You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

యుక్రెయిన్ యుద్దం: ‘రష్యా సైనికులు కేవలం ఆనందం కోసం ప్రజల్ని హింసించి చంపారు’- యూఎన్‌లో జెలియెన్‌స్కీ

‘‘బుచాలో రష్యా సైనికులు చేయని నేరం లేదు. వీధుల్లో, ఇళ్లలో ప్రజల్ని కాల్చి చంపారు. బావుల్లోకి నెట్టివేశారు. రోడ్లమీద ట్యాంకులతో తొక్కించారు. ఇదంతా వారు కేవలం ఆనందం కోసమే చేశారు’’ అని జెలియెన్‌స్కీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ఇప్పటివరకు ఏం జరిగింది

    • బుచా మరణాలకు వ్యతిరేకంగా రష్యాలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
    • యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 18,500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
    • భారత ప్రభుత్వం, పాకిస్తాన్‌కు చెందిన 4 చానెళ్లు సహా మొత్తం 22 యూట్యూబ్ చానెళ్లపై మంగళవారం నిషేధం విధించింది.
    • రష్యా అధ్యక్షుడు పుతిన్, అంతర్జాతీయ కోర్టులో విచారణ ఎదుర్కోవాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ డిమాండ్ చేశారు. ఆయన ఐక్యరాజ్యసమితి భద్రత మండలిని ఉద్దేశించి ప్రసంగించారు.

    ఇవి ఈనాటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్

    తాజా సమాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  2. ‘రష్యా సైనికులు కేవలం ఆనందం కోసం ప్రజల్ని హింసించి చంపారు’- యూఎన్‌లో జెలియెన్‌స్కీ

    యుక్రెయిన్‌లో రష్యా మారణహోమానికి పాల్పడిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆరోపించారు.

    రష్యా, యుక్రెయిన్‌పై దాడికి పాల్పడిన తర్వాత తొలిసారి ఆయన ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా బలగాలు పౌరులను చంపాయని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాయని అన్నారు.

    రష్యా బలగాలు చేసిన అకృత్యాలు అన్నింటినీ ఆయన ఏకరువు పెట్టారు.

    ట్రాన్స్‌లేటర్ల సహాయంతో జెలియెన్‌స్కీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాట్లాడారు. బుచా నగరంలో వారు పాల్పడని నేరమంటూ లేదని చెప్పారు.

    బుచాలోని వీధుల్లో, ఇళ్లలో ప్రజల్ని కాల్చి చంపారు. బావుల్లోకి నెట్టివేశారు. రోడ్లమీద ట్యాంకులతో తొక్కించారు. ఇదంతా రష్యా సైనికులు కేవలం ఆనందం కోసమే చేశారు.

    రష్యా చర్యలు, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపు చర్యలను తలపిస్తున్నాయని అన్నారు.

    భద్రతా మండలి అందించే భద్రత ఏది? శాంతి ఎక్కడ? ఐక్యరాజ్యసమితి అందించే హామీలు ఏవి? అని ఆయన ప్రశ్నించారు.

    ‘‘యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లో రష్యా మిలిటరీ పాల్పడిన యుద్ధ నేరాలను ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రాంతం మారిపోయి ఉండొచ్చు, కానీ క్రూరత్వం మాత్రం అదే. నేరాలు కూడా అవే. దీనికి రష్యా బాధ్యత వహించాలి’’ అని అన్నారు.

    రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణకు హాజరు కావాల్సిందే అని డిమాండ్ చేశారు.

    గత 41 రోజులుగా యుక్రెయిన్‌లో రష్యా చేస్తోన్న అకృత్యాలకు బుచా ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పిన ఆయన అక్కడి భయంకర పరిస్థితులకు సంబంధించిన వీడియోను భద్రతా మండలి సభ్యులకు చూపించారు.

    ‘‘ఒక నిమిషం పాటు సాగిన వీడియోలో మరణించిన, దారుణమైన స్థితిలో ఉన్న యుక్రెయిన్ల దేహాలు కనిపించాయి. ఆ చిత్రాలు కలిచివేసే విధంగా ఉన్నాయి’’ అని యూకే ప్రతినిధి డేమ్ బార్బరా వుడ్‌వర్డ్ అన్నారు.

  3. 'వరకట్నంతో అందంగా లేని అమ్మాయిలకు కూడా అందమైన అబ్బాయిలతో పెళ్ళి చేయొచ్చు...' ఇదీ బీఎస్సీ విద్యార్థులకు చెప్పే పాఠం, పద్మ మీనాక్షి, బీబీసీ ప్రతినిధి

    వరకట్నం దురాచారం, నేరం అని చదువుకున్నాం. కానీ, వరకట్నం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయంట.

