మరియుపూల్‌లో పౌరులు తలదాచుకున్న థియేటర్‌పై రష్యా బాంబు దాడులు, అందులో 1,200 మంది వరకు ఉండవచ్చన్న మేయర్
బాంబుదాడుల నుంచి రక్షణ కోసం మరియుపూల్‌లో సాధారణ పౌరులు తలదాచుకున్న థియేటర్‌పై రష్యా ఉద్దేశపూర్వకంగా బాంబుదాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆరోపించారు. అది నిజం కాదని, తాము దాడులు చేయలేదని రష్యా అంటోంది.
లైవ్ కవరేజీ
సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ జర్మనీ పార్లమెంటులో వర్చువల్‌గా ప్రసంగించారు. రష్యా యుద్ధాన్ని ఆపటానికి సాయం చేయాలని, ‘రష్యా గోడను కూల్చాల’ని జర్మనీకి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. జెలియెన్‌స్కీ, వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమని టర్కీ చెప్పింది. వారిద్దరి మధ్య సమావేశానికి కృషి జరగాలని పిలుపునిచ్చింది.
యుక్రెయిన్ మీద రష్యా దాడుల్లో ఇప్పటివరకూ 107 మంది చిన్నారులు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు చెప్పారు.
‘‘మీ ప్రభుత్వం మీకు నిజం చెప్పటం లేదు’’: రష్యా ప్రజలకు ష్క్వార్జెనెగర్ వీడియో సందేశం
ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధం
పర్యవసానాల గురించి రష్యా ప్రభుత్వం ప్రజలకు నిజం చెప్పటం లేదని.. యుద్ధానికి
అనుకూలంగా రష్యా ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని రష్యా ప్రజలకు
పిలుపునిస్తూ హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ ష్క్వార్జెనెగర్ ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్
చేశారు.
‘‘యుద్ధం పర్యవసానాలపై మీకు నిజం
చెప్పటం లేదు.. అక్కడ అమాయకులైన పౌరుల మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు’’ అంటూ
యుక్రెయిన్ నగరాల మీద రష్యా దాడుల గురించి వరుసగా చెప్పారు.
కాలిఫోర్నియా రాష్ట్రానికి మాజీ
గవర్నర్ కూడా అయిన అర్నాల్డ్.. ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే దానిని పది
లక్షల మందికి పైగా చూశారు.
రష్యా పట్ల తనకున్న ప్రేమాభిమానాల గురించి
వివరించారు. తను బాడీ బిల్డర్‌గా ఉన్నపుడు, ఆ తర్వాత సినిమా నిర్మాణానికి
పలుమార్లు రష్యా సందర్శనలకు వెళ్లినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
యుక్రెయిన్ మీద వ్లాదిమిర్ పుతిన్
దండయాత్ర ఫలితంగా మానవ సంక్షోభం తలెత్తిందని.. ‘‘రష్యా ఇప్పుడు ప్రపంచ దేశాల సమాజంలో
ఏకాకిగా మారింద’’ని అర్నాల్డ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
‘‘స్వదేశం కోసం పోరాడుతున్న యుక్రెయిన్
బలగాలకు, ఆక్రమించటానికి యుద్ధం చేస్తున్న రష్యా నాయకత్వానికి మధ్య చిక్కుకుని వేలాది
మంది రష్యా సైనికులు కూడా చనిపోయారు’’ అని ఆయన చెప్పారు.
యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన వేలాది
మంది రష్యా నిరసనకారుల మీద అర్నాల్డ్ ప్రశంసలు కురిపించారు. ‘‘మీ సాహసాన్ని
ప్రపంచం చూసింది. మీరు నా హీరోలు’’ అని పేర్కొన్నారు.
