You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పుతిన్ హెచ్చరిక: ‘ఏ దేశమైనా అలా చేసిందంటే యుద్ధంలో దిగినట్టే లెక్క’

‘ఏ దేశమైనా ఈ దిశగా చర్య తీసుకుంటే, యుక్రెయిన్‌తో జరుగుతున్న సాయుధ పోరాటంలో ఆ దేశం కూడా పాల్గొన్నట్టుగానే మేం భావిస్తాం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. తమ దేశ గగనతలాన్ని 'నో -ఫ్లైజోన్' చేయడానికి నిరాకరించిన నాటో నేతల వైఖరిని యుక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ

  1. యుక్రెయిన్‌పై రష్యా దాడులు: గత కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..

    యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

    ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుక్రెయిన్‌లోని మరియుపూల్‌, వోల్నోవాఖా నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.

    అయితే, కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. రష్యా దాడులు చేస్తోందని యుక్రెయిన్ చెబుతోంది. దాంతో ప్రజల తరలింపును వాయిదా వేసింది. కేవలం 400 మందిని మాత్రమే తరలించినట్లు యుక్రెయిన్ వెల్లడించింది.

    ఇక, యుక్రెయిన్‌పై ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌ ప్రకటిస్తే, ఆ దేశం సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగానే తాము భావిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.

    తమ దేశ గగనతలాన్ని 'నో -ఫ్లైజోన్' చేయడానికి నిరాకరించిన నాటో నేతల వైఖరిని యుక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.

    అయితే, అలా చేస్తే ఈ యుద్ధం ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదకర పరిణామాలకు అది దారి తీస్తుందని నాటో చెబుతోంది.

    ఖార్కియెవ్ నుంచి భారతీయులు అందరినీ తరలించేశామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక తమ దృష్టి అంతా సుమీపై ఉందని తెలిపింది. అయితే, సుమీలో హింస కొనసాగుతుండటం, రవాణా సౌకర్యాలు లేకపోవడం పెద్ద సవాలుగా మారిందని తెలిపింది. అక్కడి నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు కాల్పుల విరమణ పాటించడమే ఉత్తమ మార్గమని చెప్పింది.

    యుక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్ ఇవి. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

  2. ‘బాంబులు పడుతున్నా మేము వెళ్లిపోతున్నాం. మాకు ఏమైనా ప్రభుత్వానిదే బాధ్యత’

    తూర్పు యుక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

  3. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ఖండించారు.

    రష్యాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

    స్విట్జర్లాండ్, క్రొయేషియా, థాయ్‌లాండ్‌, బ్రిటన్‌లోని లండన్, బాత్‌లో జరిగిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల ఫొటోలివి.

  4. రష్యా భారీ క్షిపణి దాడి, కెమెరాలో రికార్డైన దృశ్యాలు

  5. బ్రేకింగ్ న్యూస్, నో ఫ్లై జోన్ విధిస్తే యుద్ధంలో పాల్గొన్నట్టుగానే భావిస్తాం: పుతిన్

    యుక్రెయిన్‌పై ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌ విధిస్తే, ఆ దేశం యుద్ధంలో పాల్గొన్నట్టుగానే భావిస్తామని పుతిన్ హెచ్చరించారు.

    ‘ఏ దేశమైనా ఈ దిశగా చర్య తీసుకుంటే, యుక్రెయిన్‌తో జరుగుతున్న సాయుధ పోరాటంలో ఆ దేశం కూడా పాల్గొన్నట్టుగానే మేం భావిస్తాం’ అని రష్యా అధ్యక్షుడు చెప్పారు.

    నో ఫ్లై జోన్ అంటే.. విమానాలు గగనతలంలో ప్రవేశించకుండా నిషేధించడం. సైనికపరంగా చూస్తే దాడులు చేయకుండా గగనతలంలోకి యుద్ధ విమానాల ప్రవేశాన్ని అడ్డుకోవడం.

