కరోనావైరస్: ఇతర రోగులంతా ఏమయ్యారు? ఆస్పత్రులు ఎలా నడుస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక వైద్యులపై అందరికీ అపార అభిమానం పెరిగింది.
ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నవారిని వీరులుగా పోలుస్తూ అందరూ ప్రశంసించారు. ఇదంతా ఒకవైపు. అదే కరోనావైరస్ తెచ్చిన లాక్ డౌన్ ఇప్పుడు వైద్య రంగం, ఆసుపత్రులు, వైద్యులను పెద్ద ఇబ్బందుల్లోకి లాగేసింది. వైద్య రంగాన్ని కుదిపేసింది.
లాక్ డౌన్ వల్ల ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య బాగా పడిపోయింది. ఆయా ఆసుపత్రులు ఉన్న చోటు, స్థాయిని బట్టి 10 శాతం నుంచి 40 శాతం మంది పేషెంట్లే వస్తున్నారు. కేవలం ఎమర్జెన్సీలు, సెమీ-ఎమర్జెన్సీలకు మాత్రమే చికిత్స జరుగుతోంది. దీంతో ఆసుపత్రుల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి.
చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని నడుస్తున్నాయి, మరికొన్ని తాత్కాలికంగా మూతవేశారు. చిన్న చిన్న క్లినిక్‌ల పరిస్థితి కూడా అంతే. దీంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం పడింది.







