అరామ్‌కో : సౌదీ అరేబియా చమురు కంపెనీపై యెమెన్ హూతి రెబల్స్ క్షిపణి దాడి
మరోవైపు సౌదీలోని అతిపెద్ద చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన జెద్దాలోని పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ కేంద్రంపై దాడి జరిగినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం వెల్లడించింది.
లైవ్ కవరేజీ
ఇప్పటివరకు ఏం జరిగింది?
ఫొటో సోర్స్, bbc
యుక్రెయిన్ నగరం లివీవ్‌లో మూడు భారీ
పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నగర శివార్లలో ఒక చోట నుంచి భారీగా పొగ బయటకు
వస్తోంది.
యుక్రెయిన్ విదేశాంగ, రక్షణ మంత్రులతో
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమయ్యారు.
తమకు అదనపు సైనిక సాయం అందిస్తామని
బైడెన్ హామీ ఇచ్చినట్లు యుక్రెయిన్ రక్షణ మంత్రి వెల్లడించారు.
నాటోను రష్యా అధ్యక్షుడు పుతిన్
విభజించాలని చూశారని, అయితే, నాటో కలిసికట్టుగా ఉండటాన్ని చూసి పుతిన్
ఆశ్చర్యానికి గురయ్యారని బైడెన్ వ్యాఖ్యానించారు.
రష్యాకు చెందిన మరో ఉన్నత సైన్యాధికారి
లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సెవ్ యుక్రెయిన్‌లో మరణించారు.
సౌదీ అరేబియాలో అరామ్‌కో చమురు
కేంద్రంపై యెమెన్‌లోని హూతి తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడిచేశారు.
eBike: ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్‌లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
ఫొటో సోర్స్, bbc
తమిళనాడులోని వెల్లూర్‌లో ఎలక్ట్రిక్ బైక్ పేలడంతో ఇద్దరు మరణించారు.
చిన అల్లపురానికి చెందిన దురైవర్మ(49) కేబుల్ టీవీ ఆపరేటర్. ఆయన కుమార్తె మొహన ప్రీతి (13) పోలూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.
వీరు రెండు రోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. సెప్టెంబరు 25 రాత్రిన, బైక్‌కు చార్జింగ్ పెట్టి, బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయారు. అయితే, ఉదయం 3 గంటల సమయంలో ఒక్కసారిగా బైక్ పేలిన శబ్దం వచ్చింది.
ఆ మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. దీంతో వీరు బాత్‌రూమ్‌లోకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కానీ విషపూరిత పొగ వ్యాపించడంతో వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మరణించారు.
‘‘ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం. వారు బైక్ కొన్న షోరూమ్‌కు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నాం. బహుశా రాత్రి సమయంలో విద్యుత్ వోల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు’’అని వెల్లూర్ డీఎస్‌పీ రాజేశ్ ఖన్నా బీబీసీ తమిళ్‌తో చెప్పారు.
ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?
ఫొటో సోర్స్, EPA
తాము ఇప్పటివరకు అభివృద్ధి చేసిన క్షిపణుల్లో అతిపెద్దదైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా మరోసారి వార్తల్లో నిలిచింది.
అయితే, ఈ ప్రయోగానికి సంబంధించిన వార్తలను ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో చూపించిన తీరుపై చర్చ జరుగుతోంది. చాలా మంది ఈ వార్తలను చూసి గందరగోళానికి గురవుతున్నారు.
ఈ వార్తల్లో విజయోత్సాహం కంటే హాలీవుడ్ తరహా సినిమా ఎఫెక్ట్స్ చూసిన ఉత్తర కొరియా వాసులు కూడా అయోమయానికి గురయ్యారు.
ఈ దృశ్యాల్లో కిమ్ జోంగ్ ఉన్ ఒక లెథర్ జాకెట్ వేసుకొని, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. వెనుక వినిపిస్తున్న సంగీతం కూడా చాలా నాటకీయంగా అనిపిస్తోంది.
ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ఛానెళ్లలో సాధారణంగా కిమ్ కుటుంబ విశేషాలు, సైనిక బ్యాండ్ కచేరీలు, దేశ భక్తి సినిమాలు చూపిస్తుంటారు. టీవీ ప్రసారాల్లో వేరే అంశాలు కనిపించడం చాలా అరుదు.
యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?
ఫొటో సోర్స్, Reuters
రష్యా సైన్యం తన
వ్యూహాలను మార్చుకుంటోందా? యుక్రెయిన్ విషయంలో తాము పెట్టుకున్న లక్ష్యాలను
తగ్గించుకుంటోందా?
ఈ
ప్రశ్నలకు ఇప్పుడే సమాధానాలు చెప్పడం కాస్త తొందరపాటే అవుతుంది. అయితే, వారి
వ్యూహాల్లో మార్పు ఉందనేది మాత్రం సుస్పష్టం.
యుక్రెయిన్‌పై
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన ‘‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’’ మొదట
దశ దాదాపు విజయవంతమైందని రష్యా ప్రధాన జనరల్ సెర్జీ రూడ్స్‌కోయ్ ఇటీవల
వెల్లడించారు. ఇప్పుడు రష్యన్ దళాలు దోన్బస్ ప్రాంతానికి పూర్తిగా విముక్తి
కల్పించడంపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.
అంటే
తూర్పు యుక్రెయిన్‌లో రష్యా మద్దతున్న పీపుల్స్ రిపబ్లిక్స్ ఆఫ్ దోన్యస్క్, లూహాన్స్క్‌లకు
మిగతా యుక్రెయిన్ భాగాలకు మధ్యనున్న ‘‘లైన్ ఆఫ్ కాంటాక్ట్’’పై ఎక్కువ దృష్టి
పెట్టే అవకాశమున్నట్లు రష్యా సంకేతాలు ఇచ్చింది.
యుక్రెయిన్‌లోని
మిగతా భాగాల్లో రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.
రాజధాని కీయెవ్‌తోపాటు చాలా భాగాల్లో రష్యా దళాలను యుక్రెయిన్ సైన్యం వెనక్కి
నెట్టగలుగుతోంది. కొన్నిచోట్ల రష్యా సైన్యం తన ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తుంటే..
మరికొన్ని చోట్ల కాస్త విరామం తీసుకుంటోంది.
యుక్రెయిన్‌పై రష్యా దాడి
ప్రారంభమైన వారం రోజులకే యుద్ధ నేరంగా అనుమానించే ఓ ఘటన చోటుచేసుకున్నట్లు
బీబీసీకి సమాచారం అందింది.
కీయెవ్ నగరానికి
పశ్చిమాన 40 కి.మీ దూరంలోని చిన్న గ్రామం యస్నోహోరోడ్కా చెక్ పాయింట్ వద్ద వాలంటీర్ల
బృందం గస్తీ కాస్తోంది. ఈ వాలంటీర్ల బృందంలోని వారంతా ఆ గ్రామానికి చెందిన
ఇరుగుపొరుగువారు, మిత్రులే.
రష్యా, యుక్రెయిన్
దళాల మధ్య అప్పటికే పోరాటం తీవ్రంగా మారింది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రవేశద్వారాల దగ్గర చెక్‌పాయింట్లు ఏర్పాటు అవుతున్నాయి. ఈ చెక్‌పాయింట్ల
వద్ద ఎలాంటి మిలిటరీ శిక్షణా అనుభవం లేని స్థానికులే స్వచ్ఛందంగా విధులు
నిర్వర్తిస్తున్నారు.
మార్చి
5వ తేదీ మధ్యాహ్నం, ఆ గ్రామానికి చెందిన ప్రీస్ట్ (మత
బోధకుడు లేదా చర్చి ఫాదర్) రోస్టిస్లావ్ డ్యుడారెంకో, యస్నోహోరోడ్కా
చెక్ పాయింట్ వద్ద ఉన్నారు. అక్కడికి వచ్చే వాహనాలను తనిఖీ చేయడం ఆయన పని. చర్చి
ఫాదర్‌లా కాకుండా ఆయన సాధారణ దుస్తులు ధరించారు.
అయితే, డ్యుడారెంకో లక్ష్యంగా రష్యా బలగాలు కాల్పులు జరిపినట్లు ఓ
ప్రత్యక్ష సాక్షి బీబీసీతో చెప్పారు.
ముంబయిలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న
ఐపీఎల్ 15వ సీజన్ తొలి మ్యాచ్‌లో కలకత్తా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్
జట్టు 131 పరుగులు చేసింది. ఐదు వికెట్లు కోల్పోయింది.
