You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

‘‘దమ్ముంటే తాజ్ మహల్, ఎర్ర కోటలను దేవాలయాలుగా మార్చి చూపించండి’’ – మెహబూబా ముఫ్తీ

‘‘మీకు దమ్ముంటే తాజ్‌ మహల్, ఎర్ర కోటలను దేవాలయాలుగా మార్చి చూపించండి. అప్పుడు భారత్‌కు ఎంత మంది విదేశీ పర్యటకులు వస్తారో చూడండి’’అని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్... ఏ కేసులో అరెస్ట్ చేశారు, తెరవెనుక ఏం జరిగింది?

  2. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  3. నేటి ముఖ్యాంశాలు

    శ్రీలంకలో నిరసనల నడుమ గల్లేరటగమా ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. వీటిలో ముగ్గురికి గాయాలయ్యాయి. అసలు ఈ కాల్పులు ఎలా చోటుచేసుకున్నాయో తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు.

    యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన రష్యా సైనికుల సంఖ్య 26,000కుపైనే ఉందని యుక్రెయిన్ సైన్యం వెల్లడించింది.

    టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారాయణను ప్రశ్నపత్రాల లీకు కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

    ప్రముఖ సంగీతకారుడు పండిట్ శివకుమార్ శర్మ మృతి చెందారు.

  4. మొదటి కలయిక తర్వాత కన్నెపొరకు ఏమవుతుంది, అసలు కన్యత్వంతో దానికి లింకేంటి?

  5. యుక్రెయిన్ యుద్ధం: వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు తెలిపేందుకు నకిలీ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా?

  6. కశ్మీర్‌లో 1200ఏళ్ల ప్రాచీన హిందూ దేవాలయంలో పూజలు ఎందుకు వివాదాస్పదం అయ్యాయి?

  7. ‘‘దమ్ముంటే తాజ్ మహల్, ఎర్ర కోటలను దేవాలయాలుగా మార్చి చూపించండి’’ – మెహబూబా ముఫ్తీ

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీ విమర్శలు సంధించారు.

    ‘‘ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైంది. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. ప్రజా ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తోంది’’అని ఆమె వ్యాఖ్యానించారు.

    ‘‘పేదరిక నిర్మూలనలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్‌ల కంటే భారత్ వెనుకబడింది. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి చర్యలూ లేవు. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు మొఘల్ పాలనా కాలంనాటి కట్టడాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీని వల్ల వారికి వచ్చే లాభం ఏమీ ఉండదు. భారీగా కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పరారైన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకుండా, మొఘల్ కట్టడాలను ధ్వంసం చేయడం శోచనీయం’’అని ఆమె అన్నారు.

    ‘‘మీకు దమ్ముంటే తాజ్‌ మహల్, ఎర్ర కోటలను దేవాలయాలుగా మార్చి చూపించండి. అప్పుడు భారత్‌కు ఎంత మంది విదేశీ పర్యటకులు వస్తారో చూడండి’’అని ఆమె వ్యాఖ్యానించారు.

    దిల్లీలోని కుతుబ్ మినార్ వద్ద హిందూ సంస్థ మహాకాల్ మానవ్ సేన నేతృత్వంలో మంగళవారం నిరసనలు చేపట్టారు. కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభ్‌గా మార్చాలని వీరు డిమాండ్ చేశారు.

    దిల్లీ మెహ్రౌలీలో కుతుబ్ మినార్ ఉంది. దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది.

  8. తెలంగాణ: పెళ్లయిన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య... ఏం జరిగిందంటే

  9. విశాఖ, కాకినాడ తీరాలకు చేరువలో 'అసాని' తుఫాన్, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తీవ్ర తుఫాన్ గా మారి తీరానికి చేరువవుతోంది.

    ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, కాకినాడ తీరాలకు మధ్యలో తీరాన్ని చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ 10వ తేదీ సాయంత్రం 5గం. లకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తీరాన్ని తాకిన తర్వాత తుపాన్ తీవ్రత తగ్గుతుందని పేర్కొంది.

    ఇప్పటికే తుపాన్ తాకిడితో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలల తాకిడితో కాకినాడ- ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది. బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. పలు జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

    గడిచిన 6 గంటల్లో గంటకు 25 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతున్నట్టు ఏపీడీఎంఏ తెలిపింది. ప్రస్తుతం కాకినాడకు 210 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకి 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది.

