తాజా పరిణామాలు సంక్షిప్తంగా...
- యుక్రెయిన్‌పై యుద్ధం చేసి, బుచా నగరంలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు రష్యాపై అదనపు ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. రష్యా ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులనూ లక్ష్యంగా చేసుకుంటోంది.
- ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ మాట్లాడారు. భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించి, దీనిని ప్రక్షాళన చేయాలని కోరారు. లేదంటే భద్రతా మండలిని రద్దు చేయాలని అన్నారు.
- రష్యా తను ఎలాంటి యుద్ధనేరాలకూ పాల్పడలేదనే మాటను పునరుద్ఘాటించింది. బుచా నగరంలో రోడ్ల మీద మృతదేహాలు కనిపిస్తున్నాయనే వాదనను ఐరాసలో రష్యా రాయబారి పదే పదే తిరస్కరించారు.
- రష్యా సైనికులు పౌరులను హత్య చేస్తున్నాయన్న ఆరోపణలతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈయూ సభ్య దేశమైన స్పెయిన్ రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించింది.
- యుక్రెయిన్‌లోని తూర్పు డోన్బాస్ ప్రాంతంలో రష్యా రాబోయే కొన్ని వారాల్లో కొత్తగా సైనిక దాడి ప్రారంభించే అవకాశముందని నాటో సెక్రటరీ జనరల్ జెన్సెన్ స్టోలెన్‌బర్గ్ చెప్పారు.
- యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా 71 లక్షల మందికి పైగా జనం నిర్వాసితులయ్యారు. రష్యా దండయాత్ర వల్ల మొత్తంగా కోటి మందికి పైగా జనం తమ ఇళ్లు వదిలి పారిపోయారు.
- యూరోపియన్ కమిషన్, రష్యా మీద మరో విడత ఆంక్షలను ప్రతిపాదించింది. ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతులపై నిషేధం విధించటం కూడా ఈ ఆంక్షల్లో ఉంది.
- శ్రీలంకలో ఎమర్జెన్సీని ఎత్తేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అత్యయిక స్థితిని విధించింది.
- భారతదేశంలో ఈ రోజు కూడా పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 16 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు రూ.10 పెరిగింది.
- భారతదేశంలో మంగళవారం నాటికి కోవిడ్ వ్యాక్సీన్ల సంఖ్య 185 కోట్లు దాటిందని ప్రభుత్వం ప్రకటించింది.
- భారతీయ జనతా పార్టీ బుధవారం 42వ స్థాపనా దినోత్సవాన్ని జరుపుకుంటోంది.