You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మూడువైపుల నుంచి యుక్రెయిన్‌పై రష్యా దాడులు, ఆరు విమానాలను కూల్చేశామన్న యుక్రెయిన్

యుక్రెయిన్‌పై రష్యా భారీ సైనిక చర్యకు దిగింది. రష్యా దాడుల్లో ఏడుగురు చనిపోయారని, 19 మంది ఆచూకీ తెలియడం లేదని యుక్రెయిన్ పోలీసులు చెబుతున్నారు. రష్యా దురాక్రమణను యూరప్‌లో భారీ యుద్ధానికి నాందిగా యుక్రెయిన్ అధ్యక్షుడు అభివర్ణించారు.

లైవ్ కవరేజీ

  1. మాస్కో జనంలో దిగ్భ్రాంతి, భయం, ఆశ్చర్యం, సెర్గీ గొరియాషికో, బీబీసీ రష్యన్, మాస్కో

    యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడి ప్రారంభించటంతో.. రష్యా రాజధాని మాస్కోలోనూ జనంలో దిగ్భ్రాంతి, భయం, ఆశ్చర్యం కనిపిస్తున్నాయి.

    యుక్రెయిన్ మీద సైనిక దాడి వార్తలు రాగానే.. తాము ఏం చేయాలంటూ మాస్కో నివాసులు ఒకరికొకరు సందేశాలు పంపించుకుంటున్నారు.

    ఆహారం కొని పెట్టుకోవాలా? లేదంటే అమెరికా డాలర్లు తెచ్చి పెట్టుకోవాలా? అన్నది వారికి సంశయంగా మారింది.

    మాస్కో స్టాక్ ఎక్సేంజ్ ట్రేడింగ్ నిలిపివేయటంతో రష్యా కరెన్సీ రూబుల్ పరిస్థితి ఏమవుతుందని కూడా కొందరు వాకబు చేస్తున్నారు.

    బ్యాంకులు, కరెన్సీ మార్పిడి కేంద్రాల దగ్గర పెద్ద సంఖ్యలో జనం క్యూకట్టారు. వీధుల్లో పోలీసుల సంఖ్య కూడా పెరిగింది.

    ఇక యుక్రెయిన్ మీద యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారు గురువారం సాయంత్రం మాస్కోలో ప్రదర్శన నిర్వహించే అవకాశం గురించి చర్చిస్తున్నారు.

    అయితే అటువంటి ప్రదర్శనకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించటం లేదు. గత కొద్ది రోజులుగా ఒంటరిగా నిరసన తెలుపుతున్న వ్యక్తులను పోలీసులు తక్షణమే నిర్బంధించారు.

    సైనిక చర్య మొదలుకావటానికి ముందు నిర్వహించిన అభిప్రాయ సర్వేలో.. యుక్రెయిన్‌తో యుద్ధం సాధ్యం కాదని దాదాపు సగం మంది రష్యన్లు నమ్మారు.

    వారిలో అత్యధిక శాతం మంది జనం.. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ముదిరిపోవటానికి కారణం పశ్చిమ దేశాలు, నాటోనేనని తప్పుపట్టారు.

  2. రష్యా దాడిలో యుక్రెయిన్ విలవిల

    యుక్రెయిన్ మీద రష్యా భారీస్థాయి సైనిక దాడి చేపట్టటంతో దేశంలోని ప్రధాన నగరాల సమీపంలో క్షిపణుల పేలుళ్లు, బాంబు పేలుళ్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఈ దాడులు ఎక్కడ జరుగుతున్నాయనే దానిపై అనేక వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వీడియోలు పోస్టవుతున్నాయి.

    వాటిని షేర్ చేసే ముందు అందులో ఏముంది, అవి ఎంత వరకూ వాస్తవమైనవనే వాటిని మేం పరిశీలిస్తున్నాం.

