You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కేసీఆర్: ‘‘మా టీచర్లను దిల్లీకి పంపిస్తాం.. అక్కడ విద్యా విధానం చాలా బావుంది’’

‘‘దిల్లీలో విద్యా విదానంపై అవగాహన కల్పించేందుకు మా టీచర్లు, నాయకులను ఇక్కడకు తీసుకొస్తాం’’అని కేసీఆర్ వివరించారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. చెస్: వరల్డ్ చాంపియన్ కార్ల్‌సన్‌ను ఓడించిన 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద

    భారత గ్రాండ్‌మాస్టర్, 16 ఏళ్ల ప్రజ్ఞానంద రమేశ్‌బాబు మూడు నెలల వ్యవధిలోనే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించాడు.

    శుక్రవారం చెసాబెల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌ ఐదో రౌండ్‌లో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్‌పై తమిళనాడు ప్లేయర్ ప్రజ్ఞానంద గెలుపొందాడు.

    తొలుత ఈ గేమ్ డ్రా దిశగా సాగింది. అయితే, చివరి క్షణంలో కార్ల్‌సన్ పొరపాటు చేయడంతో ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ ప్రజ్ఞానంద ఈ విజయంతో సంతోషంగా లేడని వార్తాసంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    ‘‘నేను అలా గెలవాలి అనుకోలేదు’’ అని మ్యాచ్ అనంతరం ప్రజ్ఞానంద వ్యాఖ్యానించినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

    ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో నిలిచాడు. కార్ల్‌సన్ 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, చైనాకు చెందిన వీయ్ యి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ టోర్నీలో ప్రజ్ఞానంద, కార్ల్‌సన్‌పై నెగ్గాడు.

    12 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి ప్రజ్ఞానంద రికార్డు సృష్టించాడు.

  2. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన అఖిలేశ్ యాదవ్

    ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

    దిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు.

    ఈ సందర్భంగా పలు జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు.

    శుక్రవారం సాయంత్రం కేసీఆర్ దిల్లీకి చేరుకున్నారు.

    జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆయన దేశవ్యాప్తంగా పర్యటించనున్నారని.. రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయన భేటీ అవుతారని తెలంగాణ సీఎం కార్యాలయం ప్రకటించింది.

    మే 22న కేసీఆర్ దిల్లీ నుంచి ఛండీగఢ్ వెళ్తారని, రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున చెక్కులు అందజేస్తారని తెలిపింది.

    అనంతరం మే 26న కేసీఆర్ బెంగళూరు చేరుకుని అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అవుతారు.

    మే 29, 30 తేదీలతో పశ్చిమబెంగాల్, బిహార్ పర్యటన ఉంటుంది.

  3. భారత్‌లో కొత్తగా 2,323 కరోనా కేసులు, 25 మరణాలు

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,323 కరోనా కేసులు నమోదు అయ్యాయని, 25 మంది మృతిచెందారని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించిందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    తాజా కేసులతో భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 14,996‌గా ఉందని తెలిపింది.

    గత 24 గంటల్లో 2,346 మంది కరోనా నుంచి కోలుకున్నారని, భారత్‌లో రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని వెల్లడించింది.

  4. థాయ్‌లాండ్ ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి

    థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఆట ముగిసింది. సెమీఫైనల్లో ఆమె ఓటమి పాలైంది.

    శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లో ఆరో సీడ్ సింధు 17-21, 16-21తో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ యుఫె (చైనా) చేతిలో ఓడిపోయింది.

    బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లోని ఏడు టోర్నమెంట్‌లలో థాయ్‌లాండ్ ఓపెన్ కూడా ఒకటి.

  5. కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి.. దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

  6. ‘మరియుపూల్ పూర్తిగా మా వశమైంది’: రష్యా

    యుక్రెయిన్ తీరప్రాంత నగరమైన మరియుపూల్‌ను నెలల తరబడి పోరాడి స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది.

    రష్యా అధికారుల ప్రకారం, మరియుపూల్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అజోవస్టల్ స్టీల్ ప్లాంటులో చివరి పోరాటాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్ బలగాలు లొంగిపోయాయని వారు తెలిపాయి.

    రష్యా ఆక్రమణను అడ్డుకునేందుకు నెలల తరబడి యుక్రెయిన్ బలగాలు ఈ ప్లాంటు నుంచి పోరాడాయి. అయితే, శుక్రవారం యుక్రెయిన్ బలగాలు లొంగిపోవడంతో ఈ నగరం పూర్తిగా రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది.

    ఈ ప్లాంటు నుంచి 531 మంది యుక్రెయిన్ సైనికులు వెళ్లిపోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్స్కీ కూడా రష్యా ప్రకటనను ధ్రువీకరించారు. ప్లాంటు నుంచి బయటకు వెళ్లడానికి అక్కడ మిగిలిపోయిన భద్రతా బలగాలకు అనుమతి లభించింది అని ఆయన చెప్పారు.

    ‘‘ ప్లాంటు నుంచి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోండి అనే స్పష్టమైన సంకేతాలు వారికి మిలిటరీ కమాండ్ నుంచి అందాయి’’ అని ఆయన శుక్రవారం ఒక యుక్రెయిన్ టీవీ చానెల్‌తో చెప్పారు.

