You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక సంక్షోభం: ఈ వారంలోనే కొత్త ప్రధాన మంత్రిని నియమిస్తా – గోటాబయ రాజపక్స
పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ‘‘ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ’’ వ్యవస్థను రద్దుచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోటాబయ రాజపక్స చెప్పారు.
లైవ్ కవరేజీ
తీరానికి కొట్టుకొచ్చిన బంగారు రంగు రాజమందిరం
బంగారు రంగులో ఉన్న రాజమందిరం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి మత్స్యకార గ్రామ తీరానికి కొట్టుకుని వచ్చింది. సముద్రంలో తేలుతోన్న ఈ మందిరాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించారు. దీనిపై ఉన్న అక్షరాలు మయన్మార్‌కు చెందిన భాషలా ఉన్నాయని మెరైన్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక మత్స్యకారుల సహాయంతో మెరైన్ పోలీసులు దీనిని తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. డ్రమ్ములతో చేసిన పడవపై ఉన్న ఈ మందిరాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, ఇంటెలిజెన్స్ విభాగానికి ఈ సమాచారం అందించామని భావనపాడు మెరైన్ పోలీసు విభాగ ఏఎస్సై సంజీవ్ చెప్పారు.
సంతబొమ్మాళి తీరానికి రాజ మందిరం కొట్టుకుని రావడం, అది కూడా ఆసక్తికరమైన నిర్మాణ శైలిలో ఉండటంతో సమీప గ్రామాల ప్రజలు దీనిని చూసేందుకు వచ్చారు. తుపాను సమయాల్లో పడవలు, బోట్లు కొట్టుకురావడం చూశాం కానీ, ఇలా రాజమందిరం కొట్టుకుని రావడంతో ఇదే తొలిసారని మత్స్యకారులు చెబుతున్నారు
బ్రేకింగ్ న్యూస్, సుప్రీంకోర్టు: 'రాజద్రోహం చట్టంపై పునః పరిశీలన పూర్తయ్యేంత వరకు కొత్త కేసులు పెట్టొద్దు'
దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ చట్టంపై పున:సమీక్ష పూర్తయ్యేంతవరకు దేశద్రోహం చట్టం కింద ఎలాంటి కేసు నమోదు చేయొద్దని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఎలాంటి విచారణను ప్రారంభించబోమని తెలిపింది.
దేశద్రోహ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నవారు లేదా జైలులో ఉన్నవారు... బెయిల్ లేదా రిలీఫ్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ చట్టాన్ని సమీక్షించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. గతంలో కేంద్రం, ఈ చట్టం ఎంతో ముఖ్యమైనదని వ్యాఖ్యానించగా, ఇది దుర్వినియోగం కావడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
యుక్రెయిన్ యుద్ధం: ‘సుదీర్ఘ పోరుకు పుతిన్ సన్నాహాలు’ – అమెరికా ఇంటెలిజెన్స్
యుక్రెయిన్‌లో సుదీర్ఘ యుద్ధం కోసం పుతిన్ సన్నాహాలు చేస్తున్నారని, తూర్పున విజయంతో ఈ యుద్ధం ముగిసిపోదని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
యుక్రెయిన్ తూర్పు భాగంలో భీకరమైన పోరాటాలు కొనసాగుతోన్న సమయంలోనే అమెరికా ఈ హెచ్చరికలను జారీ చేసింది. తూర్పు యుక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది.
కీయెవ్‌ను దక్కించుకునేందుకు రష్యా చేసిన ప్రయత్నాలను యుక్రెయిన్ గట్టిగా తిప్పికొట్టింది. దీని తర్వాత దోన్బస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంపై రష్యా మళ్లీ దృష్టి సారించింది.
పుతిన్ ఇప్పటికీ దోన్బస్‌కు మించిన లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నారని మంగళవారం యూఎస్ సెనెట్ కమిటీ విచారణలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ చెప్పారు. అయితే, ఆయన ఆశయాలకు, రష్యా మిలిటరీ సామర్థ్యాలకు మధ్య అసమతుల్యత ఉందని ఆమె వివరించారు.
ఏదేమైనప్పటికీ యుద్ధం కొనసాగుతున్నందున రష్యా అధ్యక్షుడు మరింత కఠినమైన మార్గాలను ఆశ్రయించవచ్చని వారు భావించారు.
రష్యన్లు, యుక్రెయిన్లు ప్రతిష్టంభనలో ఉన్నారని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ స్కాట్ బెరియర్ అన్నారు.
ఖార్కియెవ్‌లోని నాలుగు స్థావరాలను తిరిగి దక్కించుకున్నట్లు యుక్రెయిన్ చెబుతోంది. చెర్కాసీ, టిష్కీ, రుస్కీ టిష్కీ, రూబిజే, బైరాక్‌లను రష్యా నుంచి తిరిగి లాక్కున్నట్లు యుక్రెయిన్ దళాలు తెలిపాయి.
పోఖ్రాన్: 1998 మే 11న భారత్ మూడు భూగర్భ అణు పరీక్షలు జరిపిన తరువాత వాజ్‌పేయి ఏమన్నారు?
ఏపీలో పలుచోట్ల భారీ వర్షం
అసాని తుపాను బుధవారం ఉదయానికి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి చేరింది.
‘‘బలమైన ప్రవాహానికి ఉప్పాడ బీచ్ రోడ్డు దెబ్బతింది. వాహనాల రాకపోకలను నియంత్రించడానికి రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. ఈ దారి గుండా ప్రయాణించేవారిని ఆపేస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.