    డిగ్రీ విద్యార్థుల పుస్తకాల్లో వరకట్నం వల్ల కలిగే చాలా ప్రయోజనాల గురించి వివరించారు.

  4. 4 పాకిస్తాన్ చానెళ్లతో సహా మొత్తం 22 యూట్యూబ్ చానెళ్లపై నిషేధం

    భారత ప్రభుత్వం మంగళవారం 22 యూట్యూబ్ చానెళ్లను నిషేధించింది. అందులో నాలుగు పాకిస్తాన్‌కు చెందినవి.

    ఈ చానెళ్లు భారత జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలు, పబ్లిక్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.

    వీటితోపాటు మూడు ట్విట్టర్ అకౌంట్లను, ఒక ఫేస్‌బుక్ ఖాతా, ఒక వార్తా సంస్థ వెబ్‌సైట్‌ను నిషేధించింది.

    జనవరిలో కూడా భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 20 యూట్యూబ్ చానెళ్లను, రెండు చొప్పున ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను, రెండు వెబ్‌సైట్లను, ఒక ఫేస్‌బుక్ ఖాతాను బ్లాక్ చేసింది.

    ఈ చానెళ్ల ద్వారా భారత్‌కు వ్యతిరేక ప్రచారం జరుగుతోందని చెప్పింది. ఇందులో కొన్ని చానెళ్లను పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నారని తెలిపింది.

  5. యుద్ధంలో 18,500 మంది రష్యా సైనికుల చనిపోయారు: యుక్రెయిన్

    యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 18,500 మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

    24 ఫిబ్రవరి నుంచి రష్యా, 676 యుద్ధ ట్యాంకులను 1858 సాయుధ వాహనాలను 150 యుద్ధ విమానాలను, 134 హెలికాప్టర్లను కోల్పోయినట్లు యుక్రెయిన్ సైనిక బలగాల జనరల్ స్టాఫ్, ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

    రష్యా మంత్రిత్వ శాఖ యుద్ధంలో తమ సైనిక మరణాల తాజా వివరాలను మార్చి 25 నుంచి ప్రకటించలేదు. అంతకుముందు తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 1,351 మంది రష్యా సైనికులు మరణించారు. 3,825 మంది గాయపడ్డారు.

  6. యుక్రెయిన్: బుచా మరణాలకు వ్యతిరేకంగా రష్యాలో నిరసనలు

    యుక్రెయిన్‌లోని బుచాలో మరణించిన వారికి సంఘీభావంగా రష్యా రాజధాని మాస్కోలో ఒక వ్యక్తి నిరసన తెలిపారు.

    బుచాలో చనిపోయిన వారి చేతులు కట్టి ఉన్నట్లుగానే ఆ వ్యక్తి కూడా తన రెండు చేతులను వెనక్కి కట్టివేసుకుని, నేల మీద బోర్లా పడుకున్నారు.

    రష్యా స్వతంత్ర వెబ్‌సైట్ హొలొద్‌ మీడియా ఈ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ను నడిపే వారు రష్యా వదిలి పారిపోయారు.

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు సమీపంలో ఉండే బుచా నుంచి ఇటీవలే రష్యా బలగాలు వెనక్కి వెళ్లాయి. ఆ తరువాత అక్కడ రోడ్ల మీద మృత దేహాలు పడి ఉండటం సంచలనంగా మారింది.

  7. దిల్లీ: ‘నవరాత్రి సందర్భంగా మాంసం దుకాణాలు తెరవకండి’

    దిల్లీలో నవరాత్రుల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మాంసం దుకాణాలు బంద్ చేయాలని కొందరు కోరుతున్నారు.

    తూర్పు దిల్లీలో మాంసం విక్రయించే షాపులను మూసి ఉంచాలని మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ అన్నారు.

    ‘నవరాత్రుల సమయంలో మాంసం షాపులు మూసి ఉంచాలని కోరుతున్నాం. సప్తమి, అష్టమి నవరాత్రి రోజులలో కబేళాలలను మూయడం నియమంగా వస్తోంది. దీని మీద నేడు సంప్రదింపులు జరుపుతున్నాం.’ అని ఏఎన్‌ఐతో మాట్లాడుతూ అగర్వాల్ తెలిపారు.

    ‘నవరాత్రి రోజుల్లో మేం ఉల్లి, వెల్లుల్లి కూడా తినం. హిందువుల మనోభావాలను అర్థం చేసుకోవాలని మాంసం విక్రయించే వాళ్లందరినీ కోరుతున్నా. తద్వారా మంచి వాతావరణం ఏర్పడుతుంది.’ అని ఆయన అన్నారు.