  7. హైదరాబాద్‌లో మరో దారుణం: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని నడి బజారులో నరికి చంపేశారు

  8. ఎప్పటిలాగే అడవికెళ్లి పుట్టగొడుగులు తెచ్చుకుని తిన్నారు, కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత..

  9. భూకంపాలు, సునామీలను ఇంటర్నెట్ కేబుళ్లు ఎలా గుర్తిస్తాయంటే....

    "సముద్రం అడుగు భాగంలో ఉండే ఇంటర్నెట్ కేబుళ్లను భూకంపాలు, సునామీలను గుర్తించడానికి ఉపయోగించవచ్చు. వాతావరణ మార్పుల వల్ల సముద్రాల్లో వచ్చే మార్పులను పర్యవేక్షించవచ్చు"

    ఈ టెలికామ్ కేబుళ్లను లోతైన సముద్రంలో సైంటిఫిక్ సెన్సార్లలాగా ఉపయోగించవచ్చని యూకేకు చెందిన నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్‌పీఎల్) చెప్పింది.

    భూకంపాలు, సునామీలను ఇంటర్నెట్ కేబుళ్లు ఎలా గుర్తిస్తాయో ఈ ఆర్టికల్‌లో చదవండి.

  10. రాజీవ్ గాంధీ వర్ధంతి: ప్రధాని మోదీ నివాళులు

    భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

    ‘‘ వర్ధంతి సందర్భంగా మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

    కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంకా గాంధీ కూడా దిల్లీలోని వీర్ భూమి వద్ద శనివారం ఉదయం అంజలి ఘటించారు.

    కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం, సచిన్ పైలట్ కూడా నివాళులు అర్పించారు.

    భారత మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ 1991 మే 21న బాంబు దాడిలో మరణించారు.

    1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆయన 40 సంవత్సరాల వయస్సులో ఈ బాధ్యతలను స్వీకరించి అతి పిన్న భారత ప్రధానిగా నిలిచారు.

  11. జ్ఞాన్‌వాపి వివాదం: ‘శివలింగం’‌కు సంబంధించి అభ్యంతకర పోస్టు చేసిన ప్రొఫెసర్ అరెస్ట్

    శివలింగానికి సంబంధించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు చేశారనే ఆరోపణలతో దిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ రతన్ లాల్‌ను అరెస్ట్ చేశారు.

    వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం దొరకిందనే వాదనలకు సంబంధించిన ఒక పోస్టును చేశారు.

    అసోసియేట్ ప్రొఫెసర్ అయిన 50 ఏళ్ల రతన్ లాల్ చరిత్రను బోధిస్తారు. ఆయన మంగళవారం శివలింగం ఆకృతిలో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి దానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.

    ఈ పోస్ట్ తర్వాత తనకు బెదిరింపులు రావడం గురించి కూడా మాట్లాడారు.

    ఈ నేపథ్యంలో తొలుత ఆయనను విచారించిన పోలీసులు అనంతరం అరెస్ట్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153ఎ (మత ప్రాతిపదికన రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం), సెక్షన్ 295ఎ (మత ఉద్వేగాలను రెచ్చగొట్టడం) కింద ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    మంగళవారం రాత్రి ఉత్తర దిల్లీలోని సైబర్ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

    ఆయన అరెస్టు తర్వాత స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్ బయట నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

  12. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గురించి సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే...

    ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను గెలుపొందిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు బాలీవుడ్ స్టార్ హీర్ సల్మాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు.

    ‘‘పసిడి సాధించిన నిఖత్‌కు కంగ్రాచ్యులేషన్స్’’ అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

    దీనిపై నిఖత్ జరీన్ హర్షం వ్యక్తం చేశారు. తాను సల్మాన్‌ఖాన్‌కు పెద్ద అభిమానిని అంటూ ట్వీట్ చేశారు.

    ‘‘సల్మాన్‌ఖాన్ పెద్ద అభిమానిని అయిన నా కల నెరవేరింది. నా కోసం సల్మాన ట్వీట్ చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ విజయాన్ని మరింత మధురంగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ క్షణాలు నా మనసులో ఎప్పుడూ నిలిచిపోతాయి’’ అని నిఖత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    దీని తర్వాత సల్మాన్ ఖాన్... ‘‘నీవు చేస్తోన్న కృషిని ఇలాగే కొనసాగించు. నా హీరో సిల్వెస్టర్ స్టాలోన్‌లా నువ్వు పంచులు విసురుతూనే ఉండు’’ అని మరో ట్వీట్ చేశారు.

    మహిళల 52 కేజీల విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. ఈ టైటిల్ సాధించిన అయిదో భారత మహిళా బాక్సర్‌ నిఖత్.

    జరీన్ కన్నా ముందు మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ కేసీ భారత్ నుంచి వరల్డ్ చాంపియన్లుగా నిలిచారు.

  13. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.

  14. కేసీఆర్: ‘‘మా టీచర్లను దిల్లీకి పంపిస్తాం.. అక్కడ విద్యా విధానం చాలా బావుంది’’