  3. రష్యాతో దౌత్య సంబంధాలు తెంపుకున్న యుక్రెయిన్, కోరిన వారికి ఆయుధాలు అందిస్తామన్న దేశాధ్యక్షుడు

    యుక్రెయిన్ భూభాగంపై రష్యా దండెత్తటంతో.. రష్యాతో దౌత్య సంబంధాలను యుక్రెయిన్ అధికారికంగా తెంపేసుకుంది.

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

    దేశ ప్రజల్లో ఎవరు కావాలనుకున్నా ఆయుధాలు అందిస్తామని ఆయన చెప్పినట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది.

    రష్యాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలి వారాల్లో యుక్రెయిన్ సాధారణ పౌరులు ప్రాధమిక సైనిక శిక్షణ పొందుతున్న దృశ్యాలు చాలా వెలువడ్డాయి.

  4. రష్యా సైనిక చర్యలతో మనం వాడే సరకుల ధరలు ఎందుకు పెరుగుతాయి?

  5. ఫొటోలు: కీవ్ వీడివెళుతున్న జనం

    రష్యా సైనిక దాడి ప్రారంభించిన నేపథ్యంలో యుక్రెయిన్ రాజధాని కీవ్ నివాసులు నగరం విడిచి వెళ్లటానికి ప్రయత్నిస్తుండటంతో గురువారం ఉదయం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.

    మిగతా ప్రాంతాల్లో సైతం ప్రజలు మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. బస్సులు, బ్యాంకులు, ఏటీఎం క్యాష్ పాయింట్ల దగ్గర, పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు.

    పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ జనం శాంతంగా ఉండాలని యుక్రెయిన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ప్రజలు, మీడియా తమకు వచ్చిన సమాచారాన్ని షేర్ చేసే ముందు తనిఖీ చేసుకోవాలని కోరింది. ఫేక్ న్యూస్ దేశానికి అతి పెద్ద ముప్పు అవుతుందని హెచ్చరించింది.

    యుక్రెయిన్‌ ప్రజలు భయంతో కకావికలం కావాలని రష్యా కోరుకుంటోందని.. జనం ధైర్యంగా ఉండాలని అధ్యక్షుడి అధికార ప్రతినిధి సెర్హే నికిఫొరొవ్ పేర్కొన్నారు.

  6. పౌర విమానాలను రద్దు చేసిన యుక్రెయిన్

    యుక్రెయిన్ మీద దాడి జరుగుతుండటంతో.. తమ దేశపు గగనతలాన్ని యుక్రెయిన్ స్టేట్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ విభాగం మూసివేసింది.

    కీవ్ కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటాక 02:45 గంటల నుంచి విమానాలన్నిటినీ రద్దు చేసింది. పౌర విమానయాన భద్రతకు తీవ్ర ముప్పు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

    ‘‘యుక్రెయిన్ గగనతలాన్ని పౌర వినియోగదారులు వినియోగించుకునే అవకాశాన్ని నిలిపివేశాం’’ అని చెప్పింది.

    యుక్రెయిన్ నుంచి తమ విమానాల రాకపోకలన్నిటినీ కనీసం రాబోయే 14 రోజుల పాటు రద్దు చేసినట్లు ర్యాన్‌ఎయిర్ సంస్థ ప్రకటించింది.

  7. యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో దాడులు

    యుక్రెయిన్‌లో కీవ్, ఖార్కీవ్ సహా అనేక ప్రాంతాల్లో క్షిపణి దాడులు, పేలుళ్లు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    గురువారం తెల్లవారుజామున టీవీలో ప్రసంగించిన పుతిన్.. యుక్రెయిన్‌ను ఆక్రమించాలన్నది రష్యా ప్రణాళిక కాదని చెప్పారు. అయితే.. యుక్రెయిన్ సైన్యం ఆయుధాలను విసర్జించాలని డిమాండ్ చేశారు.

    కొంత సేపటి తర్వాత యుక్రెయిన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.