    ఏప్రిల్ 2 నుంచి 11 వరకు మాంసం దుకాణాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలంటూ దక్షిణ దిల్లీ మేయర్ ముకేశ్ సూర్యాన్ సోమవారం కమిషనర్‌కు లేఖ రాశారు.

  8. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి ఇండియా జోడీ

    టేబుల్ టెన్నిస్ విమెన్ డబుల్స్‌ ర్యాంకింగ్‌లో మనీకా బత్రా, అర్చన కామత్ 4వ స్థానానికి చేరుకున్నారు.

    ఈ మేరకు అంతర్జాతీయ టెబుల్ టెన్నిస్ ఫేడరేషన్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది.

    విమెన్ డబుల్స్‌ వ్యక్తిగత విభాగంలో అర్చన కామత్ 10వ స్థానానికి చేరుకోగా మనీక బత్రా 12వ స్థానానికి చేరుకుంది.

    ఇక చైనాకు చెందిన వాంగ్ మాన్‌యు, సన్ యింగ్‌షా తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

  9. ‘వివాహమైన మహిళలు సంపాదించిన ఆస్తి భర్తకు మాత్రమే ఎందుకు చెందాలి?’

    పెళ్లి అయిన హిందూ మహిళ చనిపోతే ఆమె సంపాదించిన ఆస్తుల మీద అధికారం భర్తకు మాత్రమే ఎందుకు? అనే పిటీషన్‌ మీద సుప్రీం కోర్టు విచారిస్తోంది.

    దీని మీద తమ వైఖరి తెలియచేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది.

    ‘హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్-15 ప్రకారం హిందూ మహిళ వీలునామా రాయకుండా చనిపోతే ఆమె సంపాదించిన ఆస్తులను అనుభవించే అధికారం తొలుత భర్తకు, ఆయన వారసులకు మాత్రమే లభిస్తోంది. ఆమె తల్లిదండ్రులకు ఆ అవకాశం రావడం లేద’ని పిటీషన్ పేర్కొంది.

    ఈ చట్టం వల్ల మహిళ సంపాదించుకున్న ఆస్తులను పూర్తిగా భర్త మాత్రమే తీసుకుంటున్నారని, ఆమె తల్లిదండ్రులకు వాటా ఇవ్వడం లేదని పిటీషన్ దారు కోర్టుకు తెలిపారు.

  10. పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారత్‌కు రెండువైపులా అశాంతి.. భయపడాలా, వద్దా?

    ఇరుగు పొరుగు అంతా సవ్యంగా ఉంటేనే మన ఇంట్లో కూడా ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు ఇండియాకు రెండు వైపులా అశాంతికర పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    ఇటు శ్రీలంక, అటు పాకిస్తాన్ లలో ప్రభుత్వాలు గాలిలో వేలాడుతున్నాయి. మరి ఈ రెండు దేశాల పరిస్థితులకు భారతదేశం కంగారు పడాలా?

  11. ఉత్తర కొరియా: ‘దక్షిణ కొరియాకు అణ్వాయుధాలతో బదులిస్తాం’

    తమను రెచ్చగొడితే దక్షిణ కొరియాకు అణ్వాయుధాలతో బదులు ఇస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. కొరియా ద్వీపకల్పంలో మరొక యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని అన్న ఆమె, తమ మీద దాడులకు ప్రయత్నిస్తే దక్షిణ కొరియాకు అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామని తెలిపారు.

    అవసరమైతే తమ భద్రత కోసం ఉత్తర కొరియా మీద ముందస్తు దాడులు చేస్తామని దక్షిణ కొరియా రక్షణశాఖ మంత్రి అన్న నేపథ్యంలో కిమ్ యో జాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  12. తెలంగాణ: ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన

    ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ, కేంద్రం మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ధాన్యం సేకరణలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ పార్లమెంటులోని ఉభయ సభల్లో టీఆర్‌ఎస్ పార్టీలు ఎంపీలు నిరసనలకుదిగారు.

    ధాన్యం సేకరణ విషయంలో జాతీయ విధానం తీసుకురావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

    తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనంటూ ఎంపీలు డిమాండ్ చేశారు.

    ధాన్యం కొనుగోలుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసిన ఎంపీలు, అందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో వాకౌట్ చేశారు.

  13. శ్రీలంక సంక్షోభం: ‘పార్లమెంటులో ఉన్న నేతలెవరూ పనికొచ్చేవాళ్లు కాదు.. దేశాన్ని నాశనం చేశారు’

    శ్రీలంకలో ప్రజా నిరసనలు చల్లారడం లేదు. దిగజారిన ఆర్థిక పరిస్థితులపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.

