలడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న మంచిర్యాల పట్టణంపై పడింది. పలు కాలనీల్లోకి నీరు ప్రవేశించింది. రాళ్లవాగు, తోళ్ల వాగు ప్రవాహాలను గోదావరి వెనక్కి తన్నుతుండటంతో ఆ నీరు కాస్తా కాలనీల్లోకి వచ్చింది. మంచిర్యాల,చెన్నూరు లకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

    గోదావరి ప్రవాహ ప్రాంతాల్లో పరిస్థితి దయణీయంగా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీఅవుట్ ఫ్లో తో గోదావరిఖని వద్ద గోదావరి బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహించింది. దీంతో అటువైపుగా వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. గోదావరిఖని, మంచిర్యాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

    పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంపై కూడా గోదావరి వరద ప్రభావం పడింది. పోలీస్ స్టేషన్‌తో పాటు పలు కాలనీల్లోకి నీరు ప్రవేశించింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభావిత కాలనీల్లో పర్యటించారు.

    కరీంనగర్ సమీపంలోని నగునూరు వాగు ప్రవాహంలో ఇటుకబట్టీల్లో పనిచేసే 9 మంది కూలీలు చిక్కుకుపోవడంతో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను మంత్రి గంగుల కమలాకర్ రెస్క్యూ ఆపరేషన్ కు ఆదేశించారు.

    గోదావరిఖని సింగరేణి ఇంటెక్ వెల్ లో 6 గురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

    కొమురం భీము ఆసిఫాబాద్ జిల్లా దహేగాం వద్ద ఓ గర్బిణీని వాగు దాటిస్తున్న క్రమంలో సింగరేణి రెస్క్యూ టీమ్ కు చెందిన ఇద్దరు గల్లంతై నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.

    ఉమ్మడి మెదక్ జిల్లాల్లో వరద ప్రభావ ప్రాంతాలను మంత్రి హరీష్ రావ్ పర్యటించారు. హవేళీ ఘణపూర్ లో కొట్టుకుపోయిన బ్రిడ్జీలను పరిశీలించారు. త్వరలోనే రోడ్లు, బ్రిడ్జిల పనులు చేపడతామని చెప్పారు. నిర్వాసితులకు వెంటనే వసతి, భోజన సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

    ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షం వల్ల తలెత్తిన పరిస్థితులపై జనగామ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలు, పునరావాసం తదితర అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు.

    ఇక ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులు అన్నీ దాదాపుగా నిండిపోయాయి. నిన్న నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించి అధికారులకు సూచనలు చేసారు. ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లో 75 టీఎంసీల వద్ద స్థిరంగా నిల్వ ను ఉంచి మిగులు జలాలు దిగువకు వదలుతున్నట్టుగా తెలిపారు.

    కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి, ప్రాణహితల నుండి భారీ ప్రవాహం కొనసాగుతోంది.

    భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో ఇళ్లు, స్కూలు భవనాలు, చెట్లు , విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో ఆదివారం వరకు ప్రభుత్వ, ప్రైవేట్,ఎయిడెట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

  19. ఏపీ-కోనసీమ: అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన వారినే పోలీసులు జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?

    గోపాలపురం. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉన్న ఓ గ్రామం ఇది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దు గ్రామం. ఎన్‌హెచ్-16 మీదుగా గోదావరిపై సిద్ధాంతం వద్ద వంతెన దాటగానే గోపాలపురం ఉంటుంది.

    ఇది పాలక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామం. ఈ గ్రామంలో ఓ చిన్న హోటల్ వద్ద ఫాస్ట్‌ఫుడ్ అందించే పేపర్ ప్లేట్లపై రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ బొమ్మ ముద్రించడం వివాదాస్పదమైంది.

    ఈ ప్లేట్లపై కొందరు అభ్యంతరం తెలిపారు. అయితే, నిరసన వ్యక్తంచేసిన వారు వారం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. దీనికి కారణమేంటి? గోపాలపురంలో ఏం జరుగుతోంది?

  20. ఉత్తర తెలంగాణలో వరద తాకిడికి పశువుల మృతి... భారీగా పంట నష్టం

    ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు పశువులు వరదలో కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కరెంట్ షాక్‌తో చనిపోయాయి.

    వరదలు ముంచెత్తడంతో చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి.

    ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. ఫలితంగా చాలా చోట్ల పంట నష్టం సంభవించింది.