రష్యాతో సంయుక్త మార్స్ ప్రాజెక్టును సస్పెండ్ చేసిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఎక్సోమార్స్ రోవర్ నమూనా
అంగారకగ్రహం మీద రష్యా అంతరిక్ష
పరిశోధన సంస్థ రాస్‌కాస్మోస్‌తో సయుక్తంగా నిర్వహించనున్న ప్రాజెక్టును యూరోపియన్
స్పేస్ ఏజెన్సీ (ఎసా) పక్కనపెట్టింది.
మార్స్ ఉపరితలం మీద మరిన్ని పరిశోధనలు
చేపట్టేందుకు తలపెట్టిన ఎక్సోమార్స్ మిషన్ మీద.. రాస్‌కాస్మోస్‌తో సహకారాన్ని
కొనసాగించటం అసాధ్యమని ఎసా తన వెబ్‌సైట్‌లో తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
యుక్రెయిన్‌లో పరిస్థితికి ప్రతిస్పందనగా..
ఎసా పాలక మండలి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
బ్రిటన్ నిర్మించిన రోసాలిండ్ ఫ్రాంక్లిన్
మార్స్ రోవర్‌ను వచ్చే సెప్టెంబర్ నెలలో రష్యా రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించాల్సి
ఉంది. ఆ తర్వాత ఎనిమిది నెలలకు రష్యా హార్డ్‌వేర్‌ను ఉపయోగించుకుని ఆ రోవర్ మార్స్
మీద దిగాలి. ఈ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ఎసా ప్రకటించింది.
‘‘యుక్రెయిన్ మీద దాడి వల్ల మానవ ప్రాణనష్టాన్ని,
విషాదకర పర్యవసానాలను మేం తీవ్రంగా గర్హిస్తున్నాం. అంతరిక్షంలో శాస్త్రీయ
పరిశోధనల మీద పడే ప్రభావాన్ని గుర్తిస్తూనే.. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు రష్యా
మీద విధించిన ఆంక్షల విషయంలో ఎసా పూర్తిగా ఏకీభవిస్తోంది’’ అని ఆ ప్రకటనలో వ్యాఖ్యానించింది.
కీయెవ్ నగరాన్ని రష్యా సైన్యం ఎందుకు లొంగదీసుకోలేకపోతోంది?
యుక్రెయిన్ మీద దండయాత్రలో కీయెవ్ నగరం
మీద రష్యా ప్రధాన దృష్టిని కేంద్రీకరించింది. ఈ నగరం మీద గురిపెట్టి భారీ ఎత్తున
సైనిక బలగాలు భీకరమైన విధ్వంసక ఆయుధాలతో దాడి చేస్తున్నాయి.
కానీ.. కీయెవ్ నగర నడిబొడ్డును,
దాని పరిసరాల్లోని పట్టణ ప్రాంతాలను రష్యన్
ఆయుధాలు ఇంకా తాకలేదు. యుక్రెయిన్‌లోని ఇతర నగరాలపై భారీ ఎత్తున బాంబు దాడులు
జరుగుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
కీయెవ్ జనాభాలో దాదాపు సగం మంది పశ్చిమ యుక్రెయిన్‌కు తరలిపోవటమో, దేశమే విడిచి వెళ్లిపోవటమో చేశారు.
కీయెవ్ నగరాన్ని కాపాడుకోవటానికి తాము కష్టపడి పోరాడుతున్నామని ఆ బాధ్యతలు చూస్తున్న యుక్రెయిన్ సైనిక జనరళ్లు క్రిష్చెన్కో, న్యాజేవ్ చెప్తున్నారు. తాము అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలను బీబీసీకి వివరించారు.
చెర్నిహియేవ్‌లో ఒక్క రోజే 53 మంది పౌరులు చనిపోయారు: గవర్నర్
ఫొటో సోర్స్, STATE EMERGENCY SERVICE OF UKRAINE / HANDOUT
ఫొటో క్యాప్షన్, చెర్నిహియేవ్ నగరంపై రష్యా బలగాలు కొద్ది రోజులుగా తీవ్ర స్థాయి దాడులు చేస్తున్నాయి
యుక్రెయిన్‌లోని ఉత్తర ప్రాంతంలో గల
చెర్నిహివ్ నగరంలో బుధవారం నాడు రష్యా బలగాల దాడిలో 53 మంది పౌరులు చనిపోయారని
ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ చాస్ తెలిపారు.