చెన్నై బ్యాటర్లలో ధోనీ అర్ధ శతకం చేశాడు.
రాబిన్ ఉతప్ప 28 స్కోర్ కొట్టాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా కూడా 26 కొట్టాడు.
సౌదీ అరేబియా కంపెనీ అరామ్‌కోపై యెమెన్ హూతి రెబల్స్ క్షిపణి దాడి
ఫొటో సోర్స్, EPA
సౌదీ అరేబియా ఇంధన స్థావరాలపై
క్షిపణులతో దాడులు చేపట్టినట్లు యెమెన్‌కు చెందిన హూతి తిరుగుబాటుదారులు
వెల్లడించారు.
మరోవైపు సౌదీలోని అతిపెద్ద చమురు సంస్థ
అరామ్‌కోకు చెందిన జెద్దాలోని పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ కేంద్రంపై దాడి
జరిగినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం వెల్లడించింది.
దాడి వల్ల రెండు చమురు నిల్వ
ట్యాంకులకు నిప్పు అంటుకుంది. అయితే, వీటిలో ఎవరూ మరణించలేదు.
ఎర్ర సముద్రం తీరంలోని ఈ కేంద్రం నుంచి
దట్టమైన పొగలు వస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో సౌదీ అరేబియా స్థావరాలపై
ఇరాన్ మద్దతున్న హూతి తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు.
సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు కూడా శనివారం
ఉదయం హుతి తిరుగుబాటుదారులపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.
బ్రేకింగ్ న్యూస్, బీజేవైఎం కార్యకర్తను చెప్పుతో కొట్టిన కేసులో దిగ్విజయ్ సింగ్‌కు ఏడాది జైలు, షురీహ్ నియాజీ, బీబీసీ కోసం, భోపాల్ నుంచి
ఫొటో సోర్స్, ANI
ఉజ్జయిని దాడి కేసులో మధ్యప్రదేశ్
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు ఏడాది
జైలు శిక్ష పడింది. ఇండోర్ జిల్లా కోర్టు శనివారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం)
కార్యకర్తను చెప్పుతో కొట్టారనే ఆరోపణలను దిగ్విజయ్ సింగ్ ఈ కేసులో ఎదుర్కొన్నారు.
దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ ప్రేమ్
చంద్ గుడ్డూ సహా మొత్తం ఆరుగురికి ఏడాది జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానాను
కోర్టు విధించింది.
2011 జులై 17వ తేదీన ఉజ్జయినిలోని
ఒక హోటల్ ప్రారంభోత్సవానికి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేవైఎం
కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్
మద్దతుదారులు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
తొలుత నలుగురు కాంగ్రెస్ నాయకులపై
పోలీసులు కేసు నమోదు చేశారు.
తర్వాత దిగ్విజయ్ సింగ్,
ప్రేమచంద్ర గుడ్డూ, మేమంత్ చౌహాన్, దిలీప్ చౌదరిలను కూడా ఈ కేసులో నిందితులుగా
చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఐపీఎల్: 11 ఓవర్లలో చెన్నై స్కోరు 61/5
15వ సీజర్ ఐపీఎల్ మొదటి మ్యాచ్ సీఎస్‌కే,
కేకేఆర్ జట్ల మధ్య జరుగుతోంది.
కోల్‌కతా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్
ఎంచుకుంది.
చెన్నై జట్టు మొదటి ఓవర్‌లోనే
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(డకౌట్) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ డెవన్ కాన్వే
సైతం 3 పరుగులకే ఔటయ్యాడు. రాబిన్ ఉతప్ప 21 బంతుల్లో రెండు సిక్స్‌లు, రెండు
ఫోర్లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అంబటి రాయుడు 17 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్
సహాయంతో 15 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
కెప్టెన్ రవీంద్ర జడేజా, వికెట్
కీపర్ ధోనీ క్రీజులో ఉన్నారు.
