భారత్‌లో 60వేలకు చేరువలో పాజిటివ్ కేసులు, 2వేలకు దగ్గరలో మరణాలు; ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది బాధితులు

భారత్‌లో కరోనావైరస్ కేసులు 60వేలకు చేరువలో ఉన్నాయి. మరణాల సంఖ్య 2వేలను సమీపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 40 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ 2.75 లక్షల మంది మరణించారు. అమెరికాలో 13 లక్షలకు చేరువలో బాధితుల సంఖ్య ఉంది. ఈ ఒక్క దేశంలోనే 77వేలకుపైగా రోగులు మరణించారు.

లైవ్ కవరేజీ

  1. కొలంబియాలో వింత నిబంధనలకు బ్రేక్

    కొలంబియా ఆంక్షలు

    ఫొటో సోర్స్, Getty Images

    కొలంబియా రాజధాని బగోటాలో పురుషులు, మహిళలు వేరు వేరు రోజుల్లో కొనుగోళ్లు చేయాలంటూ విధించిన నిబంధనలను నగర మేయర్ తొలగించారు.

    నెల రోజుల నుంచి నగరంలో ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. మంగళవారం నుంచి దానిని తొలగిస్తున్నట్లు మేయర్ చెప్పారు.

    లాటిన్ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నిబంధనలే అమల్లో ఉన్నాయి. ఎల్జీబీటీ, ట్రాన్స్ జెండర్ సమాజాల నుంచి వీటిపై వ్యతిరేకత వస్తోంది.

  2. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 2.76 లక్షలు

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ధ్రువీకరించిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,37,813కు పెరిగింది.

    మొత్తం మృతుల సంఖ్య 2,76,863కు చేరింది.

  3. భద్రతామండలి ప్రతిపాదనను అడ్డుకున్న అమెరికా

    కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ప్రపంచ స్థాయిలో కాల్పుల విరమణను అమలు చేయాలనే ప్రతిపాదనపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అమెరికా నుంచి వీటో ఎదుర్కోవాల్సి వచ్చింది.

    ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ కాల్పుల విరమణకు అపీల్ చేశారు.

    ఆరు వారాలపాటు ఈ ప్రతిపాదనపై చర్చలు కూడా జరిగాయి. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావన ఉండకూడదని అమెరికా కోరింది.

    అమెరికా షరతుల ప్రకారం దానికి మార్పులు కూడా చేశారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందనే భావించారు.

    అంత చేసినా, ఈ ప్రతిపాదన తమకు అంగీకారం కాదని అమెరికా శుక్రవారం సంకేతాలు ఇచ్చింది. అది ఆమోదం పొందకుండా అడ్డుకుంది.

  4. జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్

    జర్మనీ లాక్‌డౌన్

    ఫొటో సోర్స్, Getty Images

    జర్మనీలోని ఉత్తర రయిన్-వెస్ట్ ఫాలియా ప్రాంతంలో కరోనా కేసులు పెరగడంతో అక్కడ మళ్ల లాక్‌డౌన్ అమలుకు సిద్ధమయ్యారు.

    కోజ్‌ఫీల్డ్ జిల్లాలోని ఒక కబేళాలో పనిచేసే 1200 మంది కార్మికుల్లో 150 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

    దాంతో అధికారులు ఆంక్షలు సడలించాలనే నిర్ణయం వాయిదా వేశారు.

    మొదట్లో రెస్టారెంట్లు, జిమ్, పర్యటన ప్రాంతాలు, పెద్ద షాపులను మే 11 నుంచి తెరుస్తామని చెప్పారు.

  5. ఈరోజూ కొనసాగనున్న వందే భారత్ మిషన్

    వందే భారత్ మిషన్‌లో భాగంగా ఈరోజు మరికొన్ని విమానాలు విదేశాల్లోని భారతీయులను తీసుకుని స్వదేశానికి చేరుకోనున్నాయి.