    రష్యా పూర్తిస్థాయి మొదలుపెట్టిందని యుక్రెయిన్ చెప్పింది.

  8. గత కొన్ని గంటల్లో ఏం జరిగింది?

    యుక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు మారిపోతున్నాయి.

    రష్యా- యుక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించిన ఇప్పటివరకు జరిగిన కొన్ని కీలక పరిణామాలు ఇక్కడ చూడండి.

    • డాన్‌బాస్ ప్రాంతంలో స్పెషల్ మిలిటరీ ఆపరేషన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆదేశించారు. యుక్రెయిన్ అంశంలో దూకుడుగా వెళ్లొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కోరుతున్న సమయంలోనే ఒక టెలివిజన్ ప్రసంగంలో పుతిన్ ఈ ఆదేశాలను జారీ చేశారు.
    • యుక్రెయిన్ సైనిక దళాలను వెనక్కి పంపడమే తన చర్య ఉద్దేశమని టీవీ ప్రసంగంలో పుతిన్ అన్నారు.
    • యుక్రెయిన్‌లోని చాలా ప్రాంతాల నుంచి క్షిపణి దాడులకు సంబంధించిన వార్తలు వెలువడుతున్నాయి. కీవ్‌లో కూడా ఇలాంటి దాడి జరిగినట్లు చెబుతున్నారు.
    • ‘‘విస్తృత స్థాయిలో దాడి’ చేయడం పట్ల యుక్రెయిన్ విదేశాంగ మంత్రి రష్యాను విమర్శించారు. దాడులను ఆపడానికి ఐక్యరాజ్యసమితి అన్నివిధాలా ప్రయత్నించాలని ఆయన కోరారు.
    • యుక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. మానవ విషాదాన్ని మిగిల్చే, ప్రజల ప్రాణాలను హరించే ముందస్తు ప్రణాళికతో కూడిన యుద్ధానికి పుతిన్ దిగారని బైడెన్ అన్నారు.
    • రష్యా దాడిని బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి, నాటో కూటమిలకు చెందిన నాయకులంతా ముక్త కంఠంతో ఖండించారు.
  9. క్రిమియా నుంచి యుక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా సైనిక బలగాలు

    రష్యా సైనిక శ్రేణి క్రిమియా ద్వీపకల్పం నుంచి సరిహద్దు దాటి దక్షిణ యుక్రెయిన్‌లోకి ప్రవేశిస్తున్న ఫొటోలను యుక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ విడుదల చేసింది.

    యుక్రెయిన్‌లో భాగంగా ఉండిన క్రిమియాను రష్యా 2014లో తనలో విలీనం చేసుకుంది.

    రష్యా తన సైనిక వాహనాలను సరిహద్దు దాటించే ముందు భారీ ఎత్తున కాల్పులు జరిపిందని యుక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ తెలిపింది.

    ఉత్తరాన బెలారుస్ నుంచి, తూర్పున రష్యా నుంచి కూడా రష్యా సైనిక బలగాలు యుక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లు ఆ దేశం వెల్లడించింది.

  10. పుతిన్ ఆధునిక హిట్లర్: యుక్రెయిన్ మాజీ అధ్యక్షుడు

    ఇది విషాద దినమని.. కానీ యుక్రెయిన్ గెలుస్తుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు పెట్రో పొరొషెంకో పేర్కొన్నారు.

    కీవ్‌లో పార్లమెంటు సభ్యులు ఈ సంక్షోభం గురించి చర్చిస్తున్నారు. పార్లమెంటు వెలుపల పొరొషెంకో మీడియాతో మాట్లాడారు.

    2014-19 మధ్య అధ్యక్షుడిగా ఉన్న పొరొషెంకో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆధునిక హిట్లర్‌గా అభివర్ణించారు.