యుక్రెయిన్‌లో రష్యా ప్రధాన సైనిక జనరల్ మృతి
ఫొటో సోర్స్, Denis Nasik/Wikimediacommons
యుక్రెయిన్‌లో రష్యాకు చెందిన మరో
ప్రధాన సైనిక జనరల్ మరణించారు. దక్షిణ నగరం ఖేర్సన్‌లో జరిగిన దాడిలో లెఫ్టినెంట్
జనరల్ యాకోవ్ రెజాంట్సెవ్ మృతి చెందినట్లు యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ
వెల్లడించింది.
రష్యా సైన్యంలోని 49వ విభాగానికి
యాకోవ్ కమాండర్.
యుక్రెయిన్‌లో మరణించిన రష్యా
కమాండర్లలో యాకోవ్ ఏడోవారని పశ్చిమ దేశాల అధికారి ఒకరు తెలిపారు. మరణించిన
లెఫ్టినెంట్ జనరల్స్‌లో రెండోవారని తెలిపారు. ఇప్పటివరకు మరణించిన సైన్యాధికారుల్లో
ఆయన హోదానే ఎక్కువ.
రష్యా సైనికుల్లో నైతిక బలాన్ని
నింపేందుకు ఉన్నతాధికారులు పోరాటంలోకి దిగుతున్నారని, దీంతో కొందరు ప్రాణాలు
కోల్పోతున్నారని మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి.
రష్యా తమ స్థావరంగా ఉపయోగిస్తున్న
చొర్నోబైవ్కా వైమానిక స్తావరంపై జరిగిన దాడిలో యాకోవ్ మరణించారని యుక్రెయిన్
మీడియాలో వార్తలు వచ్చాయి.
పోలండ్‌లో యుక్రెయిన్ మంత్రులతో బైడెన్ సమావేశం
ఫొటో సోర్స్, ReutersCopyright
పోలండ్‌లో పర్యటిస్తున్న అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్.. ఇద్దరు యుక్రెయిన్ మంత్రులను కలిశారు. యుక్రెయిన్‌పై రష్యా
దాడి మొదలైన తర్వాత అమెరికా, యుక్రెయిన్‌ల అగ్రనాయకులు భేటీ కావడం ఇదే తొలిసారి.
మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి
ఆంటొనీ బ్లింకెన్, అమెరికా రక్షణ మంత్రి లోయిడ్ ఆస్టిన్‌లు కూడా యుక్రెయిన్
విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా, యుక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌లను
కలిశారని వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
పోలండ్ అధ్యక్షుడు అండ్రేజ్ డూడాను
కూడా బైడెన్ కలిశారు. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఉద్దేశించి శనివారం రాత్రి బైడెన్
ప్రసంగించనున్నారు.
యుక్రెయిన్ మంత్రుల విదేశీ పర్యటనలు
చూస్తుంటే రష్యాతో యుద్ధంపై వారిలో ఆత్మ విశ్వాసం పెరిగినట్లు అనిపిస్తోందని
రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రెండు కొత్త జట్లతో ఐపీఎల్.. కొత్త జట్లకు కెప్టెన్లు వీరే
ఫొటో సోర్స్, Chennai Super Kings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మార్చి 26న ప్రారంభమైంది.
గత ఏడాది కోవిడ్-19 వ్యాప్తి నడుమ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఐపీఎల్ జరిగింది.
తాజా సీజన్‌ను ‘‘టాటా ఐపీఎల్ 2022’’గా
పిలుస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ మే 29న జరగబోతోంది.
ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో చెన్నై
సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది.
ఈ సారి రోజుకు రెండు మ్యాచ్‌లు జరుగుతాయి.
మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30కు మొదలవుతుంది. రెండో మ్యాచ్ సాయంత్రం 7.30కి
మొదలవుతుంది.
ఈ సారి గుజరాత్ టైటన్స్, లఖ్‌నవూ సూపర్
జైంట్స్ జట్లు కొత్తగా బరిలోకి దిగుతున్నాయి.
మొత్తం పది జట్లను రెండు గ్రూపులుగా
విభజిస్తారు. ఒక్కోజట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది.
ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు
కెప్టెన్ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నారు. ఆ బాధ్యలను ప్రస్తుతం
రవీంద్ర జడేజా తీసుకున్నారు.
మరోవైపు రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు
జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ కూడా తప్పుకున్నారు. ఈ జట్టుకు డు ప్లెసిస్
కెప్టెన్‌గా వ్యహరిస్తున్నారు.