    ఈరోజు రానున్న విమానాలు

    • ఢాకా- దిల్లీ
    • కువైట్-హైదరాబాద్‌
    • మస్కట్- కొచ్చిన్
    • షార్జా-లక్నో
    • కువైట్-కొచ్చిన్
    • కౌలాలంపూర్‌- తిరుచ్చి
    • లండన్- ముంబై
    • దోహా- కొచ్చిన్
    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. కువైట్‌లో 7 వేలు దాటిన కరోనా కేసులు, 20 రోజుల లాక్‌డౌన్

    కువైట్ కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    కువైట్‌లో 20 రోజులు లాక్‌డౌన్ విధించారని రాయిటర్స్ చెప్పింది.

    కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం దేశవ్యాప్తంగా దీనిని అమలు చేశారని తెలిపింది.

    ఆదివారం నుంచి దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తారు.

    కువైట్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    శుక్రవారం ఒక్క రోజే దేశంలో 641 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    కోవిడ్-19 వల్ల కువైట్‌లో ఇప్పటివరకూ 47 మంది చనిపోయారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంక్య 7 వేలకు చేరింది.

    దేశంలో ఫిబ్రవరి 24న మొదటి కరోనా కేసు నమోదైంది.

  7. హెర్బల్ డ్రింక్ కరోనాను నయం చేస్తుంది-మడగాస్కర్ అధ్యక్షుడు

    టాంజానియా అధ్యక్షుడు

    హెర్బల్ డ్రింక్‌తో కరోనా నయం అవుతుందని మడగాస్కర్ అధ్యక్షుడు చెబుతున్నారు. కానీ ఆయన వాదనలను డబ్ల్యుహెచ్ఓ కొట్టిపారేసింది.

    టాంజానియాకు మడగాస్కర్ నుంచి హెర్బల్ టానిక్ స్టాక్‌ను పంపించారు.

    ఈ హెర్బల్ డ్రింక్ తాగితే కరోనా వైరస్ నయం అవుతుందని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయిలినా చెబుతున్నారు.

    అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాంటి వాదనలను కొట్టిపారేస్తోంది.

    శాస్త్రీయంగా పరీక్షించే ముందు దీని ఉపయోగించడంపై హెచ్చరికలు కూడా జారీ చేశారు.

  8. కరోనావైరస్: సిరియాలో సవాళ్లు

    సిరియా కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    ఈ ఫొటోను సిరియాలో తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ప్రాంతంలో తీశారు.

    ఇక్కడ ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసమవడంతో, పరిశుభ్రత పాటించడం చాలా కష్టం. ఇప్పుడు కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడం వారికి పెను సవాలుగా మారింది.

    ఈ ఫొటోల్లో పిల్లలు, పెద్దలు ఇఫ్తార్ విందులో వరుసగా కూర్చుని ఉండడం మనం చూడచ్చు.

    ప్రతి ఏటా రంజాన్ మాసంలో లక్షలమంది ముస్లింలు 30 రోజులు రోజా ఉండి, సాయంత్రం ఇఫ్తార్ చేస్తారు.

    సిరియాలో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఏప్రిల్ నెలలో కొన్ని నిబంధనలు అమలు చేశారు.

    కానీ యుద్ధం వల్ల చాలా ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జనం సామాజిక దూరం పాటించడం కూడా ఒక పెద్ద సవాలుగా మారింది.

    సిరియా కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    ఈ ఫొటో అలెప్పో పశ్చిమ ప్రాంతం అతరేబ్‌లో తీసింది. ఇక్కడ కొంతమంది ఇఫ్తార్ కోసం కూచుని ఉన్నారు.

    వీరంతా కూచోడానికి ముందు ఆ ప్రాంతాన్ని సివిల్ డిఫెన్స్ కార్మికులు క్రిమిరహితం చేశారని, శుభ్రం చేశారని ఈ విందు ఏర్పాటు చేసిన సంస్థ చెప్పింది.

    శుక్రవారం ప్రభుత్వం అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 64కు చేరిందని రాయిటర్స్ తెలిపింది.

    తిరుగుబాటుదారుల ఆక్రమణలో ఉన్న నైరుతి సిరియాలో ఇప్పటివరకూ కరోనా కేసులు ఏవీ ధ్రువీకరించలేదు. అక్కడ ఉన్న 40 లక్షల మందిలో కొన్ని వందల మందికి మాత్రమే టెస్టులు చేయడం దానికి కారణం కావచ్చని చెబుతున్నారు.