    యుక్రెయిన్ పార్లమెంటులో పరిస్థితి ఉత్కంఠగా ఉందని, పార్లమెంటు లోపల సాయుధ సైనికులు చాలా మంది ఉన్నారని.. ఆ భవనం లోపలున్న యుక్రెయిన్ జర్నలిస్ట్ ఒకరు బీబీసీకి చెప్పారు.

  11. రష్యా చర్య ఓ కీలక ఘట్టం, స్టీవ్ రోసెన్‌బర్గ్, బీబీసీ మాస్కో ప్రతినిధి

    కొన్ని వారాలుగా ప్రపంచ నేతలు రష్యా అధ్యక్షుడిని కలిసి దౌత్య ప్రయత్నాలు చేసినప్పటికీ.. యుక్రెయిన్ మీద పూర్తిస్థాయి సైనిక దాడికి మొదటి నుంచీ ప్రణాళిక రచించినట్లు కనిపిస్తోంది.

    యుక్రెయిన్‌ను తాను రష్యా భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నానని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు.

    ఆధునిక యుక్రెయిన్‌ను ఓ సార్వభౌమ దేశంగా తాను చూడటం లేదనీ రష్యా అధ్యక్షుడు విస్పష్టంగా చెప్పారు.

    ఆ దేశాన్ని రష్యా నిర్మించిన ఒక నిర్మాణంగా, రష్యా కక్ష్యకే చెందాల్సిన ఓ ప్రాంతంగా చూస్తున్నారాయన.

    రష్యా ప్రభావ పరిధిలోకి యుక్రెయిన్‌ను బలవంతంగా తీసుకువచ్చేందుకు ఆయన తన ఈ చర్యతో ముందుకు కదిలారు.

    తర్వాత ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోందనేది నిజంగా ఓ కీలక ఘట్టం. పశ్చిమ దేశాలను విస్మరించి తన ప్రణాళికతో ముందుకు సాగాలని పుతిన్ నిర్ణయించుకున్నారనేందుకు ఇది సంకేతం.

  12. అన్ని దిశల నుంచీ రష్యా దాడులు, పాల్ ఆడమ్స్, బీబీసీ దౌత్య ప్రతినిధి, కీవ్

    రష్యా సైనిక వాహనాలు.. ఉత్తరాన బెలారుస్ నుంచి, దక్షిణాన క్రిమియా నుంచి సహా అనేక ప్రాంతాల నుంచి తమ దేశంలోకి ప్రవేశించినట్లు యుక్రెయిన్ చెప్తోంది.

    తూర్పున ఖార్కీవ్, లుహాన్స్క్ ప్రాంతం నుంచి కూడా రష్యా సైన్యం సరిహద్దులు దాటింది. అక్కడ సైనిక వాహనాలను యుక్రెయిన్‌లోకి పంపించే ముందు రష్యా భారీ ఎత్తున కాల్పులు జరిపింది.

    పది రోజుల కిందట పశ్చిమ దేశాల నిఘా సంస్థల అంచనా ప్రకారం.. రష్యా కీవ్ మీద (ఉత్తరం వైపు నుంచి) విజయవంతంగా దాడి చేయాలంటే.. యుక్రెయిన్‌కు చెందిన అత్యంత సమర్థవంతమైన సైనిక విభాగాలను (తూర్పున, డోన్బాస్‌కు అభిముఖంగా ఉన్న బలగాలను) చుట్టుముట్టి నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది.

    ఇప్పటివరకూ పరిణామాలను చూస్తుంటే అన్ని వైపుల నుంచీ దాడి జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

  13. రష్యా బాంబు దాడుల్లో ఏడుగురి మృతి: యుక్రెయిన్ పోలీసులు

    రష్యా బలగాల బాంబు దాడుల్లో ఏడుగురు వ్యక్తులు చనిపోయినట్లు తెలుస్తోందని యుక్రెయిన్ పోలీసులు చెప్తున్నారు.

    ఒడెస్సా నగరం వెలుపల పోడిల్స్క్‌లోని ఒక సైనిక విభాగంపై జరిగిన దాడిలో ఆరుగురు చనిపోగా, మరో ఏడుగురుగాయపడ్డారని అధికారులు చెప్పారు.

    ఇంకో 19 మంది ఆచూకీ తెలియటం లేదు.

    మరియుపోల్ నగరంలో ఒక వ్యక్తి చనిపోయినట్లు వారు తెలిపారు.

  14. యుక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థను అణచివేశాం: రష్యా

    రష్యా వైమానిక దాడిని తాము తిప్పికొడుతున్నామని యుక్రెయిన్ సైన్యం ఒక ప్రకటనలో చెప్పినట్లు మేం ఇంతకుముందు కథనం ఇచ్చాం.

    అయితే.. ‘‘యుక్రెయిన్ సాయుధ బలగాల వైమానిక రక్షణ వ్యవస్థను అణచివేశామ’’ని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు రష్యా ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ చెప్తోంది.

    ‘‘రష్యా బలగాలను యుక్రెయిన్ సరిహద్దు బలగాలు ప్రతిఘటించలేదు’’ అని కూడా రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.

    ఈ వాదనలపై స్వతంత్ర నిర్ధారణ ఏదీ జరగలేదు.

  15. రష్యా చర్యను ఖండించిన యూరప్ దేశాలు

    రష్యా చర్యను ఖండించటంలో యూరప్ దేశాలు వేగంగా స్పందించాయి.

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ ష్కోల్జ్ మాట్లాడారని, ఆయనకు సంఘీభావం తెలిపారని జర్మన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.

    ‘‘యూరప్‌లో ఇక చరిత్ర పుస్తకాల్లో మాత్రమే చూస్తామని మనం అనుకున్న భూతల యుద్ధం ఇప్పుడు జరుగుతోంది. ఇది అంతర్జాతీయ చట్టాన్ని దుర్మార్గంగా అతిక్రమించటమే’’ అని జర్మనీ ఆర్థికమంత్రి రాబర్ట్ హాబెక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

    రష్యా చర్య అన్యాయమని, సమర్ధించుకోజాలనిదని ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ అభివర్ణించారు.

    ‘‘తక్షణమే సమైక్యంగా, నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించేందుకు మేం యూరోపియన్, నాటో మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తున్నాం’’ అని చెప్పారాయన.

    నాటో తూర్పు బలగాలను బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పోలండ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి పియోటర్ ముల్లర్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు చేపడతారని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

  16. సరిహద్దు దాటిన రష్యా సైనిక బలగాలు: యుక్రెయిన్ బోర్డర్ గార్డ్

    రష్యా సైనిక బలగాలు ఉత్తరాన చెర్నిహివ్, సుమీ ప్రాంతాల నుంచి.. తూర్పున లుహాన్క్, ఖార్కీవ్ ప్రాంతాల నుంచి సరిహద్దులు దాటి యుక్రెయిన్‌లోకి ప్రవేశించాయని యుక్రెయిన్ సరిహద్దు గస్తీ విభాగం తెలిపింది.

    రష్యా దాడికి ముందు కాల్పులు జరిగాయని చెప్పింది.

    యుక్రెయిన్ బోర్డర్ గార్డుల్లో కొందరు గాయపడ్డట్లు వెల్లడించింది.

    ‘‘శత్రువును నిలువరించటానికి యుక్రెయిన్ బోర్డర్ గార్డ్స్, సైనిక బలగాలు అన్ని చర్యలూ చేపడుతున్నాయి’’ అని పేర్కొంది.

  17. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో దృశ్యాలు...

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ మీద సైనిక చర్యను ప్రకటించి కేవలం రెండు గంటలే అయింది.

    యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో చాలా మంది ప్రజలు తలదాచుకోవటానికి భూగర్భ మెట్రో స్టేషన్లకు పరుగులుతీశారు.