    ఇది వాయువ్య దిశగా పయనించి బుధవారం ఉదయానికి కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని భావిస్తోంది.

    ఆ తర్వాత దిశమార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్ళే అవకాశం ఉందని తెలిపింది.

    తీరాన్ని చేరిన తర్వాత 12గంటల్లో క్రమంగా తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం ఉంది.

    మంగళవారం రాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.

    బుధవారం నాడు ఉత్తరాంధ్ర అంతటా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది.

    తుపాన్ తీరాన్ని తాకే సమయంలో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

    ప్రభుత్వం తరుపున సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలు సిద్ధం చేశామని, ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి బృందాలు తరలించామని విపత్తు నిర్వహణా సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. సుమద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

  10. 'ముస్లింలలో బహుభార్యత్వం అరుదు, అదొక సమస్య కాదు'.. 'అలాగైతే, రద్దు చేయొచ్చుగా, ఏం నష్టం?'

  11. హిందువులకు మైనార్టీ హోదాపై రాష్ట్రాలతో చర్చించేందుకు కేంద్రానికి మూడు నెలలు గడువు

    హిందువులకు మైనార్టీ హోదా ఇచ్చే అంశంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మూడు నెలలు గడువు ఇచ్చింది.

    ఏ రాష్ట్రంలో అయితే ఇతర మతస్తుల కంటే హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్నారో ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా పరిగణించడంపై కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుంది.

    హిందువుల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వారికి మైనార్టీ హోదా ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే సరిపోతుందని, ప్రతిదానికీ న్యాయ వ్యవస్థ జోక్యం అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

    ఈ అంశంపై ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయగా దానికి న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

    హిందువులకు మైనార్టీ హోదా ఇచ్చే నిర్ణయం వల్ల చాలా అంశాలపై ప్రభావం పడుతుందని కాబట్టి రాష్ట్రాలతో సంప్రదింపులకు ఎక్కువ సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది.

    భారతీయ జనతా పార్టీ నాయకుడు, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పంజాబ్ సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇతర మతస్తులతో పోలిస్తే హిందువుల సంఖ్య తక్కువగా ఉందని, ఆయా రాష్ట్రాల్లో వారికి మైనార్టీ హోదా ఇవ్వాలని కోరారు.

  12. ‘నారాయణ ప్రోత్సాహంతోనే పేపర్ లీక్ చేశా’- వైస్ ప్రిన్సిపాల్, శంకర్ వడిశెట్టి

    మాజీ మంత్రి నారాయణ అరెస్టు కేసులో తొలుత గందరగోళం కొనసాగింది. ఆయన మీద ప్రస్తుతం రెండు కేసులు పెట్టారు.

    ఒకటి అమరావతి భూములకు సంబంధించినది, రెండవది 10వ తరగతి పరీక్షపేపర్ల లీక్.

    అయితే ఆయనను ఏ కేసులో అరెస్టు చేశారో తొలుత ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పష్టంగా చెప్పలేదు.

    నారాయణ కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు, అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసులు తెలిపారు.

    అమరావతి భూముల సమీకరణ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ1గా ఉండగా నారాయణ ఏ2గా ఉన్నారు.

    ఇక చిత్తూరులోని నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపాల్ అప్రూవర్‌గా మారడం వల్లనే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

    నారాయణ ప్రోత్సాహంతోనే పేపర్‌ లీక్‌ చేసినట్లుగా వైస్‌ ప్రిన్సిపాల్ గిరిధర్‌ విచారణలో ఒప్పుకున్నారని చిత్తూరు పోలీసులు చెబుతున్నారు.

    టెన్త్ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన కేసులో నారాయణను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషంత్ రెడ్డి స్పష్టంచేశారు. ‘‘ఇన్విజిలేటర్‌లను లోబర్చుకుని టెన్త్ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన కేసులో ఆయన్ను అరెస్టు చేశాం. సాయంత్రం జడ్జీ ముందు హాజరు పరుస్తాం. చిత్తూరు వన్‌టౌన్‌లో గత నెల 27న ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశాం. ఏప్రిల్ 29న ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశాం’’అని రిషంత్ రెడ్డి తెలిపారు.

  13. ప్రముఖ సంగీతకారుడు పండిట్ శివకుమార్ శర్మ మృతి

    సంతూర్ వాద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ 84 ఏళ్ల వయసులో మరణించారు.

