You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

బైడెన్‌తో మోదీ వర్చువల్ సమావేశం: యుక్రెయిన్ యుద్ధం గురించి ఏమన్నారంటే...

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో నేరుగా మాట్లాడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెప్పానని ఈ సందర్భంగా బైడెన్‌కు మోదీ వివరించారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం: ఈ సామాజిక న్యాయానికి ఉన్న అధికారం ఎంత?

  2. రామ నవమి: జార్ఖండ్‌లో మత ఘర్షణలు.. ఒకరి మృతి

    రామ నవమిని పురస్కరించుకొని జార్ఖండ్‌లో నిర్వహించిన ఓ యాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో అమన్ అన్సారీ అనే వ్యక్తి మరణించారు. 20 మందికిపైగా ప్రజలు ఈ ఘర్షణల్లో గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

    లోహర్‌దగ్గా జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో గాయపడిన వారిని రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తరలించారు.

    ప్రభావిత ప్రాంతాల్లో సెక్షన్ 144ను విధించారు. ఇంటర్నెట్ సేవలపై కూడా ఆంక్షలు విధించారు.

    ఎనిమిది మంది గాయపడినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఐజీ అనీశ్ గుప్తా చెప్పారు. గాయపడిన వారిలో మరికొందరు తమ ఇంటి దగ్గరే చికిత్స పొందుతూ ఉండొచ్చని ఆయన అన్నారు.

    ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని లోహర్‌దగ్గా జిల్లా మేజిస్ట్రేట్ ప్రసాద్ కృష్ణ చెప్పారు. హిందూ-ముస్లిం వర్గాల మధ్య ఈ ఘర్షణలకు కారణమైన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

  3. రామ నవమి: జేఎన్‌యూలో ఉద్రిక్తత, ఎఫ్ఐఆర్ నమోదు

    దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో శనివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నారు.

    మొదట దాడి చేసేంది వారేనని వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ, హిందూ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

    యూనివర్సిటీలోని మెస్‌లో మాంసాహారం విషయంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కావేరీ హాస్టల్‌లో మాంసాహారం విషయంలో మొదట ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని వామపక్ష సంఘ విద్యార్థులు చెబుతున్నారు.

    అయితే, రామనవమి పూజ చేస్తుంటే వామపక్ష విద్యార్థులే దాడి చేశారని ఏబీవీపీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

    దాడుల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారని రెండు విద్యార్థి సంఘాలూ చెబుతున్నాయి.

    ఈ ఉద్రిక్తతలకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఏబీవీపీ విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ సంఘాలు ఫిర్యాదు చేశాయని పోలీసులు తెలిపారు.

  4. ఆంధ్రప్రదేశ్: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలివీ..

    ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త మంత్రి వర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఆ కార్యక్రమం విశేషాలివీ..

    ఆర్‌కే రోజా మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు భారీగా ప్రజలు సందడి చేశారు. చప్పట్లు, ఈలలతో వెలగపూడి మైదానం మార్మోగింది. విడదల రజనీ వేదికపైకి వచ్చినప్పుడు కూడా ప్రజలు సందడి చేశారు.

    ముందుగా నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ మంది ప్రజలకు పాస్‌లు ఇచ్చారు. దీంతో తోపులాట జరిగింది. బారికెడ్ల మీద నుంచి ప్రజలు ఎగిరివెళ్లడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

    తాజా మాజీ మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొడాలి నాని, పేర్ని నాని, పాముల పుష్ప శ్రీవాణి లాంటి వారు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు.

  5. ఆంధ్రప్రదేశ్: ఆ నాలుగు కులాలకూ ప్రాతినిధ్యం లేని తొలి క్యాబినెట్ ఇదే.. వైఎస్ జగన్ 2.0 మంత్రివర్గంలో 5 ముఖ్యమైన అంశాలు

  6. తెలంగాణ: బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? కేంద్రంతో కేసీఆర్ ప్రభుత్వ వివాదం ఎందుకు

    తెలంగాణలో ప్రస్తుతం యాసంగి (రబీ) ధాన్యం పంట చేతికొచ్చింది. వరి కోతలు ఆరంభమయ్యాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇటు తెలంగాణ అటు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. ఇకపై పార్బాయిల్డ్ రైస్‌ కొనబోమని కేంద్రం చెబుతుంటే, తెలంగాణలో పండిన పంట అంతా కొనాల్సిందే అంటూ పాలక టీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది.

    ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

    కేంద్రం యాసంగి ధాన్యం కొనబోమని చెప్పిందనడం అవాస్తవమని, వానాకాలం మాదిరిగానే సేకరిస్తుందని ఆయన చెప్పారు

    మరోవైపు తెలంగాణలో చివరి ధాన్యం గింజ కొనే వరకు రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ చెబుతోంది.

    పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  7. టీఆర్ఎస్ ‘‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’’ వేదిక నుంచి బీబీసీ ఎడిటర్ లైవ్

    కేంద్ర రాష్ట్రాల మధ్య వరి సేకరణ ఎందుకు వివాదంగా మారింది? టీఆర్ఎస్ దిల్లీలో ఎందుకు దీక్ష చేపట్టింది? దీనిపై బీజేపీ వాదనలు ఏంటి? దిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ‘‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’’ వేదిక నుంచి బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ లైవ్..

  8. అన్ని రాష్ట్రాలకూ ఒకేలా వర్తించే వరి సేకరణ విధానాన్ని తీసుకురావాలి – కవిత

    ‘‘మన రైతులకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. మా పంటను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం’’అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అన్నారు.

    ‘‘అన్ని రాష్ట్రాలకూ ఒకేలా వర్తించే వరి సేకరణ విధానాన్ని తీసుకురావాలని మేం డిమాండ్ చేస్తున్నాం.’’

    ‘‘ఈ విషయంపై రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా కేసీఆర్‌తో మాట్లాడారు. మాకు మద్దతు తెలిపేందుకు టికాయత్ కూడా ఇక్కడకు వచ్చారు’’అని కవిత అన్నారు.

    దిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ‘‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’’లో ఆమె కవిత కూడా పాల్గొన్నారు.

  9. హైదరాబాద్‌లో బండి సంజయ్ దీక్ష

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీలో నిరసన చేపడుతుంటే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో బీజేపీ రైతు దీక్ష పేరుతో ధర్నా చేస్తున్నారు.

    ఈ ధర్నాలో బండి సంజయ్‌తోపాటు కేంద్ర మంత్రి వీ మురళీధరన్, డీకే అరుణ, విజయ శాంతి, ఈటెల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్, పొంగులేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

    వరి కొనకుంటే బీజేపీపై యుద్ధం ప్రకటిస్తాం అంటూ కేసీఆర్ దిల్లీకి బయలుదేరారు. అయితే ధాన్యం కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్రబీజేపీ అంటోంది.

    దిల్లీలో ధర్నా అని కొన్ని రోజులుగా హడావిడి చేసిన టీఆర్ఎస్.. కేవలం రెండు గంటలకే ధర్నా ముగించిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు.

  10. కేసీఆర్: ‘నరేంద్ర మోదీ.. కేంద్రం వద్ద ధనం లేదా? ధాన్యం కొనుగోలు చేసేందుకు మనసు రావట్లేదా?’

    కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడిపించట్లేదని, కుట్రపూరిత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు.

    రాష్ట్రంలో బీజేపీ నాయకులు సీఎంను కొన్ని రోజుల్లోనే జైలుకు పంపిస్తామంటున్నారని.. ‘దమ్ముంటే రండి.. జైలుకు ఎవరు ఎవరిని పంపిస్తారో రండి’ అని కేసీఆర్ అన్నారు.

    తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? దేశానికి అన్నం పెట్టడమే పాపమా? వారేమైనా యాచకులు అనుకుంటున్నారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ పోరాటాన్ని తాము వదిలిపెట్టబోమని, దీనిని కొనసాగిస్తామని, తమతో కలసివచ్చే ముఖ్యమంత్రులను, రాజకీయ పార్టీలను కలుస్తామని, దిల్లీలో భూకంపం సృష్టిస్తామన్నారు.

    ‘‘గొప్పగొప్ప నియంతలే పోయారు. హిట్లర్, నెపోలియన్, ముస్సోలినీ వెళ్లిపోయారు. ఈయనెంత? ఈయన ఏమైనా వెయ్యేళ్లు పాలించేందుకు వచ్చారా? (అధికారం) ఏమైనా శాశ్వతమా? ఇంత అహంకారం ఎందుకు?’’

    ‘‘తెలంగాణ తమ హక్కులను డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా వరిని కొనాల్సిందే’’అని కేసీఆర్ అన్నారు.