    ఇంకొందరు నగరం వదిలి వెళ్లటానికి బస్సులెక్కారు. నగరం వీడి వెళ్లటానికి ప్రయత్నిస్తున్న కార్లతో ప్రధాన మార్గాలు నిండిపోయాయి.

  18. రష్యా యుద్ధ విమానాలను కూల్చివేశాం: యుక్రెయిన్ సైన్యం

    రష్యా యుద్ధ విమానాలు ఐదింటితో పాటు ఒక హెలికాప్టర్‌ను కూడా తాము కూల్చివేశామని యుక్రెయిన్ సైనిక బలగాలు చెప్తున్నాయి.

    ‘‘శాంతంగా ఉండండి.. యుక్రెయిన్ రక్షకులను నమ్మండి’’ అని యుక్రెయిన్ సైనిక బలగాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

    తమ విమానాలను కూల్చివేశారన్న వాదనలను రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తిరస్కరించింది.

  19. ‘‘జనం షాక్‌లో ఉన్నారు.. నమ్మలేకపోతున్నారు’’

    యుక్రెయిన్‌లోని డన్బాస్ ప్రాంతంలో క్రమటోర్స్క్ నగరం నుంచి బీబీసీ తూర్పు యూరప్ ప్రతినిధి సారా రీన్స్‌ఫోర్డ్ ప్రత్యక్ష కథనం అందిస్తూ.. ‘‘ఏం జరగబోతోందో ఊహిస్తూ జనం భీతావహులైపోయారు. దిగ్భ్రాంతికి లోనయ్యారు’’ అని చెప్పారు.

    ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలావుందో ఏమాత్రం తెలియటం లేదన్నారు.

    ‘‘ఈ నగరంలో గత రాత్రి జనం వీధుల్లోకి వచ్చారు. యుక్రెయిన్ జాతీయపతాకాన్ని ప్రదర్శించారు. ఇది తమ భూమి అని వారు చెప్పారు. తాము ఎక్కడికి వెళ్లబోమన్నారు...’’ అని ఆమె వివరించారు.

    ‘‘ఇలా జరుగుతుందని జనం చాలా కాలంగా భావిస్తున్నారు. దీని కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇది నిజంగా జరుగుతోందని ఇక్కడ ఎవరూ నమ్మలేకపోతున్నారు’’ అని చెప్పారామె.

  20. కీవ్ వదిలి పారిపోతున్న జనం

    రష్యా కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5.55 గంటలకు వ్లాదిమిర్ పుతిన్.. యుక్రెయిన్ మీద సైనిక చర్యను ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే యుక్రెయిన్ మీదకు తొలి షెల్లింగ్, క్షిపణుల దాడులను ప్రారంభించినట్లు వార్తలు చెప్తున్నాయి.

    యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో అత్యవసర సైరన్ మోగింది. జనం నగరం వదిలి పారిపోవటానికి ప్రయత్నిస్తుండటంతో ఎక్స్‌ప్రెస్‌వే మీద కార్ల ప్రవాహంతో తీవ్ర రద్దీ నెలకొన్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది.

    ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు చెప్తున్నాయి. తమను బాంబు షెల్టర్లు, భూగర్భగృహాల్లోకి హడావుడిగా తరలిస్తున్నారని కొందరు పోస్ట్ చేస్తున్నారు.

    వీధుల్లో జనం గుంపులుగా చేరి ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలను టెలివిజన్ ప్రసారాలు చూపుతున్నాయి.

    రోడ్ల మీద జనం చాలా తక్కువగా ఉన్నారని, నగదు మెషీన్ల దగ్గర జనం బారులు తీరుతున్నారని కీవ్‌లో గార్డియన్ విలేకరి ల్యూక్ హార్డింగ్ ఒక ట్విటర్ పోస్టులో పేర్కొన్నారు.