గుజరాత్ టైటన్స్‌కు హార్దిక్ పాండ్యా, లఖ్‌నవూ
జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
జపాన్ తీరంలోని వివాదాస్పద దీవుల్లో రష్యా విన్యాసాలు, యుక్రెయిన్‌పై జపాన్ ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రకటన
ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌పై దాడి విషయంలో జపాన్
విధించిన ఆంక్షలపై రష్యా స్పందించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచీ
జపాన్-రష్యాల మధ్య వివాదాస్పదంగా మారిన రెండు దీవుల్లో తాము విన్యాసాలు
నిర్వహించబోతున్నట్లు పేర్కొంది.
రెండు దేశాల మధ్య జరుగుతున్న శాంతి
చర్చలకు దూరం జరిగిన కొన్ని రోజులకే రష్యా ఈ ప్రటకన చేసింది.
నాలుగు దీవుల విషయంలో జపాన్, రష్యాల
మధ్య వివాదముంది. వీటిని దక్షిణ కుర్లిస్ దీవులని రష్యా పిలుస్తుంటే.. నార్తెర్న్
టెర్రిటరీస్‌గా జపాన్ పిలుస్తుంది.
ఈ దీవుల విషయంలో వివాదం నెలకొని వుండటంతో
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి అంగీకారం
కుదరలేదు.
ప్రస్తుతం యుక్రెయిన్ విషయంలో జపాన్‌తో
జరుగుతున్న శాంతి చర్చల నుంచి వైదొలగుతున్నట్లు ఇటీవల రష్యా ప్రకటించింది. జపాన్
కఠిన ఆంక్షలు విధించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
అనంతరం తాజాగా రష్యా తూర్పు సైనిక
విభాగం విన్యాసాలు చేపట్టబోతున్నట్లు ప్రకటన చేసింది. ఈ విన్యాసాల్లో 3000 మంది
సైనికులు పాల్గొంటారని వెల్లడించింది.
శిథిలాల తొలగింపులో తీవ్ర ఇబ్బందులు
యుక్రెయిన్ దేశ రెండో అతిపెద్ద నగరమైన
ఖార్కియెవ్‌లోని రాష్ట్ర అత్యవసర సేవల విభాగం (ఎస్ఈఎస్) అక్కడి పరిస్థితి గురించి
ఒక ప్రకటన చేసింది.
రష్యా దాడుల్లో విధ్వంసమైన శిథిలాలను
తొలగించడానికి, మంటలను ఆర్పేయడానికి కేవలం మార్చి 25, 26 తేదీల్లోనే తమ సిబ్బంది 59
సార్లు పర్యటించాల్సి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపింది.
షెల్లింగ్ కారణంగా పలు జిల్లాల్లోని
బహుళ అంతస్థుల నివాస స్థలాలు, వేర్ హౌస్‌లు, ఇతర ప్రైవేటు భవనాలు ధ్వంసం అయ్యాయని వెల్లడించింది.
తమ సిబ్బంది పేలని బాంబులు, ఫిరంగులను నిర్వీర్యం
కూడా చేస్తున్నారని చెప్పింది.
రష్యా సరిహద్దుకు కేవలం 50 కి.మీ ఉండే ఈ నగరం నిరంతరం దాడులకు గురవుతోంది. యుద్ధం
ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ చాలామంది పౌరులు మరణించారు. కొందరు గాయాల పాలయ్యారు.
బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్‌లోని పలు నగరాల్లో సైరన్ల మోత
యుక్రెయిన్ దేశ వ్యాప్తంగా పలు
నగరాల్లో వైమానిక దాడుల సైరన్ల శబ్ధాలు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది.
రాజధాని నగరం కీయెవ్‌తో పాటు సెంట్రల్
యుక్రెయిన్‌కు చెందిన చెర్కాసీ, క్రొపివిట్‌స్కీ.. ఆగ్నేయంలోని జపోరిజియా, నిప్రో...
తూర్పున జైటోమిర్, ఈశాన్యంలో ఖార్కియెవ్, సుమి నగరాల్లో ఈ ధ్వనులు వినిపించినట్లు
మీడియా తెలిపింది.
