మహారాష్ట్రలో
శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్
చాలీసా పఠిస్తామని, దమ్ముంటే తనను ఆపాలని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త
ఎమ్మెల్యే రవి రానా.. ఆ ఆందోళనను విరమించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
అంతకుముందు..
శనివారం ఉదయం ముంబయిలోని నవనీత్ కౌర్ నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు
చోటుచేసుకున్నాయి. శివసేన కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు రానా
దంపతులు మాతోశ్రీ వద్దకు వస్తే వారికి ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని శివసేన
నాయకురాలు, ముంబయి
నగర మాజీ మేయర్ కిశోరి పెడ్నేకర్ వ్యాఖ్యానించారు.
‘‘వారి
కోసం మేం ఎదురు చూస్తున్నాం. వారు వస్తే గుణపాఠం చెబుతాం’’ అని ఆమె
వ్యాఖ్యానించారు.
ఈ
పరిణామాలపై నవనీత్ కౌర్ స్పందిస్తూ.. ‘‘మాకు అవరోధాలు సృష్టించాలని శివసేన
కార్యకర్తలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. అందుకే వారు బారికేడ్లు తోసుకుని
వస్తున్నారు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను. కచ్చితంగా మాతోశ్రీ ఎదుట హనుమాన్
చాలీసా చదువుతాను’’ అని ఉద్ఘాటించారు.
కానీ మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత రానా దంపతులు..
హనుమాన్ చాలీసా ఆందోళనను విరమించుకుంటున్నట్లు చెప్పారు.
రవి రానా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబైలో శాంతిభద్రతల
పరిస్థితులను శివసేన పార్టీ కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. హనుమాన్
చాలీసాకు వాళ్లు ఎందుకంత వ్యతిరేకంగా ఉన్నారు?’’ అని ప్రశ్నించారు.
‘‘ప్రధానమంత్రి
నరేంద్రమోదీ రేపు ముంబై వస్తున్నారు. ఈ పర్యటనకు ఎలాంటి కష్టాలూ కలిగించకూడదని మేం
కోరుకుంటున్నాం. ఈ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నాం’’ అని ఆయన చెప్పారు.
‘‘మేం ఎవరికీ, ఏ బెదిరింపులకూ భయడటం లేదు. మేం ప్రజలకు
సేవ చేయటం ద్వారా అసెంబ్లీకి, పార్లమెంటుకు చేరుకున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
‘‘మా లక్ష్యం నెరవేరింది. రవి రానా, నేను ‘మాతోశ్రీ’కి చేరుకోలేకపోయినప్పటికీ.. మేం చదవాల్సిన హనుమాన్ చాలీసాను సీఎం ఇంటి వెలుపల భక్తులు చదివారు’’ అని నవనీత్ కౌర్ రానా ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
‘‘శివసేన గూండాల పార్టీగా తయారైంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు జనం మీద కేసులు మోపటం, జైళ్లలో పెట్టటం మాత్రమే తెలుసు. ఆయన మహారాష్ట్రలో బెంగాల్ తరహా పరిస్థితులు సృష్టిస్తున్నారు’’ అని విమర్శించారు.
నవనీత్ కౌర్, రవి రానాలు ఆందోళనను విరమించుకున్నట్లు ప్రకటించటంతో.. వారి ఇంటివద్ద పోగైన జనం వెనక్కు తిరగటం మొదలుపెట్టారు.