సల్మాన్ ఖాన్‌ను, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. ఎఫ్ఐఆర్ నమోదు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లకు చంపేస్తామంటూ ఆదివారం బెదిరింపు లేఖ అందింది. దీనిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆదివారం నాడు రోజు వారీ ఉదయపు నడక ముగించుకుని బాంద్రాలోని బాండ్‌స్టాండ్ వద్ద ఒక బెంచీ మీద కూర్చుని ఉన్న సలీమ్ ఖాన్ వద్దకు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఈ లేఖను ఇచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది.
సలీమ్ ఖాన్‌ను, సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామనే బెదిరింపులు ఆ లేఖలో ఉన్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం 7:30 గంటల నుంచి 8:00 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
సలీమ్ ఖాన్ తన భద్రతా సిబ్బంది సాయంతో పోలీసులను సంప్రదించారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 506(2) కింద కేసు నమోదు చేశారు.