వాతావరణ శాఖ ప్రకారం, ఈ తుపాను మరికొద్ది గంటల్లో ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఈశాన్య దిశగా నర్సాపూర్, యానాం, తుని, విశాఖపట్నం తీరానికి బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి చేరే అవకాశం ఉంది.
రాత్రికల్లా పశ్చిమ బంగాళాఖాతానికి చేరవచ్చు. ఆంధ్రపదేశ్‌లోని పలు జిల్లాల్లో తుపాను ప్రభావం కనిపిస్తోంది. విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తోంది.
గురువారం ఉదయానికి తుపాను బలహీనపడొచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.
‘ట్విటర్‌లో ట్రంప్‌పై నిషేధం ఎత్తివేస్తాం’-ఎలాన్ మస్క్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విటర్ విధించిన నిషేధాన్ని తొలిగిస్తామని మంగళవారం ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు.
రూ. 3.37 లక్షల కోట్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్.. తాను ‘ఫ్రీ స్పీచ్’ మద్దతుదారునని చెప్పుకున్నారు.
‘‘ట్విటర్‌లో ట్రంప్‌కు చాలామంది నిజమైన ఫాలోవర్లు ఉన్నారు. ఆయనపై నిషేధం విధించడం వల్ల ఆయన ఫోలోవర్లకు ట్విటర్‌పై ఉన్న నమ్మకం సన్నగిల్లిపోతుంది. అందరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుంది. ఏదైనా వివాదాస్పద ట్వీట్ చేస్తే, దాన్ని తొలిగించాలి. దీని గురించి జాక్ డోర్సీతో కూడా మాట్లాడాను. ఒకరిని పూర్తిగా నిషేధించడం సరైనది కాదని ఆయన కూడా నమ్ముతున్నారు’’ అని ఇంటర్వ్యూలో మస్క్ చెప్పారు.
‘మా కుటుంబం శ్రీలంకలోనే ఉంది, దేశాన్ని వీడే ప్రసక్తే లేదు’- నమల్ రాజపక్ష
మహీంద రాజపక్ష, శ్రీలంక ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ అక్కడ హింసాత్మక నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు మహీంద రాజపక్ష కుటుంబం దేశం విడిచి పారిపోయిందనే ఊహాగానాలు కూడా ప్రారంభమయ్యాయి.
అయితే, మంగళవారం మహీంద రాజపక్ష కుమారుడు, దేశ క్రీడాశాఖ మంత్రి నమల్ రాజపక్ష దీని గురించి మాట్లాడారు. తమ కుటుంబం శ్రీలంకలోనే ఉందని, దేశం విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.
‘‘దేశం వదిలి వెళ్లిపోవాలనే ఆలోచనలు మాకు లేవు. మేం దేశం వదిలి పారిపోతున్నామని ఏవేవో ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. కానీ, మేం దేశాన్ని వీడట్లేదు’’ అని ఏఎఫ్‌పీతో ఆయన అన్నారు.
గుర్తు తెలియని ఆర్మీ స్థావరంలో మహీంద రాజపక్ష ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం తన తండ్రి క్షేమంగా ఉన్నారని, నిరంతరం కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారని నమల్ తెలిపారు.
దేశాన్ని వదిలి వెళ్లిపోయిన మహీంద రాజపక్ష, తన కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను శ్రీలంకలోని భారత హై కమిషన్ కొట్టివేసింది. ఇవన్నీ నకిలీ వార్తలని, వీటిలో నిజం లేదని ట్వీట్ చేసింది.
శ్రీలంక: ఆందోళనకారులపై షూట్ఎట్ సైట్ ఆర్డర్లు
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేవారిని ఉపేక్షించకుండా కాల్పులు జరిపేందుకు వీలుగా శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం షూట్ ఎట్ సైట్ ఆదేశాలను జారీ చేసింది.
అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న శ్రీలంకలో నిరసనలు హింసాత్మకంగా మారి అల్లర్ల రూపం దాల్చుతున్నాయి.
‘‘ప్రజా ఆస్తులను దోచుకునే లేదా ప్రాణనష్టం కలిగించేవారిని కాల్చివేయాలని భద్రతా బలగాలను ఆదేశించారు’’ అని దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నలిన్ హెర్త్ అన్నారు.
అంతకుముందు సోమవారం నిరసనకారులు, అధికార పార్టీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టారు. అధ్యక్ష భవనం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా నిప్పు అంటించారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేయడమే లక్ష్యంగా దేశంలోని సైన్యం, పోలీసులకు ఈ అత్యవసర అధికారాలను జారీ చేశారు.
సైన్యానికి అందిన తాజా ఆదేశాల ప్రకారం ఆందోళనకారులను పోలీసులకు అప్పగించేకంటే ముందు సైన్యం 24 గంటల పాటు నిర్బంధించవచ్చు. వారి వాహనాలను, ఆస్తులను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు.
ఇప్పటివరకు జరిగిన హింసాత్మక నిరసనల్లో 8 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణల్లో 200 మంది గాయపడినట్లు కొలంబో ప్రధాన ఆసుపత్రి బీబీసీకి చెప్పింది.
బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం.
తుపాను: ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబరు.. ఈ హెచ్చరికలకు అర్థం ఏమిటి?