యుక్రెయిన్ విషయంలో రష్యా తన
ప్రణాళికలు మార్చుకుందని లేదా దాని లక్ష్యాలను తగ్గించుకుందని ఇప్పుడే చెప్పడం బహుశా
తొందరపాటే అవుతుంది. కానీ, రష్యా తీరులో మాత్రం కచ్చితంగా మార్పు వచ్చింది.
యుద్ధం మొదటి దశ ముగిసిందని రష్యా
చెప్పడం వెనుక ఉన్న అర్థం ఏంటంటే... రష్యా అండ ఉన్న వేర్పాటు వాద ప్రాంతాలైన దోన్యస్క్,
లూహాన్స్ నుంచి తూర్పున యుక్రెయిన్ ప్రభుత్వ ఆధీనంలోని భూభాగాన్ని వేరుచేసే
నియంత్రణ రేఖను దాటుకొని ముందుకు వెళ్లేందుకు చేస్తోన్న సమష్టి ప్రయత్నంగా దీన్ని
భావించాలి.
యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లో రష్యా
పురోగమనం చాలా మందకొడిగానే ఉంది. దీని ఆధారంగా, కీయెవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో
రష్యా చేతులెత్తేసిందని చెప్పుకోవడం చాలా తొందరపాటు చర్యే అవుతుంది.
కానీ రష్యాకు వరుసగా ఎదురుదెబ్బలు
తగులుతూనే ఉన్నాయని పశ్చిమ దేశాల అధికారులు చెబుతున్నారు.
దోన్యస్క్, లూహాన్స్ ప్రాంతాల మీదుగా
రష్యా బలగాలను... ఖార్కియెవ్, ఇజియుమ్ నగరాల నుంచి ఉత్తరం వైపు కదులుతోన్న బలగాలతో
అనుసంధానించే లక్ష్యంతో బహుశా రష్యా తాజా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.
తీర ప్రాంత నగరం మరియుపూల్‌తో పాటు
అజోవ్ సముద్రంపై ఒకవేళ రష్యా విజయం సాధిస్తే, రష్యా మిగతా బలాలు ఉత్తరం దిశగా
వెళ్లి యుక్రెయిన్ ఫ్రంట్ లైన్ జాయింట్ ఫోర్సెస్ ఆపరేషన్ బలగాలను చుట్టముట్టవచ్చు.
కానీ ఇలా రష్యా అనుకున్నవన్నీ జరిగేలా
అనిపించడం లేదు. మరియుపూల్‌లో యుక్రెయిన్ రక్షణ దళాలు గొప్ప ప్రతిఘటనను
కనబరుస్తున్నాయి. గొప్పగా పోరాడుతూ రష్యాను అడ్డుకుంటున్నాయి.
అయితే ఒక సమయంలో ఒకే లక్ష్యంపై దృష్టి
సారించడం ఉత్తమమని మాస్కో నిర్ణయించుకుంటే, రష్యా వాయుదాడులపై దృష్టిని కేంద్రీకరించే
అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో దోన్బస్‌పై రష్యా దృష్టి
సారించినట్లయితే, ఇక రష్యా వెనక్కి తగ్గుతున్నట్లుగా అనుకోవడానికి ఏమాత్రం
వీల్లేదు.