లూహాన్స్క్ ప్రాంతంలో రష్యా దాడుల్లో ఎనిమిది మంది పౌరుల మృతి
యుక్రెయిన్‌లోని తూర్పు లూహాన్స్క్ ప్రాంతంలో రష్యా చేస్తున్న షెల్లింగ్ కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని ఆ ప్రాంత గవర్నర్ సెర్హీయ్ హాయ్‌దాయ్ చెప్పారు.
హిర్స్కీ, జోలోటీ పట్టణాలపై శనివారం రష్యా జరిపిన బాంబుదాడుల్లో ఆరుగురు చనిపోయారని ఆయన టెలిగ్రామ్ పోస్ట్‌లో రాశారు.
పొపాస్నా పట్టణంలో కొద్ది రోజుల కిందట రష్యా దాడుల్లో కూలిపోయిన ఒక ఇంటి శిథిలాల కింద ఇద్దరు మహిళల మృతదేహాలు లభించాయి.
సెవెరోడోనెస్క్క్ నగరంలోని పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసమైందని హాయ్‌దాయ్ తెలిపారు.
ఇంతకుముందు.. యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సహా ఆ దేశ ఉత్తర భూభాగాన్ని చుట్టుముట్టే ప్రయత్నంలో విఫలమైన రష్యా.. లూహాన్స్క్, దాని పొరుగు ప్రాంతమైన దోన్యస్క్‌లను స్వాధీనం చేసుకోవటంపై దృష్టి కేంద్రీకరిస్తామని ప్రకటించింది.