‘‘నగరం మీద శత్రువు ఒక ప్రణాళిక
ప్రకారం కాల్పులు, గగనతల దాడులు చేస్తున్నాడు. పౌర మౌలక సదుపాయాలను ధ్వంసం
చేస్తున్నారు’’ అని ఆయన టెలిగ్రామ్ యాప్‌లో పేర్కొన్నారు.
‘‘మేం తీవ్రంగా నష్టపోతున్నాం. గడచిన ఒక్క
రోజులోనే 53 మంది పౌరుల మృతదేహాలను నగరంలోని మార్చురీలకు పంపించాం’’ అన్నారాయన.
రష్యా సైన్యం షెల్లింగ్ కొనసాగిస్తున్నప్పటికీ..
నగరంలోని పలు ప్రాంతాలకు విద్యుత్, నీరు, గ్యాస్ సరఫరాలను పునరుద్ధరించటానికి
స్థానిక యంత్రాంగాలు పని చేస్తున్నాయని తెలిపారు.
నగరం నుంచి పౌరులను సురక్షిత
ప్రాంతాలకు తరలించటానికి వీలుగా మానవతా కారిడార్లను ఏర్పాటు చేసే అంశంపై రష్యా
సైన్యంతో మరో విడత చర్చలు జరపనున్నట్లు గవర్నర్ ప్రకటించారు.
ఫొటో క్యాప్షన్, టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లూట్ కావుసోగ్లూ
యుక్రెయిన్, రష్యాల మధ్య సంఘర్షణను పరిష్కరించటానికి
పరిస్థితులు అనుకూలించినట్లయితే.. రెండు దేశాల అధ్యక్షులు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ,
వ్లాదిమిర్ పుతిన్‌లు కలిసి చర్చించవచ్చునని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లూట్
కావుసోగ్లూ పేర్కొన్నారు.
యుక్రెయిన్‌లోని పశ్చిమ నగరం లవీవ్‌లో
యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతో కలిసి కావుసోగ్లూ మాట్లాడారు.
పుతిన్, జెలియెన్‌స్కీల మధ్య భేటీ ఏర్పాటు చేయటానికి కృషి చేయాలని తామిరువరం
అంగీకరించినట్లు దిమిత్రో చెప్పారు.
‘‘ఇరువురికీ పరస్పర అంగీకారమైన అంశాలకు
ఒక ప్రాతిపదిక ఉన్నట్లయితే.. వారిద్దరూ కలిసే అవకాశం ఉంది. ఆ భేటీకి మేం సంతోషంగా ఆతిథ్యమిస్తామని
మేం నిన్ననే చెప్పాం’’ అని కావుసోగ్లూ తెలిపారు.
‘‘అధినాయకుల స్థాయిలో సమావేశానికి
సాధ్యమైనంత త్వరగా భూమికను సిద్ధం చేయాల్సిన అవసరముంది. అందుకు నిర్వాహకులుగా
వ్యవహరించటానికి మేం సిద్ధమని ఇప్పటికే ప్రకటించాం’’ అన్నారాయన.
రష్యా, యుక్రెయిన్‌ల మధ్య ఏదైనా శాంతి
ఒప్పందం కుదిరితే.. దానికి పూచీకర్తలుగా వ్యవహరించే దేశాల్లో టర్కీ కూడా ఉంటుందని
తాను ఆశిస్తున్నట్లు కావుసోగ్లూతో దిమిత్రో చెప్పారు.
రష్యాతో యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి… జర్మనీకి జెలియెన్‌స్కీ విజ్ఞప్తి
ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ
జర్మనీ పార్లమెంట్‌లో వర్చువల్ ప్రసంగం చేశారు.
రష్యాతో యుద్ధాన్ని
ఆపడానికి సాయం చేయాలని కోరారు.
రష్యా దాడుల్లో ఇప్పటి వరకు
వంద మందికి పైగా చిన్నారులు చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
జెలియెన్‌స్కీ నిన్న అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రభావం భారత్‌లో కనిపించడం మొదలైందా
ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ మీద రష్యా దాడితో, ఆ ప్రభావం నేరుగా భారత్ మీద కూడా పడుతుందా?
ఈ విషయం మీద చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్ మీద ప్రత్యేక సైనిక చర్యల
చేపడుతున్నట్లు ప్రకటించింది.
ఆ దాడుల ప్రభావం భారత ఆర్థికవ్యవస్థపై కూడా పడినట్లే
కనిపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనమవుతోంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ మార్చి 9న రూ.76.14గా ఉంది. ఇవాళ
అంటే మార్చి 17న డాలర్‍తో
రూపాయి మారకం విలువ రూ.75.86కు చేరింది.
రూపాయి బలహీనం లేదా బలోపేతం కావడం వల్ల ఆ ప్రభావం నేరుగా
ప్రజల జీవితాలపై పడుతుంది.
‘యుక్రెయిన్‌పై రష్యా దాడుల్లో 107 మంది చిన్నారులు చనిపోయారు’, యుక్రెయిన్ స్థానిక అధికారులు
యుక్రెయిన్‌పై రష్యా దాడుల్లో
ఇప్పటి వరకు 107 మంది చిన్నారులు చనిపోయారని, మరో 120 మంది గాయపడ్డారని యుక్రెయిన్
ప్రాసిక్యుటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది.
కీయెవ్, ఖార్కియెవ్,
చెర్నిహివ్, సుమీ, ఖేర్సన్ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పిల్లలు చనిపోయారని
తెలిపింది.
బాంబు దాడుల్లో 410 విద్యా
సంస్థలు ధ్వంసమయ్యాయని, వాటిలో 63 పూర్తిగా నేలమట్టం అయ్యాయని వివరించింది.
11 ఆస్పత్రులు కూడా ధ్వంసమయ్యాయని
పేర్కొంది.
రష్యాకు చైనా సైనికంగా, ఆర్థికంగా ఎలాంటి సాయం చేయగలదు?
ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌లో యుద్ధం తీవ్రమవటంతో పాటు.. అంతర్జాతీయ ఆర్థిక
ఆంక్షలు ఇబ్బంది పెడుతుండటంతో రష్యా ఇప్పుడు మిత్రపక్షాల కోసం వెదుకుతోంది.
యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా దౌత్యపరంగా దూరంగా ఉంటోంది.
రష్యా సైనికదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చేసిన తీర్మానంపై ఓటు
వేయకుండా పక్కకు తప్పుకుంది.
ఒకవేళ రష్యాకు సాయం చేయాలని చైనా నిర్ణయించుకున్నట్లయితే..
సైనికంగా, ఆర్థికంగా చైనా
ఎంత మేరకు సాయం చేయగలదు?
బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ సంక్షోభం: పోలండ్‌లో మిసైల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్న బ్రిటన్
పోలండ్‌లో ‘స్కై సబ్రే మిసైల్ సిస్టమ్’ను మోహరించనుంది బ్రిటన్. దీనితో
పాటు మరో వంద ట్రూప్స్‌ను కూడా మోహరించనున్నట్లు బ్రిటన్ రక్షణ మంత్రి చెప్పారు.
పోలండ్ సరిహద్దుల్లో
యుక్రెయిన్‌లో ఉన్న యవొరివ్ సైనిక శిక్షణ స్థావరంపై ఇటీవల రష్యా చేసిన దాడిలో 35
మంది చనిపోయారు.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఫొటో సోర్స్, Getty Images
నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1047 పాయింట్లు పెరిగి 57863 వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 311 పాయింట్లు పెరిగి 17287 వద్ద ముగిసింది.
