యుక్రెయిన్ విషయంలో అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యాతో సంబంధాలలో సమతౌల్యతను కొనసాగించడంలో ఇండియా తీవ్రమైన పరీక్షను ఎదుర్కుంటోంది.
ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో ఈ అంశంపై దిల్లీ చేసిన మొదటి ప్రకటనలో నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించలేదు. అయితే దౌత్యానికి, చర్చలకు అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం నుండి వచ్చిన పిలుపులను పట్టించుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది.
రష్యాపై పరోక్షంగా చేసిన విమర్శ అంతటితోనే ఆగిపోయింది. యుక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించడానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యుఎన్ఎస్‌సి) ముసాయిదా తీర్మానంపై ఓటు వేయడానికి ముందు, సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీకి అటు రష్యా, యుక్రెయిన్, ఇటు అమెరికాల నుంచి కాల్స్ వచ్చాయి.
సరైన నిర్ణయం తీసుకోవాలంటూ యుక్రెయిన్, రష్యాలు బహిరంగంగానే ఇండియాకు విజ్ఞప్తి చేశాయి. కానీ, ఇండియా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే, దాని ప్రకటనను జాగ్రత్తగా పరిశీలిస్తే, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాలని పరోక్షంగా మాస్కోను కోరినట్లు అర్ధమవుతుంది.
ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలకు గౌరవం ఇవ్వడం గురించి ఇండియా తన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించింది.