మాక్రాన్‌తో పుతిన్: ‘చర్చలా, యుద్ధమా.. ఏదో ఒక మార్గంలో మా డిమాండ్లు నెరవేర్చుకుంటాం’

ఆదివారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు రెండు గంటల పాటు ఫోన్లో చర్చించుకున్నారు. చర్చలు, లేదంటే యుద్ధం.. ఏదో ఒక మార్గంలో తాము తమ డిమాండ్లు నెరవేర్చుకుంటామని పుతిన్ స్పష్టం చేశారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ

  1. యుక్రెయిన్‌ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలని భారత్‌పై ఒత్తిడి

    భారత్, యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Getty Images

    వికాస్ పాండే

    బీబీసీ ప్రతినిధి

    యుక్రెయిన్‌ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలని భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

    భారత్, మాస్కోకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తీర్మానంపై వోటు వేసేందుకు నిరాకరించింది. అయితే, యుక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి దౌత్యపరమైన చర్చలు జరగాలని కోరింది.

    భారతదేశం రక్షణ దిగుమతుల్లో 50 శాతం రష్యా నుంచే వస్తాయి. అంతే కాకుండా, ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి.

    అయితే, గత రెండు దశాబ్దాలుగా అమెరికాతో కూడా భారత్ సంబంధాలు బలపడుతున్నాయి.

    ఈ పరిస్థితిలో యుక్రెయిన్ సంక్షోభంపై స్పష్టమైన వైఖరి తీసుకోవడం భారత్‌కు పెను సవాలే.

    భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ శనివారం భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని స్వాగతించారు.

    మరోవైపు, యుక్రెయిన్‌పై భారతదేశం స్పష్టమైన వైఖరిని తీసుకునేలా వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని అమెరికా సీనియర్ దౌత్యవేత్త డొనాల్డ్ లూ అన్నారు.

  2. రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం

    యుక్రెయిన్‌, రష్యా సంక్షోభం 11వ రోజుకు చేరుకుంది.

    కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, మరియుపూల్‌పై రష్యా బాంబు దాడిని కొనసాగిస్తోంది. దాంతో, అక్కడి ప్రజలను తరలించడం నిలిపివేశారు. ప్రజలు మళ్లీ షెల్టర్లలోకి మళ్లారు. వోల్నోవాఖా నగరంలో కూడా ఇదే పరిస్థితి.

    యుక్రెయిన్‌పై ఏ దేశమైనా నో-ఫ్లై జోన్‌ ప్రకటిస్తే, ఆ దేశం సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగానే తాము భావిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.

    యుక్రెయిన్ అధ్యక్షుడు, తమ దేశ గగనతలాన్ని 'నో -ఫ్లైజోన్' చేయడానికి నిరాకరించిన నాటో నేతల వైఖరిని తీవ్రంగా ఖండించారు.

    ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.