ఆటో, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, టీసీఎస్ వంటి షేర్లు బాగా యాక్టివ్‌గా ట్రేడ్ అయ్యాయి.
టాప్ గెయినర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ(5.37%), జేఎస్‌డబ్ల్యూ స్టీల్(4.56%), టైటన్ కంపెనీ(4.47%), ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్(3.94%) వంటి స్టాక్స్ ఉన్నాయి.
బాగా నష్టపోయిన షేర్లలో ఇన్ఫోసిస్(1.84%), సిప్లా(0.69%), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(0.49%) వంటి కంపెనీలున్నాయి.
నెలకు రూ.5 వేలతో రూ.12 లక్షలు ఎలా సంపాదించొచ్చు?
ఫొటో సోర్స్, PTI
నెలకు రూ.5 వేలతో 10 ఏళ్లలో రూ.12 లక్షలు సంపాదించగలమా? కొత్తగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లకు వారెన్ బఫెట్ ఇచ్చిన సలహా ఏంటి? తెలియాలంటే ఇక్కడ క్లిక్
చేయండి.
విశాఖలో కిడ్నాప్ అయిన పాపను కాపాడిన పోలీసులు
ఫొటో సోర్స్, UGC
బుధవారం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో కిడ్నాప్‌కు గురైన పాపను పోలీసులు కాపాడారు. కోటబొమ్మాళి మండలం జర్జంగి వద్ద పాపను తరలిస్తున్న ‘ఏపీ 39 టీసీ 0726’ అనే కారును పోలీసులు పట్టుకున్నారు. ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు కోటబొమ్మాళి సబ్ ఇన్‌స్పెక్టర్ రవి తెలిపారు. హైవే సిబ్బంది కూడా సహకరించనట్లు వెల్లడించారు.
నరేంద్ర మోదీ: కొత్త ప్రపంచంలో భారత్ మరింత వేగంగా దూసుకెళ్లాలి
ఫొటో సోర్స్, ANI
కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల దృష్ట్యా భారత్ మరింత వేగంగా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఇప్పుడు ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, కరోనా నేపథ్యంలో ఏర్పడుతున్న సరికొత్త ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మరింత వేగంగా దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
లాల్ బహదుర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంతో కాలంగా ఎన్నో బ్యాచులను చూస్తూ వస్తున్నానని, కానీ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ ఏడాదిలో శిక్షణ పూర్తి చేసుకున్న మీ బ్యాచ్ చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు.
డెల్టాక్రాన్: ఈ కొత్త కోవిడ్-19 వేరియంట్‌తో ఫోర్త్ వేవ్ వస్తుందా?
ఫొటో సోర్స్, Getty Images
కొత్త కోవిడ్-19 వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 9న ప్రకటించింది.
డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు కలిసి ఏర్పడిన ఈ వేరియంట్‌ను అనధికారికంగా 'డెల్టాక్రాన్' అంటున్నారు.
డబ్ల్యుహెచ్ఓ మాత్రం దీనిని అధికారికంగా AY.4/BA.1 వేరియంట్‌గా చెబుతోంది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించేంత ఆందోళనకరమైన వేరియంటా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.
డెల్టాక్రాన్ కేసులు యూరప్, అమెరికా, దక్షిణ అమెరికాలో బయటపడ్డాయి.
అయితే, ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన కీలక అంశాలు, ముఖ్యంగా ఇది వేగంగా వ్యాపిస్తుందా, టీకాలను తట్టుకోగలదా, లక్షణాలు తీవ్రంగా ఉంటాయా అనేవి శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులకు అంతుపట్టడం లేదు.
హలో ఆల్! మీరు బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ చూస్తున్నారు. మీరు ఇప్పుడే వచ్చిన లేక ఇప్పటి వరకు ఉన్న ముఖ్యాంశాలు తెలుసుకోవాలన్నా ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని ఇందిర పార్క్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన దీక్ష కొనసాగుతోంది. అసెంబ్లీ నుంచి బహిష్కరించడానికి నిరసనగా వారు దీక్ష చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 1158 పాయింట్లు, నిఫ్టీ 337 పాయింట్లు పెరిగాయి.
మరియుపూల్‌లో 1,000 నుంచి 2,000 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఒక థియేటర్‌పై రష్యా చేసిన దాడులను యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌యెస్కీ ఖండించారు. కావాలనే రష్యా దాడి చేసిందని ఆరోపించారు.
చెర్నిహివ్‌లో బ్రెడ్ కోసం క్యూలో నిలబడి ఉన్న 13 మంది రష్యా దాడుల్లో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘యుద్ధ నేరస్థునిగా’ పిలవడం ద్వారా ఆ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారే స్థితికి వచ్చాయి.
‘రష్యాది రక్త దాహం’
ఫొటో సోర్స్, Reuters
రష్యా కావాలనే ప్రజలున్న థియేటర్‌పై దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెయెన్‌స్కీ ఆరోపించారు.
బాంబుల దాడుల నుంచి తప్పించుకునేందుకు వందల మంది మరియుపూల్‌లోని ఒక థియేటర్‌లో దాక్కున్నారు. దాడి జరిగిన సమయంలో అందులో 1,000 నుంచి 2,000 మంది ఉంటారని అంచనా.
రష్యా యుద్ధ విమానాలకు కనపడేలా ‘ఇక్కడ పిల్లలున్నారు’ అనే పదాలను ఆ థియేటర్ ముందు రాశారు.
ఈ దాడిని ఖండించిన మైకోలియెవ్ నగర మేయర్, రష్యాది రక్త దాహమని అన్నారు. కానీ రష్యా మాత్రం ఆ దాడిని తాము చేయలేదని ప్రకటించింది.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో సోర్స్, Getty Images
బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ యుద్ధం: రష్యా బలగాలు దాదాపుగా ఆగిపోయాయన్న బ్రిటన్
యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా బలగాలు ముందుకు కదలలేక పోతున్నాయని బ్రిటన్ రక్షణశాఖ ప్రకటించింది.
నేల, నింగి, సముద్రం మీద రష్యా సేనలు పెద్దగా పురోగతి సాధించడం లేదని వారు భారీగా నష్టపోతున్నారని తెలిపింది.
‘యుక్రెయిన్ మిలిటరీ చాలా గట్టిగా పోరాడుతోంది. యుక్రెయిన్‌లోని అత్యధిక భూభాగంతోపాటు ప్రధాన నగరాలు యుక్రెయిన్ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి.’ అని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో బ్రిటన్ రక్షణశాఖ వెల్లడించింది.
తమను గెలిచి ముందుకు రాలేకపోతున్న రష్యా సేనలు పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని బాంబులతో దాడులు చేస్తున్నాయని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
ఇప్పటి వరకు యుద్ధంలో 500 మంది మాత్రమే చనిపోయారని రష్యా చెబుతోంది. కానీ వీరి సంఖ్య 7వేల వరకు ఉండొచ్చని అమెరికా నిఘా విభాగం అంచనా వేస్తోంది.
భూకంపంతో జపాన్ ఇలా కంపించింది.
వీడియో క్యాప్షన్, First pictures of earthquake hitting Japan
బుధవారం రాత్రి జపాన్‌లో శక్తిమంతమైన భూకంపం వచ్చింది. ఈశాన్య జపాన్‌లో భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా సుమారు 90 మంది గాయపడ్డారు. 20 లక్షల ఇళ్లకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
జపాన్ రాజధాని టోక్యోలో ప్రజలు నిలబడటం కూడా కష్టంగా మారినట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ చెబుతోంది. ఫుకుషిమాలో ఒక బుల్లెట్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు రైల్వే ఆపరేటర్లు తెలిపారు.