  9. అమెరికా ఉపాధ్యక్షుడి సహాయకురాలికి కరోనా పాజిటివ్

    మైక్ పెన్స్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహాయకుల్లో ఒకరికి పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

    ఒక రోజు ముందు వైట్‌హౌస్‌ సిబ్బందిలో కూడా మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

    మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిలర్‌కు కరోనా ఉన్నట్టు శుక్రవారం జరిగిన పరీక్షల్లో తేలింది.

    వైట్‌హౌస్‌లో ఇప్పుడు రోజూ మైక్ పెన్స్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు టెస్టులు చేయడం ప్రారంభించారు.

    అధ్యక్షుడి భద్రత కోసం అవసరమైన చర్యలు పాటిస్తున్నామని వైట్‌హౌస్ చెబుతోంది.

  10. కరోనా మప్పు ఉన్నా, కొన్ని ముస్లిం దేశాల్లో తెరుచుకున్న మసీదులు

    మసీదులు తెరిచారు

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా వ్యాప్తితో ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు మసీదులను కొన్ని వారాల క్రితమే మూసివేశాయి.

    కానీ రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం నమాజు కోసం కొన్ని దేశాలు వాటిని మళ్లీ తెరిచాయి.

    సిరియా ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో కొన్ని మసీదులు తెరిచారు. అయితే ఈ మసీదులను క్రిమిరహితం చేసిన తర్వాతే తెరిచారు. ప్రార్థనలకు వచ్చేవారు మాస్క్ కూడా వేసుకున్నారు. సామాజిక దూరం కూడా పాటించారు.

    ఇరాన్‌లో 180 నగరాలు, పట్టణాల్లో కూడా జనం మసీదుల్లో గుమిగూడారు. కానీ టెహ్రాన్‌లో మసీదులు ఇప్పటికీ పూర్తిగా మూసివేసి ఉన్నారు. ఇక్కడ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

    గురువారం బంగ్లాదేశ్‌లో మసీదులను మళ్లీ తెరవడానికి అనుమతించారు. కానీ సోషల్ డిస్టన్సింగ్ పాటించాలని ఆదేశించారు.

    కానీ దక్షిణ సూడాన్, అల్జీరియా, ట్యునీషియా, మొరాకోలో రంజాన్ నెలలో ముస్లింలు ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేయాలని చెప్పారు.

  11. కరోనా లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం. ముఖ్యాంశాలు

    కరోనా అప్ డేట్స్

    ఫొటో సోర్స్, Getty Images

    పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి.

    • జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 2.75 లక్షలకు చేరువ అయ్యింది.
    • అమెరికాలో అత్యధికంగా 12,83,846 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మృతుల సంఖ్య 77 వేలు దాటింది.
    • బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 2,12,629కు చేరింది. మృతుల సంఖ్య 31 వేలు దాటింది.
    • స్పెయిన్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 2,22,857క చేరాయి. ఇక్కడ 26,299 మంది చనిపోయారు.
    • ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 30 వేలు దాటింది. దేశంలో మొత్తం కేసులు 2.17 లక్షలకు పైనే ఉన్నాయి.
    • అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రష్యా ఐదో స్థానానికి చేరింది. ఇక్కడ కేసులు 1.87 లక్షలకు పైనే ఉన్నాయి.
    • కువైట్‌లో కరోనా కేసుల సంఖ్య 7 వేలు దాటింది. దేశంలో 20 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు.
    • సిరియాలో ప్రజలు కఠిన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. దేశంలో సోషల్ డిస్టన్సింగ్, పరిశుభ్రత సవాలుగా మారింది.
    • భారత్‌లో కరోనా కేసులు 56,342కు చేరాయి. మొత్తం 1886 మంది చనిపోయారు.
    • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 1887కు చేరగా, తెలంగాణలో కొత్తగా 10 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1132కు పెరిగింది.