    ప్రధాన మంత్రి కొత్త వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలి. మేం కూడా దీనిలో సాయం చేస్తాం.’’

    ‘‘మీరు ఏ పనీ చేయకపోతే, మిమ్మల్ని ప్రజలు దించేస్తారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం మరో వ్యవసాయ విధానంతో ముందుకు వస్తుంది’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

    ‘‘వరిని పండించడం తెలంగాణ రైతుల తప్పా? ప్రధాని మోదీ.. మీరు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు’’అని కేసీఆర్ అన్నారు.

    ‘‘రైతులను బాధపెట్టిన ప్రభుత్వాలు కూలిపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఏదీ శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నాం కదా అని రైతులను ఇష్టమొచ్చినట్లు ఇబ్బందులకు గురిచేయొద్దు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

  11. దిల్లీలో ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష: కేసీఆర్‌ ప్రసంగం లైవ్‌

    దిల్లీలో ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష నుంచి కేసీఆర్‌ ప్రసంగం లైవ్‌

  12. యుక్రెయిన్: ‘ఆహారం దొరికింది.. కొన్ని రోజులు బతకొచ్చు.. కానీ, యుద్ధం ముగిసిందని ఎవ్వరూ చెప్పలేదు’

  13. శ్రీకాకుళం జిల్లా: ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసు: 'తల్లి, తండ్రి, పిల్లలు అంతా పోలీసులే.. కానీ, ఖాకీ ధరించే పోలీసులు లేరు'

  14. తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?

    తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు మళ్లీ ఉద్యమకారుడిగా మారతానని ప్రకటించారు. రైతులు పండించిన వరిని కేంద్రం సేకరించాల్సిందేనని ఆందోళనకు పిలుపునిచ్చారు.

    ఇంతకీ తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?

    పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  15. ఆంధ్రప్రదేశ్: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్

    ఏపీలో వెలగపూడి నుంచి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్

  16. ఆంధ్రప్రదేశ్: మొదలైన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం

    ఆంధ్రప్రదేశ్‌లోని వెలగపూడిలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలైంది.

    ఆదిమూలపు సురేశ్, బొత్స్య సత్యనారాయణ, ముత్యాల రాజు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొదట ప్రమాణస్వీకారం చేశారు.

    గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

  17. దిల్లీలో ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష: దీక్షలో కూర్చున్న తెలంగాణ సీఎం కేసీఆర్

    దేశ రాజధాని దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో టీఆర్‌ఎస్ చేపడుతున్న నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షలో కూర్చున్నారు.

    వేదికపై కేసీఆర్‌తోపాటు రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా కనిపించారు.

    మంత్రి కేటీఆర్, కేసీఆర్ కుమార్తె కవితతోపాటు పార్టీ సీనియర్ నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు.

    దీక్ష ప్రారంభమైన తర్వాత, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేశవ్ రావు మొదట మాట్లాడారు.

  18. ఆంధ్రప్రదేశ్: కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై లైవ్

    ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వెలగపూడి నుంచి బీబీసీ లైవ్…

  19. దిల్లీలో మొదలైన టీఆర్‌ఎస్ నిరసన..

    తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వంకొనుగోలు చేయాలంటూ దేశ రాజధానిలో టీఆర్ఎస్ నిరసన మొదలుపెట్టింది.

    తెలంగాణ భవన్‌లో ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో సోమవారం ఈ దీక్షను చేపడుతున్నారు.

    ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ , డీసీసీబీ, డీసీఎంఎస్, టీఆర్‌ఎస్ కార్యవర్గ ప్రతినిధులు దీనిలో పాల్గొంటున్నారు.

    దీని కోసం దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం రాత్రికి దిల్లీ చేరుకున్నారు.

  20. ఆంధ్రప్రదేశ్: ఇక టీవీ షోలు చేయను- రోజా

    ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి అవుతున్నందుకు షూటింగ్‌లు మానేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తెలిపారు.

    ‘‘ఇకపై టీవీ, షూటింగ్‌లలో పాల్గొనను. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోను.’’

    ‘‘నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇప్పుడు మంత్రిని చేస్తున్నారు.’’

    ‘‘మహిళ పక్షపాత సీఎం క్యాబినెట్లో మంత్రిగా చేయడం నా అదృష్టం' అని చెప్పారు.