యుక్రెయిన్-రష్యా యుద్ధంలో తాజా పరిణామాలివి..
బైడెన్ ప్రసంగం: పోలండ్ రాజధాని వార్సాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగిస్తూ, "దేవుడి సాక్షిగా, ఈ వ్యక్తి ఇక అధికారంలో కొనసాగకూడదు" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గురించి వ్యాఖ్యానించారు.
అయితే, బైడన్, రష్యా ప్రభుత్వంలో మార్పు కోసం పిలుపునివ్వలేదని, పొరుగు దేశాలపై పుతిన్ అధికారం చెలాయించేందుకు అనుమతించకూడదని మాత్రమే అన్నారని ఆ తరువాత వైట్ హౌస్ సంజాయిషీ ఇచ్చింది.
బైడెన్ వ్యాఖ్యలకు క్రెమ్లిన్ స్పందిస్తూ, రష్యాను ఎవరు పాలించాలో నిర్ణయించేది బైడెన్ కాదని పేర్కొంది.
ఎల్వివ్‌లో రాకెట్ కాల్పులు: శనివారం ఎల్వివ్‌లో భారీ పేలుళ్లు వినిపించాయి. నగర శివార్లలో దట్టంగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. యుక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న ఎల్వివ్ నగరం పోలండ్ సరిహద్దులకు సమీపంలో ఉంది.
బైడెన్ పోలండ్‌ను సందర్శిస్తున్న సందర్భంగా, ఆయనకు సందేశం పంపడం కోసమే రష్యా భారీ రాకెట్ కాల్పులు జరిపిందని ఎల్వివ్ నగర మేయర్ అన్నారు.
ఇప్పటివరకు, యుద్ధం నుంచి తప్పించుకునేందుకు యుక్రెయినియన్లకు ఎల్వివ్ నగరం సురక్షిత ప్రాంతంగా నిలిచింది.
జెలియెన్‌స్కీ ప్రసంగం: యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ మాట్లాడుతూ, పశ్చిమ దేశాలు తమ దేశానికి అందించే సైనిక సామాగ్రిని పెంచాలని డిమాండ్ చేశారు. యుక్రెయిన్ మాత్రమే ప్రమాదంలో పడలేదని ఆయన అన్నారు.
రష్యాతో పోరాడడానికి నాటో ట్యాంకులు, విమానాల్లో కేవలం 1 శాతం తమ బలగాలకు అందిస్తే చాలని అన్నారు.
చెర్నోబిల్‌పై ఆందోళనలు: చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌లో దాదాపు వారం రోజులుగా సిబ్బంది రొటేషన్ జరగకపోవడంతో అక్కడి సిబ్బంది సంక్షేమంపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
రష్యా స్వాధీనం చేసుకున్న అణు కేంద్రాల వద్ద యుక్రెయిన్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి తాము ఆందోళన చెందుతున్నామని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపింది.