ఫలితాలు
తారుమారు చేయగలిగిన కీలకమైన రాష్ట్రాల్లో ఇంకా చాలా ఓట్లు
లెక్కించాల్సి ఉన్నా, అమెరికా ఎన్నికల్లో తాను
ఇప్పటికే విజయం సాధించానని ట్రంప్ ప్రకటించారు.
"మేం ఈ ఎన్నికల్లో గెలవడానికి
సిద్ధమవుతున్నాం. నిజం చెప్పాలంటే, మేం ఈ ఎన్నికల్లో
గెలిచాం" అని ఆయన వైట్ హౌస్ నుంచి ఇచ్చిన ప్రసంగంలో అన్నారు.
హోరాహోరీ పోటీ
ఉన్న రాష్ట్రాల్లో జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ ఫలితాలు ఇంకా
వెల్లడి కాలేదు. భారీ సంఖ్యలో ఓట్లు, ముఖ్యంగా డెమాక్రాట్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్న
పట్టణ పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది.
ముఖ్యంగా పెన్సిల్వేనియాలో
పోటీ తీవ్రంగా ఉంది. పోలింగ్ భారీగా
జరగడం, పోస్టల్ బ్యాలెట్లు పోటెత్తడంతో కౌంటింగ్ రోజులపాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
"ముఖ్యంగా, మనం పెన్సిల్వేనియాలోతిరుగులేని ఆధిక్యంతో గెలుస్తున్నాం, మనకు
పెన్సిల్వేనియా ప్రాంతాల్లో బాగా వస్తున్నాయి. అక్కడి వారు మీ అధ్యక్షుడిని
ఇష్టపడ్డారు" అని ట్రంప్ అన్నారు.
ప్రస్తుతం అక్కడ 74 శాతం ఓట్లు లెక్కించగా, 55.7 శాతం
ఓట్లతో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. జో బైడెన్‌కు 43 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, రాష్ట్రంలోని అతిపెద్ద
నగరం ఫిలడెల్ఫియాలో 48 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అది ఎక్కువగా జో బైడెన్‌వైపు
మొగ్గు చూపుతోంది.
మిడ్‌వెస్ట్రన్ స్టేట్స్ మిచిగాన్, విస్కాన్సిన్‌లో
కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ నువ్వా-నేనా అనేలా పోటీ కొనసాగుతోంది.
"మేం
మిచిగాన్‌లో గెలుస్తున్నాం. అక్కడ 65శాతం ఓట్లు పడ్డాయి. మేం విస్కాన్సిన్‌లో కూడా
గెలుస్తున్నాం"
అని ట్రంప్ అన్నారు.
కానీ, మిచిగాన్‌లో అతిపెద్ద నగరం డెట్రాయిట్‌లో ఇంకా
చాలా ఓట్లు లెక్కించాల్సి ఉంది. విస్కాన్సిన్‌లో డెమాక్రాట్ల పట్టున్న మిల్వాకీలో సగానికంటే తక్కువ ఓటింగ్
జరిగింది.
జార్జియా సంగతేంటి, అక్కడ ఇంకా పోటాపోటీగా ఉందా?
"జార్జియాలో
కూడా మనమే గెలిచినట్లు స్పష్టంగా తెలుస్తోందని" ట్రంప్ అన్నారు. అయితే, అక్కడ 90 శాతం పైగా ఓట్లు
లెక్కించినప్పటికీ, ఎవరు గెలుస్తారో ఇంకా తెలీని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో
అతిపెద్ద నగరం అట్లాంటాలో ఇంకా గణనీయమైన సంఖ్యలో ఓట్లను లెక్కించాల్సి ఉంది.