    మరి అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష గురించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్లమెంటులోని నేతలు పనికొచ్చే వాళ్లు కాదని ఎందుకు అంటున్నారు?

  14. ఇథియోపియా: ‘లీటర్ పెట్రోల్ రూ.759.. గుర్రపు బగ్గీలే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌.. మాంసం తినడం లగ్జరీ’

    ఇథియోపియా‌లోని ఉత్తర టిగ్రేలో తిరుగుబాటు కొనసాగుతుండటంతో గత కొన్ని నెలలుగా వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

    దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని లక్షల మంది కనీస అవసరాలైన ఆహారం, నిత్యావసర సరుకులు అందక సతమతమయ్యారు. అక్కడ లీటర్ పెట్రోలు రూ.759కి చేరింది. ఇక మాంసం తినడం విలాసంగా మారిందని ప్రజలు చెబుతున్నారు.

  15. వైఎస్ జగన్: ‘చంద్రబాబు అడిగారని కుప్పం రెవిన్యూ డివిజన్ చేశా’

    తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు కుప్పం రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, ప్రస్తుతం కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు.

    సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను ప్రారంభించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు, తన సొంత నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్‌గా చేయలేకపోయారని అన్నారు.

    ఇప్పుడు అక్కడ రెవిన్యూ డివిజన్ కావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారని, అలాగే ప్రజల అభ్యర్థన మేరకు కూడా కుప్పం రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని జగన్ చెప్పుకొచ్చారు.

  16. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో లాభాల స్వీకరణ

    నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 0.59%, నిఫ్టీ 0.47% చొప్పున పడిపోయాయి.

    సోమవారం రికార్డు స్థాయిలో పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో నేడు లాభాల స్వీకరణ కనిపిస్తోంది.

    ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.61శాతం నష్టపోయి రూ.1,612 వద్ద ట్రేడవుతుండగా ఇక హెచ్‌డీఎఫ్‌సీ షేరు ధర 1.93శాతం నష్టపోయి రూ.2,628 వద్ద ట్రేడవుతోంది.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలను విలీనం చేసేందుకు రెండు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపిన నేపథ్యంలో సోమవారం ఆ షేర్లు భారీగా పెరిగాయి.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 10శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 9శాతం వరకు లాభపడ్డాయి.

    దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉండగా గృహ రుణాల కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ అగ్రస్థానంలో ఉంది. విలీనం వల్ల ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలుగుతామని సంస్థలు చెబుతున్నాయి.

  17. జెలియెన్‌స్కీ: ‘రష్యా యుద్ధ నేరాలను దాచి పెడుతోంది’

    యుద్ధనేరాలకు పాల్పడిన రష్యా ఆ జాడలను తుడిచి వేసేందుకు ప్రయత్నిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆరోపించారు.

    తాను ఆక్రమించుకున్న ప్రాంతాల్లో చేసిన నేరాలను దాచాలని రష్యా చూస్తోందని అన్నారు.

    కీయెవ్‌లో రష్యా బలగాలు పౌరులను భారీ స్థాయిలో చంపాయని, మరియుపూల్‌లో ప్రజలను చంపిన రష్యా వాటిని దాచేందుకు తప్పుడు వార్తలు సృష్టిస్తోందని జెలియెన్‌స్కీ విమర్శించారు.

    రష్యాలోని వ్లాదిమిర్ పుతిన్ పాలన మీద మరిన్ని ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

  18. యుక్రెయిన్, రష్యా యుద్ధం ఇప్పటి వరకున్న ముఖ్యంశాలు

    • తమ యుద్ధనేరాల జాడలను తుడిచి వేసేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు.
    • ప్రజలను తమ బలగాలు కాల్చి చంపాయనే వార్తలను రష్యా ఖండించింది. అందుకు సంబంధించిన వీడియోలు ఫేక్ అని తెలిపింది.
    • కీయెవ్ వద్ద నలుగురు పౌరులను రష్యా బలగాలు కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
    • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధనేరస్థుడు అని, చేసిన నేరాలకు ఆయన విచారణ ఎదుర్కోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
  19. అమెరికా: ‘పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య విలువలకే మా మద్దతు’

    పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య విలువలకు తాము ఎన్నడూ మద్దతు ఇస్తామని అమెరికా తెలిపింది.

    తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.

    ‘పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య, రాజ్యాంగపరమైన విలువలను తాము సమర్థిస్తామని’ అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.

    ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మరొక రాజకీయ పార్టీని తాము ఎగదోయమని ప్రైస్ చెప్పుకొచ్చారు.

    పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు.

    ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుతం ఈ విషయం ఆ దేశ సుప్రీం కోర్టులో ఉంది.

  20. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.