బైడెన్, షీ జిన్‌పింగ్ వీడియో కాల్ చర్చలు.. రష్యాకు ఆయుధాలు ఇవ్వొద్దని చైనాను కోరిన అమెరికా

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఇదే తరహాలో చైనా కూడా చర్యలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు కోరుతున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

బ్రిటన్ రక్షణ శాఖ తాజా నిఘా వివరాల ప్రకారం యుక్రెయిన్‌ మీద దాడులు కొనసాగించడానికి రష్యా దళాలు ఇబ్బందులు పడుతున్నాయి.

యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా దళాలకు సరకు సమస్యలు కొనసాగుతున్నాయని అది తన రిపోర్టులో పేర్కొంది.

కదలిక పరిమితంగా ఉండడం, వైమానిక దాడులతో పైచేయి సాధించలేకపోవడంతో రష్యా తమ సైనికులకు కనీస అవసరాలైన ఆహారం, ఇంధనం లాంటివి సమర్థంగా సరఫరా చేయలేకపోతోంది.

యుక్రెయిన్ ఎడతెగని దాడుల నుంచి తన సరఫరా లైన్లను కాపాడుకోడానికి రష్యా ప్రయత్నిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో సైనికులను దానికోసం మళ్లిస్తోంది. ఇది ఆర్మీ సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తోంది.

యుక్రెయిన్ చుట్టూ ఉన్న రష్యా దళాలు స్తంభించాయని ఇంతకు ముందు అమెరికా కూడా చెప్పింది.