జర్మనీ నుంచి యుక్రెయిన్‌కు 1500 క్షిపణులు, 100 మెషీన్ గన్లు
యుక్రెయిన్‌కు జర్మనీ ఆయుధాలను
పంపించింది. 1500 స్ట్రెలా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులతో పాటు 100
ఎంజీ3 మెషీన్ గన్స్ యుక్రెయిన్‌కు చేరుకున్నాయని యుక్రెయిన్ అధికారులు చెప్పినట్లు
జర్మన్ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది.
యుక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా...
వివాదాస్పద ప్రాంతాలకు ఆయుధాలను పంపకూడదనే తమ విధానాన్ని
ఉల్లంఘించి మరీ జర్మనీ తాజా ఆయుధాలను పంపించింది.
‘‘ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్‌కు అతిపెద్ద ఆయుధ
సరఫరాదారుల్లో ఒకరుగా జర్మనీ ఉంది. ఇది మాకు గర్వంగా లేదు. కానీ, యుక్రెయిన్‌కు సహాయం చేయడానికి మేం వీటిని పంపించాల్సి వచ్చింది’’ అని రాయిటర్స్‌తో జర్మనీ విదేశాంగ
మంత్రి అన్నాలెనా బేర్‌బాక్ అన్నారు.
స్ట్రెలా క్షిపణులు, మాజీ కమ్యూనిస్ట్
ఈస్ట్ జర్మన్ ఆర్మీ ఇన్వెంటరీలో భాగంగా ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
రష్యా ఇప్పుడేం చేస్తుంది?, పాల్ ఆడమ్స్ బీబీసీ డిప్లొమాటిక్ కరెస్పాండెంట్
ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ విషయంలో రష్యా తన
ప్రణాళికలు మార్చుకుందని లేదా దాని లక్ష్యాలను తగ్గించుకుందని ఇప్పుడే చెప్పడం బహుశా
తొందరపాటే అవుతుంది. కానీ, రష్యా తీరులో మాత్రం కచ్చితంగా మార్పు వచ్చింది.
యుద్ధం మొదటి దశ ముగిసిందని రష్యా
చెప్పడం వెనుక ఉన్న అర్థం ఏంటంటే... రష్యా అండ ఉన్న వేర్పాటు వాద ప్రాంతాలైన దోన్యస్క్,
లూహాన్స్ నుంచి తూర్పున యుక్రెయిన్ ప్రభుత్వ ఆధీనంలోని భూభాగాన్ని వేరుచేసే
నియంత్రణ రేఖను దాటుకొని ముందుకు వెళ్లేందుకు చేస్తోన్న సమష్టి ప్రయత్నంగా దీన్ని
భావించాలి.
యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లో రష్యా
పురోగమనం చాలా మందకొడిగానే ఉంది. దీని ఆధారంగా, కీయెవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో
రష్యా చేతులెత్తేసిందని చెప్పుకోవడం చాలా తొందరపాటు చర్యే అవుతుంది.
కానీ రష్యాకు వరుసగా ఎదురుదెబ్బలు
తగులుతూనే ఉన్నాయని పశ్చిమ దేశాల అధికారులు చెబుతున్నారు.
దోన్యస్క్, లూహాన్స్ ప్రాంతాల మీదుగా
రష్యా బలగాలను... ఖార్కియెవ్, ఇజియుమ్ నగరాల నుంచి ఉత్తరం వైపు కదులుతోన్న బలగాలతో
అనుసంధానించే లక్ష్యంతో బహుశా రష్యా తాజా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.
తీర ప్రాంత నగరం మరియుపూల్‌తో పాటు
అజోవ్ సముద్రంపై ఒకవేళ రష్యా విజయం సాధిస్తే, రష్యా మిగతా బలాలు ఉత్తరం దిశగా
వెళ్లి యుక్రెయిన్ ఫ్రంట్ లైన్ జాయింట్ ఫోర్సెస్ ఆపరేషన్ బలగాలను చుట్టముట్టవచ్చు.
కానీ ఇలా రష్యా అనుకున్నవన్నీ జరిగేలా
అనిపించడం లేదు. మరియుపూల్‌లో యుక్రెయిన్ రక్షణ దళాలు గొప్ప ప్రతిఘటనను
కనబరుస్తున్నాయి. గొప్పగా పోరాడుతూ రష్యాను అడ్డుకుంటున్నాయి.