    తమ దేశ గగనతలాన్ని 'నో -ఫ్లైజోన్' చేయడానికి నిరాకరించిన నాటో నేతల వైఖరిని యుక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.

    అయితే, అలా చేస్తే ఈ యుద్ధం ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని నాటో చెబుతోంది.

  6. ‘ఖార్కియెవ్‌ నుంచి భారతీయులందరినీ తరలించేశాం.. ఇక దృష్టి అంతా సుమీ పైనే’

    ఖార్కియెవ్‌లో ఒక్క భారతీయుడు కూడా లేరని, అందరిని సురక్షితంగా తరలించామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

    ఇక ఇప్పుడు తమ ఫోకస్ అంతా సుమీ మీద పెడుతున్నామని వెల్లడించింది.

    సుమీలో హింస కొనసాగుతుండటం, రవాణా సౌకర్యాలు లేకపోవడం పెద్ద సవాలుగా మారిందని తెలిపింది. అక్కడి నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు అక్కడ కాల్పుల విరమణ పాటించడమే ఉత్తమ మార్గమని చెప్పింది.

  7. రష్యాలో మార్షల్ లా విధించే ఆలోచన లేదు: పుతిన్

    రష్యాలో మార్షల్ లా విధించే ఆలోచన తనకు లేదని పుతిన్ స్పష్టం చేశారు.

    బయటి నుంచి దురాక్రమణ జరిగినప్పుడు, నిర్దేశించిన ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలకు సంబంధించిన విషయంలో మాత్రమే మార్షల్ లా విధిస్తామని పుతిన్ చెప్పారు.

    ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, వస్తుందని కూడా అనుకోవడం లేదని ఆయన అన్నారు.

    మార్షల్ లా విధించాలని పుతిన్ అనుకుంటున్నారని పుకార్లు వచ్చాయి.

    మార్షల్ లా విధిస్తే ప్రభుత్వ విధులు సైన్యం చేతుల్లోకి వెళ్తాయి. లేదా సివిల్ లా సస్పెండ్ అవుతుంది.

  8. యుక్రెయిన్‌లోని రైల్వే స్టేషన్లలో ఇదీ పరిస్థితి..

    యుక్రెయిన్‌లోని రైల్వే స్టేషన్లలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.

    శరణార్థులు పోటెత్తడంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు.

    ‘‘రైళ్లలోకి పురుషులు వెళ్లొద్దని’’ పోలీసులు అడ్డుకుంటున్నారు.

    పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.

  9. ‘వోల్నోవాఖాలోని ప్రతి భవనం దెబ్బతింది’

    4లక్షల 50వేల మంది ప్రజలుండే మరియుపూల్‌లో తీవ్రంగా షెల్లింగ్ జరిగిందని గతవారమంతా మనం విన్నాం.

    కానీ తీవ్రమైన పోరాటం చోటు చేసుకున్న వోల్నోవాఖా అనే చిన్న పట్టణం గురించి వార్తలు పెద్దగా బయటకు రాలేదు.

    ఇప్పుడు వోల్నోవాఖాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తున్నారు.

    ఇక్కడ 25000 మంది ప్రజలు ఉంటారు. మరియుపూల్, దోన్యస్క్‌ నగరాలకు ఇది దాదాపు మధ్యలో ఉంటుంది.

    రష్యా దాడుల్లో ఇక్కడున్న ప్రతి ఒక్క భవనం పూర్తిగా ధ్వంసం కావడమో లేదా దెబ్బతినడమో జరిగిందని స్థానికులు గార్డియన్‌పత్రికతో చెప్పారు.

    పోరాటం ఎంత తీవ్రంగా ఉందంటే.. శవాలను తీసుకురావడానికి కూడా వీలుకాలేదని స్థానిక ఎంపీ దిమిత్రో లుబినెట్ చెప్పారు.

