యుక్రెయిన్‌పై రష్యా దాడులు: గత కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..
యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుక్రెయిన్‌లోని మరియుపూల్, వోల్నోవాఖా నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
అయితే, కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. రష్యా దాడులు చేస్తోందని యుక్రెయిన్ చెబుతోంది. దాంతో ప్రజల తరలింపును వాయిదా వేసింది. కేవలం 400 మందిని మాత్రమే తరలించినట్లు యుక్రెయిన్ వెల్లడించింది.
ఇక, యుక్రెయిన్‌పై ఏ దేశమైనా నో ఫ్లై జోన్ ప్రకటిస్తే, ఆ దేశం సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగానే తాము భావిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.
తమ దేశ గగనతలాన్ని 'నో -ఫ్లైజోన్' చేయడానికి నిరాకరించిన నాటో నేతల వైఖరిని యుక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.
అయితే, అలా చేస్తే ఈ యుద్ధం ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదకర పరిణామాలకు అది దారి తీస్తుందని నాటో చెబుతోంది.
ఖార్కియెవ్ నుంచి భారతీయులు అందరినీ తరలించేశామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక తమ దృష్టి అంతా సుమీపై ఉందని తెలిపింది. అయితే, సుమీలో హింస కొనసాగుతుండటం, రవాణా సౌకర్యాలు లేకపోవడం పెద్ద సవాలుగా మారిందని తెలిపింది. అక్కడి నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు కాల్పుల విరమణ పాటించడమే ఉత్తమ మార్గమని చెప్పింది.
యుక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్ ఇవి. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.














