ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ పేరును ప్రకటించిన జె.పి. నడ్డా

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు. ‘‘మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళా అభ్యర్థికి ప్రాధాన్యం ఇచ్చాం. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటిస్తున్నాం’’ అని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. మహారాష్ట్ర: శివసేనలో సంక్షోభం

    శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే

    ఫొటో సోర్స్, Facebook/ShivSena

    ఫొటో క్యాప్షన్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే

    మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. శివసేనకు చెందిన మంత్రి ఏక్‌నాథ్ శిందే సుమారు 10 మంది ఎమ్మెల్యేలతో అజ్ఞానతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

    గుజరాత్‌లోని సూరత్‌లో గల ఒక హోటల్‌లో ఉన్నట్లుగా కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఏక్‌నాథ్ శిందేతోపాటు కొందరు ఎమ్మెల్యేలు అందుబాటులోకి రావడం లేదని శివసేన పార్టీకి చెందిన సంజయ్ రౌత్ తెలిపారు.

    మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సంజయ్ రౌత్ ఆరోపించారు.

    బాల్ ఠాక్రేకు విధేయుడైన ఏక్‌నాథ్ శిందే, మహావికాస్ అఘడి(ఎంవీఏ) పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    శివసేన నేత ఏక్‌నాథ్ శిందే

    ఫొటో సోర్స్, Facebook/Eknath Shinde

    ఫొటో క్యాప్షన్, శివసేన నేత ఏక్‌నాథ్ శిందే
  2. నరేంద్ర మోదీ: ‘యోగా ఒక జీవన విధానంగా మారింది’

    యోగా చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Facebook/BJP Karnataka

    యోగా అనేది నేడు జీవ విధానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నాటకలోని మైసూర్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

    ‘వ్యక్తులకే కాదు సమాజానికి కూడా యోగా శాంతిని ఇస్తోంది. మన దేశానికి, ప్రపంచానికి కూడా శాంతిని ప్రసాదిస్తోంది. విశ్వానికే శాంతిని చేకూర్చుతోంది యోగ.’ అని మోదీ అన్నారు.

    ఇక ఏ మాత్రం మన జీవితంలో యోగా భాగం కాదని, యోగానే జీవిన విధానంగా మారుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

    2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

    ఈ ఏడాది ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ అనే థీమ్‌ను తీసుకున్నారు.

  3. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.