  10. క్షిపణి దాడిలో కూలిపోయిన రష్యా హెలికాప్టర్

    క్షిపణి ఢీకొట్టడంతో రష్యా హెలికాప్టర్‌ కూలిపోయింది.

    యుక్రెయిన్ సైన్యం ఈ వీడియోను విడుదల చేసింది.

    మిసైల్ ఢీకొన్న తర్వాత హెలికాప్టర్ ఎలా కుప్పకూలిందో చూడండి.

  11. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ జాతీయవాదులే ప్రజల తరలింపును అడ్డుకున్నారు: రష్యా

    రెండు నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, రష్యా దాడులు చేస్తూనే ఉందని మరియుపూల్‌ డిప్యూటీ మేయర్ బీబీసీతో చెప్పారు.

    అయితే, రష్యా రక్షణ శాఖ మరో వాదన వినిపిస్తోంది.

    ప్రజలు నగరాలను వదిలి వెళ్లకుండా ‘యుక్రెయిన్ జాతీయవాదులే’ అడ్డుకున్నారని రష్యా న్యూస్ ఏజెన్సీ రియా పేర్కొంది.

    ప్రజలను తరలించడానికి ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసిన తర్వాత రష్యా సైన్యంపై కాల్పులు జరిగాయని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

  12. 'మా అబ్బాయి శవం జాడ కూడా తెలియడం లేదు', యుక్రెయిన్‌లో కొడుకును పోగొట్టుకున్న తండ్రి ఆవేదన

    యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్ నగరంలో సరకుల కోసం తన బంకర్‌ నుంచి బయటికొచ్చినపుడు బుల్లెట్ తగిలి భారత్‌కు చెందిన నవీన్‌ చనిపోయారు.

    తన కొడుకు శవం ఎక్కడ ఉందో చెప్పకపోవడంపై నవీన్ తండ్రి శేఖరప్ప జ్ఞానగౌడర్ ఆందోళన చెందుతున్నారు.

  13. 'యుక్రెయిన్, రష్యా ప్రభుత్వాలపై అనేక మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నాం'

    యుక్రెయిన్‌లోని సుమిలో ఉన్న భారతీయ విద్యార్థుల గురించి తమకు ఆందోళనగా ఉందని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.

    ‘విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు తక్షణ కాల్పుల విరమణ పాటించాలని రష్యా, యుక్రెయిన్ ప్రభుత్వాపై అనేక మార్గాల్లో ఒత్తిడి తీసుకొచ్చాం’ అని ఆయన చెప్పారు.

    విద్యార్థులు బాంబ్ షెల్టర్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

    భారత విదేశాంగ శాఖ, అక్కడి రాయబార కార్యాలయం సిబ్బంది విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారని ఆయన తెలిపారు.

  14. బ్రేకింగ్ న్యూస్, మరియుపూల్‌ నుంచి ప్రజల తరలింపు వాయిదా

    మరియుపూల్‌ నుంచి ప్రజల తరలింపు వాయిదా పడిందని ఆ సిటీ కౌన్సిల్ పేర్కొంది. తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా పాటించడం లేదని సిటీ కౌన్సిల్ తెలిపింది.

    ప్రజలంతా తిరిగి షెల్టర్లకు వెళ్లిపోవాలని, త్వరలో మరింత సమాచారం అందిస్తామని వెల్లడించింది.

    నిరంతరం దాడులు చేస్తుంటే ప్రజలను తరలించడం అసాధ్యమని మరియుపూల్ డిప్యూటీ మేయర్ బీబీసీతో చెప్పారు.

    ప్రజలను తరలించడానికి అంగీకరించిన మార్గంలో ఒరిఖీవ్ నగరం దగ్గర రష్యా దాడులు చేస్తోందని ఆయన తెలిపారు.

    కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై రష్యా అధికారులతో మాట్లాడినట్లు, చర్చలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

  15. బ్రేకింగ్ న్యూస్, తాత్కాలిక కాల్పుల విరమణ పూర్తిగా అమలు కావడం లేదు- యుక్రెయిన్

    మరియుపూల్‌ నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కోసం రష్యా, యుక్రెయిన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని మరియుపూల్ సిటీ కౌన్సిల్ చెబుతోంది.

    జపోరిఝియా ప్రాంతంలో పోరాటం ఇంకా కొనసాగుతోందంటూ సిటీ కౌన్సిల్ టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది.

    తరలింపు మార్గం మొత్తం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించేలా రష్యా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.

  16. యుక్రెయిన్-రష్యా యుద్ధాన్ని చైనా ఆపగలదా? షీ జిన్‌పింగ్ చెబితే పుతిన్ వింటారా?

    చైనా, రష్యాల మధ్య కొత్తగా బలపడిన బంధానికి "పరిమితి లేదు" అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒక నెల క్రితం ప్రకటించారు.

    గత నెల, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటించారు. బీజింగ్‌లో షీ జిన్‌పింగ్‌తో సమావేశమైన తరువాత, ఇరువురూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అనంతరం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

    ఒలింపిక్ గేమ్స్ ముగిసిన కొద్ది రోజుల్లోనే, యుక్రెయిన్‌పై "ప్రత్యేక సైనిక చర్య" ప్రకటించారు పుతిన్.

    చైనా ప్రభుత్వం ఈ దాడిని ఖండించలేదు, మన్నించలేదు. అసలు దాన్ని "దండయాత్ర" అని పిలవలేదు కూడా.

  17. రష్యా బలగాలు యుక్రెయిన్‌లో ఎంతవరకు వచ్చాయి?

    రష్యా నియంత్రణలో ఉన్న యుక్రెయిన్ ప్రాంతాలేవి?ఈ మ్యాప్‌లో చూడండి.

  18. యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందా

    యుక్రెయిన్ దగ్గర 1991లో 3,000 అణ్వాయుధాలు ఉండేవి.

    కానీ, నేడు అణ్వాయుధాలు లేని దేశంగా యుక్రెయిన్ మారింది.

    అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత మూడు దశాబ్దాలలో ఏం జరిగింది?

    ఈ వీడియోలో చూడండి.

  19. బ్రేకింగ్ న్యూస్, మరియుపూల్‌ నుంచి ప్రజల తరలింపు

    యుక్రెయిన్‌లోని మరియుపూల్, వోల్నోవాఖా నగరాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.

    ఈ విషయాన్ని యుక్రెయిన్ కూడా నిర్ధారించింది. దీంతో ఈ రెండు నగరాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

    మరియుపూల్‌ నుంచి ప్రజలను తరలించడానికి బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రజల తరలింపు మొదలవుతుందని సిటీ కౌన్సిల్ పేర్కొంది. ప్రజలు తమ సొంత వాహనాల్లో కూడా నిర్ధారించిన మార్గంలో వెళ్లొచ్చని తెలిపింది.

    ‘రష్యా ఆక్రమణదారులు నిరంతరం కాల్పులు జరుపుతుండటంతో ప్రజలను తరలించడం మినహా తమకు మరో మార్గం లేకపోయింది' అని మరియుపూల్ మేయర్ చెప్పారు.

  20. పదవ రోజు యుద్ధం.. తాత్కాలిక కాల్పుల విరమణ

    రష్యా, యుక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి పదవరోజు.

    యుక్రెయిన్‌లోని మరియుపూల్, వోల్నోవాఖా నగరాల్లో మానవతా సహాయం అందించేందుకు వీలు కల్పిస్తూ రష్యా తాత్కాలికంగా కాల్పులు నిలిపివేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఇదీ ఈనాటి ముఖ్యాంశం.

    రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ మీకు సతీష్ ఊరుగొండ అందిస్తారు.

    ధన్యవాదాలు