You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మేకపాటి గౌతమ్ రెడ్డి: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జూన్ 23న, ఫలితాలు 26న
ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు నియోజకవర్గానికి జూన్ 23న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. జూన్ 26న ఈ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
లైవ్ కవరేజీ
శారద మియాపురం
బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన నజిభట్ క్రాసింగ్ వద్ద ఎన్‌కౌంటర్ ప్రారంభం అయినట్లు కశ్మీర్ జోన్ పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
ఇప్పటివరకు ఈ ఘటనలో ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదులు మరణించారని, జేకేపీ సిబ్బంది ఒకరు అమరుడయ్యారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
ఉత్తర కొరియా: మూడు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
ఉత్తర కొరియా బుధవారం ఉదయం మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
ప్యాంగ్‌యాంగ్‌లోని సునాన్ ప్రాంతం నుంచి కేవలం గంట వ్యవధిలోనే ఈ క్షిపణులను ప్రయోగించారని సియోల్ అధికారులు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అయిదు రోజుల ఆసియా పర్యటన ముగిసిన తర్వాతి రోజే ఉత్తర కొరియా ఈ ప్రయోగాలు చేపట్టింది. బైడెన్ పర్యటనలో భాగంగా జపాన్, దక్షిణ కొరియాకు వెళ్లారు.
ఉత్తర కొరియా ఈ ఏడాది ప్రారంభం నుంచి చాలా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు చేసింది.
బుధవారం ఉత్తర కొరియా కనీసం రెండు క్షిపణులను ప్రయోగించినట్లు జపాన్ ధ్రువీకరించింది.వీటి సంఖ్య ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చని పేర్కొంది.
మొదటి క్షిపణి దాదాపు 300 కి.మీ దూరం, 550 కి.మీ ఎత్తులో ప్రయాణించినట్లు.... రెండో క్షిపణి 50 కి.మీ ఎత్తులో దాదాపు 750 కి.మీ దూరం ప్రయాణించినట్లు జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి తెలిపారు.
బైడెన్ పర్యటనలో ఉన్న సమయంలో ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు నిర్వహించవచ్చని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.
భారత్‌లో కొత్తగా 2,124 కరోనా కేసులు
భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,124 కరోనా కేసులు నమోదైనట్లు వార్తా సంస్థ ఎన్ఐ పేర్కొంది.
కరోనా కారణంగా 17 మంది మృతి చెందగా, 1,977 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,971. పాజిటివిటీ రేటు 0.46శాతంగా ఉంది.
చక్కెర ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం
గోదుమల తర్వాత ఇప్పుడు చక్కెర ఎగుమతిపై కూడా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. జూన్ 1 నుంచి చక్కెర ఎగుమతిపై నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది.
రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపినదాని ప్రకారం.. దేశీయ మార్కెట్‌లో చక్కెరను అందుబాటులో ఉంచడం, ధరల పెరుగుదలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే సీఎక్స్‌ఎల్, టీఆర్‌క్యూ కింద యూరోపియన్ యూనియన్, అమెరికాలకు ఎగుమతి అయ్యే చక్కెరకు ఈ ఆంక్షలు వర్తించబోవు.
100 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) వరకే చక్కెర ఎగుమతులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత భారత్ అతిపెద్ద చక్కెర ఎగుమతిదారు, ఉత్పత్తిదారు.
జ్ఞాన్‌వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
సుమారు 31 సంవత్సరాల కిందట పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ బిల్ (స్పెషల్ ప్రొవిజన్స్) తెచ్చే నాటికి దేశంలో రామ మందిర ఉద్యమం ఉధృతంగా ఉంది.
1947 ఆగస్టు 15 నాటికి మతపరమైన స్థలాలు ఎలా ఉంటే, ఆ తర్వాత కూడా అలాగే ఉండాలని, దాని స్వభావాన్ని మార్చరాదని ఈ చట్టం చెబుతుంది.
మరి ఇప్పుడు జ్ఞాన్‌వాపి మసీదును ఈ చట్టం ప్రకారం శివాలయంగా మార్చవచ్చా? ఈ అంశం గురించి చట్టం ఏం చెబుతోంది? దీని గురించి తెలుసుకోవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
బరాక్ ఒబామా – టెక్సస్ కాల్పులు: ‘తుపాకీవాదులు, ఒక రాజకీయ పార్టీ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది’
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో జరిగిన ఘోర కాల్పులతో దేశం స్తంభించిపోయిందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.
ఒబామా మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు కథలు చెబుతూ లాలిపాటలు పాడుతూ పడుకోబెడతారు. కానీ, వారి మనసుల్లో ఎప్పుడూ ఒకరకమైన భయం ఉంటుంది. తమ బిడ్డ స్కూలు, దుకాణం లేదా ఏదైనా బహిరంగ ప్రాంతానికి వెళ్లినప్పుడు వెళ్లినప్పుడు క్షేమంగా తిరిగి వస్తాడా? లేదా? అనే ఆందోళన వారిలో చెలరేగుతుంది’’ అని ఒబామా వ్యాఖ్యానించారు.
టెక్సస్ రాష్ట్రంలోని ఒక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19 మంది పిల్లలు, ఒక స్కూలు టీచరు సహా ఇద్దరు పెద్దలు ప్రాణాలు కోల్పోయారు.
కాల్పుల్లో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా సంతాపం తెలిపారు.
‘‘శాండీ హుక్ దాడి జరిగిన 10 ఏళ్ల తర్వాత, బఫెలో సూపర్‌మార్కెట్‌పై కాల్పులు జరిగిన 10 రోజుల తర్వాత మన దేశం స్తంభించిపోయింది. ఈ పరిస్థితి భయం వల్ల తలెత్తలేదు. తుపాకీవాదులతో పాటు ఇలాంటి విషాదాన్ని నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలనే కోరిక కూడా కనబరచని ఒక రాజకీయ పార్టీ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. చాలా కాలం ముందే దీనిపై చర్యలు తీసుకొని ఉండాల్సింది’’ అని ఒబామా అన్నారు.
తుపాకీని అనుమతించే నియమాలను సంస్కరించడంలో తన పరిపాలన వైఫల్యం అధ్యక్షుడిగా తాను ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య అని 2015లో బీబీసీతో ఒబామా చెప్పారు.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.