    గత ఆరు నెలలుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

    జమ్మూ కశ్మీర్‌కు చెందిన సంతూర్ అనే వాయిద్యానికి మంచి గుర్తింపు రావడానికి శివకుమార్ శర్మ కృషి చేశారు.

    పండిట్ హరి ప్రసాద్ చౌరాసియాతో కలిసి చాందినీ, సిల్‌సిల వంటి బాలీవుడ్ సినిమాలకు ఆయన సంగీతం కూడా అందించారు.

    పండిట్ శివకుమార్ శర్మ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటని, సంతూర్‌కు ఆయన అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించారంటూ మోదీ ట్వీట్ చేశారు.

    శివకుమార్ మరణం శాస్త్రీయ సంగీతానికి తీరని లోటని రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ అన్నారు.

  14. కుతుబ్ మినార్‌ పేరు మార్చాలంటూ హిందుత్వ సంస్థ డిమాండ్

    దిల్లీలోని కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ హిందుత్వ సంస్థ మహాకాల్ మానవ్ సేవ డిమాండ్ చేసింది.

    ఈమేరకు ఆ సంస్థకు చెందిన కార్యకర్తలు కుతుబ్ మినార్ వద్ద నిరసనకు దిగారు.

    దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

    ఈ ఏడాది మొదట్లో కుతుబ్ మినార్ వాస్తవంగా విష్ణు స్తంభం అంటూ విశ్వ హిందూ పరిషత్ నేత వినోద్ బన్సల్ ఆరోపించారు.

    యునెస్కో వారసత్వ సంపదగా ఉన్న కుతుబ్ మినార్‌ను కుతుబ్‌-ఉద్దీన్-ఐబక్ నిర్మించారు. 1199 నుంచి 1220 మధ్య దీని నిర్మాణం జరిగింది.

  15. హైదరాబాద్: పదేళ్లకే డ్రమ్స్ వాయిస్తూ అదరగొడుతున్న సియోనా కెఫీరా

  16. అసాని తుపాను: ఉత్తరాంధ్రలో మొదలైన వర్షాలు

  17. అమరావతి భూములు: చంద్రబాబు, నారాయణ మీద సీఐడీ కేసు

    ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసినట్లుగా ఏపీ పోలీసులు తెలిపారు.

    అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నారాయణను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసులు సమాచారం ఇచ్చారు.

    సోమవారం సాయంత్రం మంగళగిరి పోలీసు స్టేషన్‌లో ఈమేరకు సీఐడీ ఆయన మీద కేసు నమోదు చేసింది.

    ఈ కేసులో చంద్రబాబు, లింగమనేని రమేష్ పేర్లు కూడా ఉన్నాయి.

    మాల్ ప్రాక్టీస్ కేసులోనూ నారాయణపై చిత్తూరు పోలీసులు ఏఫ్ఐఆర్ నమోదు చేశారు.

  18. శ్రీలంక హింసలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

    శ్రీలంకలో పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయి.సోమవారం మొదలైన హింసలో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోగా 190 మందికిపైగా గాయపడ్డారు.

    శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్ష మద్దతుదారులు దాడి చేయడంతో నిరసనకారుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దాంతో రాజపక్ష కుటుంబానికి చెందిన ఇళ్లతో పాటు ఎంపీల ఇళ్లకు వారు నిప్పు అంటించారు.

    ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయ రాజపక్ష దిగి పోవాలంటూ అక్కడి ప్రజలు కొద్ది నెలలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

    శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారుల మీద ప్రభుత్వ మద్దతుదారులు సోమవారం దాడి చేశారు.

  19. యుక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఈ దేశం సంపద ఎందుకు పెరుగుతోంది?

  20. దిల్లీ: ‘బుల్ డోజర్లతో అక్రమ కట్టడాల కూల్చివేత’

    దిల్లీలోని మంగోల్‌పురీలో అక్రమ కట్టడాలను బుల్ డోజర్‌తో కూల్చివేస్తున్నట్లు నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

    అలాగే దక్షిణ దిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో కూడా అక్రమ కట్టడాలను తొలగించేందుకు సౌత్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుల్ డోజర్లు తీసుకొచ్చింది.

    కూల్చివేతలప్పుడు పరిస్థితులు అదుపులో ఉంచేందుకు పోలీసులు మోహరించారు.