అయితే ఒక సమయంలో ఒకే లక్ష్యంపై దృష్టి
సారించడం ఉత్తమమని మాస్కో నిర్ణయించుకుంటే, రష్యా వాయుదాడులపై దృష్టిని కేంద్రీకరించే
అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో దోన్బస్‌పై రష్యా దృష్టి
సారించినట్లయితే, ఇక రష్యా వెనక్కి తగ్గుతున్నట్లుగా అనుకోవడానికి ఏమాత్రం
వీల్లేదు.
యుక్రెయిన్ యుద్ధం: ఇప్పటి వరకూ ఏం జరిగింది?
ఇప్పటిదాకా ఏం జరిగింది? ముఖ్యాంశాలు...
యుద్ధంలో మొదటి దశ ముగిసిందని రష్యా చెప్పింది.
ఇక యుక్రెయిన్ తూర్పు భాగమైన దోన్బస్ ప్రాంతంపై దృష్టిసారిస్తామని ప్రకటించింది. ఈ
ప్రకటనను రష్యా వ్యూహంలో మార్పుగా చూస్తున్నారు.
యుద్ధంలో రష్యా వేగం మందగించిందని,
ఇప్పటివరకు 16 వేల మంది రష్యా సైనికులు మరణించారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ
అన్నారు.
సైనిక ప్రాణనష్టంపై రష్యా రక్షణ
మంత్రిత్వ శాఖ స్పందించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మిలిటరీ ప్రాణ నష్టం గురించి
రష్యా మాట్లాడటం ఇది రెండోసారి మాత్రమే. తమ సైనికుల్లో 1,351 మంది చనిపోయారని,
3,825 మంది గాయపడ్డారని పేర్కొంది.
పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడా, అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్‌ను కలవడానికి తూర్పు పోలాండ్‌లోని రెస్జోకు వచ్చారు. ఆయన
విమానాన్ని వార్సాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం
వార్సాలో పాలసీ స్పీచ్ ఇవ్వబోతున్నారని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. యుక్రెయిన్
శరణార్థులతో కూడా ఆయన సమావేశమవుతారని తెలిపాయి.
రష్యా ఎక్కువగా మానవ రహిత డ్రోన్లపై
ఆధారపడుతోందని బ్రిటన్‌కు చెందిన ఎంవోడీ వ్యాఖ్యానించింది. పైలట్ల ప్రాణాలను
ప్రమాదంలోకి నెట్టకుండా రష్యాపై పటిష్టమైన యుక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు ఒత్తిడి
తెస్తున్నాయని తెలిపింది.
‘ఫేక్ న్యూస్’కు వ్యతిరేకంగా పుతిన్
మరో కొత్త చట్టంపై సంతకం చేశారు. దీని ప్రకారం అధికారులపై తప్పుడు వార్తలు ప్రచారం
చేసేవారికి 15 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.
డ్రోన్ల దాడిని ఉధృతం చేయనున్న రష్యా
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, కీయెవ్ నగరంలో ధ్వంసమైన షాపింగ్ కాంప్లెక్స్
బ్రిటన్ ఇంటలిజెన్స్ తాజా సమాచారం ప్రకారం యుక్రెయిన్ మీద డ్రోన్ల దాడిని రష్యా మరింత పెంచుతోంది.
"రష్యా యుద్ధ విమానాలను యుక్రెయిన్ వైమానిక దళం సమర్థంగా నిరోధించగలిగింది. దాంతో, మానవరహిత డ్రోన్లతో రష్యా తన దాడులను మరింత పెంచే అవకాశం ఉంది" అని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
గగనతల దాడుల సంఖ్యను రష్యా గతవారం బాగా పెంచిందని అమెరికా వెల్లడించింది. రోజుకు దాదాపు 300 దాడులు జరుగుతున్నాయని ప్రకటించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతోంది? రష్యా యుద్ధ వ్యూహం బెడిసికొట్టిందా? యుక్రెయిన్ ఊహకందని రీతిలో రష్యాను ప్రతిఘటిస్తోందా?
యుద్ధ వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, స్థానిక వార్తలను బీబీసీ ఎప్పటికప్పుడు మీకు ఈ లైవ్ పేజీలో అందిస్తోంది. తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని క్లిక్ చేస్తూ ఉండండి.