You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో మొత్తం కేసులు 42,836.. మృతులు 1,389 మంది; ఏపీలో 1,650.. తెలంగాణలో 1,085 మంది బాధితులు

భారతదేశంలో మొత్తం కరోనాకేసుల సంఖ్య 42,836కు, మృతుల సంఖ్య 1389కు పెరిగింది. ప్రస్తుతం 29,685 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ 11,761 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 67 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈరోజు 3 కొత్త కేసులు నమోదయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. కరోనావైరస్: ఇతర రోగులంతా ఏమయ్యారు? ఆస్పత్రులు ఎలా నడుస్తున్నాయి?

    కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక వైద్యులపై అందరికీ అపార అభిమానం పెరిగింది.

    ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నవారిని వీరులుగా పోలుస్తూ అందరూ ప్రశంసించారు. ఇదంతా ఒకవైపు. అదే కరోనావైరస్ తెచ్చిన లాక్ డౌన్ ఇప్పుడు వైద్య రంగం, ఆసుపత్రులు, వైద్యులను పెద్ద ఇబ్బందుల్లోకి లాగేసింది. వైద్య రంగాన్ని కుదిపేసింది.

    లాక్ డౌన్ వల్ల ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య బాగా పడిపోయింది. ఆయా ఆసుపత్రులు ఉన్న చోటు, స్థాయిని బట్టి 10 శాతం నుంచి 40 శాతం మంది పేషెంట్లే వస్తున్నారు. కేవలం ఎమర్జెన్సీలు, సెమీ-ఎమర్జెన్సీలకు మాత్రమే చికిత్స జరుగుతోంది. దీంతో ఆసుపత్రుల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి.

    చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని నడుస్తున్నాయి, మరికొన్ని తాత్కాలికంగా మూతవేశారు. చిన్న చిన్న క్లినిక్‌ల పరిస్థితి కూడా అంతే. దీంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం పడింది.

  2. కరోనా ముప్పు నుంచి బయటపడుతున్న న్యూజీలాండ్

    న్యూజీలాండ్‌లో మొదటిసారి 24 గంటల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

    వెల్లింగ్టన్‌లో ఒక సదస్సులో మాట్లాడిన దేశ హెల్త్ డైరెక్టర్ యాష్లే బ్లూంఫీల్డ్ దీనిని 'సానుకూలం'గా చెప్పారు.

    న్యూజీలాండ్‌లో మొత్తం 1487 కోవిడ్-19 కేసులు బయటపడ్డాయి. వారిలో 86 శాతం మంది పూర్తిగా కోలుకున్నారు.

    ఇక్కడ ఇప్పటివరకూ 20 మంది చనిపోయారు. ఏడుగురు ఆస్పత్రుల్లో ఉన్నారు.

    సోమవారం దేశంలో కరోనా వల్ల కొత్తగా ఎవరూ చనిపోలేదు.

    మొదటి నుంచి కఠిన చర్యలు పాటించి, లాక్‌డౌన్ అమలు చేసిన న్యూజీలాండ్ ప్రధాని జసిండాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి.

    గత సోమవారం నుంచి ఇక్కడ లాక్‌డౌన్‌ను కాస్త సడలించారు.

  3. ఏడాది చివరికల్లా కరోనా టీకా తయారు చేస్తాం-ట్రంప్

    ఈ ఏడాది చివరికల్లా కరోనా వైరస్ టీకా తయారవుతుందని తనకు నమ్మకం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

    ఫాక్స్ న్యూస్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మాట చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు కూడా ఇచ్చారు.

    కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ "ఈ ఏడాది చివరికల్లా మనకు దీని టీకా లభిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది" అన్నారు.

    ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్కూళ్లు తెరుస్తారా? అనే ప్రశ్నకు ట్రంప్ “నాకు కొంతమంది వయసు పైబడిన టీచర్ల గురించి ఆందోళనగా ఉంది. వారికి కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ స్కూళ్లను తెరిచి తీరాల్సిందే” అన్నారు.

    కరోనా గురించి మాట్లాడుతూ ట్రంప్ డెమోక్రటిక్ నేతలను విమర్శించారు. "ఈ వైరస్ వల్ల పరిస్థితులు ఘోరంగా మారితే, వారికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది" అని అన్నారు.

    ఇంటర్వ్యూ సమయంలో ఆయన హైడ్రాక్సిక్లోరోక్వీన్ గురించి కూడా మాట్లాడారు. ఆ మందు తయారు చేసే కంపెనీల్లో తనకు షేర్ లేదన్నారు. “దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు... దీనివల్ల కనీసం జనం చనిపోకుండా ఉంటారు” అన్నారు.

    మీరు వైరస్‌ను అడ్డుకోడానికి ముందే కఠిన ఎందుకు చర్యలు తీసుకోలేదని అధ్యక్షుడిని శ్నించారు.

    సమాధానంగా “జనవరి 23న దేశంలో వైరస్ వ్యాపించవచ్చు అని నిఘా వర్గాలు నాకు చెప్పాయి. కానీ ఆ సమయంలో అది అంత తీవ్రంగా లేదు” అన్నారు. చైనా నుంచి వచ్చే విమానాలను తాము మొదటే ఆపివేశామని ట్రంప్ చెప్పారు.

  4. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లో భారీగా తగ్గిన మృతుల సంఖ్య

    గత 24 గంటల్లో ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లో చాలా వారాల తర్వాత తక్కువ మరణాలు నమోదైనట్లు వస్తున్నాయి.

    ఫ్రాన్సులో 135, స్పెయిన్‌లో 164, ఇటలీలో 174 మంది చనిపోయారు.

    కరోనా రోగుల కొత్త శాంపిళ్ల ఆధారంగా ఫ్రాన్సుకు కరోనావైరస్ గత ఏడాదే చేరుకున్నట్లు తెలుస్తోందని ఆ దేశంలోని వైద్యులు చెబుతున్నారు.

    డిసెంబర్ 27న కరోనావైరస్ వ్యాప్తి గుర్తించినట్లు ప్యారిస్‌లో ఒక డాక్టర్ చెప్పారు.

    ఆ తర్వాత చాలా వారాలకు ఫ్రాన్సులో కరోనా వ్యాపించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.

    ఫ్రాన్సులో ఒకే రోజు 135 మంది చనిపోయారు, మార్చి తర్వాత ఒక రోజులో నమోదైన మరణాల్లో ఇది అతి తక్కువ.

    ఫ్రాన్స్ లో మే 11న లాక్‌డౌన్ తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పిల్లలు స్కూలుకు వెళ్లవచ్చు. కొన్ని పరిశ్రమలు కూడా తెరుస్తారు. ఎలాంటి పత్రాల అవసరం లేకుండా 100 కిలోమీటర్ల వరకూ వెళ్లవచ్చు.

    ఇది చాలా వరకూ కొత్త కేసులు ఎంత తగ్గాయి అనేదానిపై ఆధారపడుందని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి అన్నారు.

    ఫ్రాన్సులో ఇప్పుడు ఈయూ, బ్రిటన్ నుంచి వచ్చేవారిని రెండు వారాల వరకూ క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం లేదు.

    స్పెయిన్‌లో వృద్ధులకు స్వేచ్ఛ

    స్పెయిన్‌లో గత 24 గంటల్లో 164 మంది చనిపోయారు. ఇది గత నెలన్నరలో అతి తక్కువ. ఏడు వారాల తర్వాత శనివారం వృద్ధులకు బయటకు వెళ్లడానికి స్వేచ్ఛ లభించింది.

    సోమవారం నుంచి ప్రజలు ప్రజా రవాణా వాహనాల్లో మాస్కులు ధరించి ప్రయాణించవచ్చు. కొన్ని పరిశ్రమలు తెరుస్తారు.

    ఇటలీలో లాక్‌డౌన్ సడలింపు

    ఇటలీలో కూడా రెండు నెలల్లో అతి తక్కువ మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 174 మంది చనిపోయారు.

    ఇక్కడ కూడా సోమవారం నుంచి లాక్‌డౌన్ సడలించారు. అయితే స్కూళ్లు, సినిమా హాళ్లు, మాల్స్ మూసి ఉంచుతారు.

    ఇటలీలో ఇప్పటివరకూ 28884 మంది మృతిచెందారు. అమెరికా తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకూ దాదాపు 68 వేల మంది మరణించారు.

  5. కరోనావైరస్: ఏపీ సచివాలయం ఉద్యోగులకు సూచనలు

    కరోనా సమయంలో విధులకు హాజరుకావాల్సిన ఆంధ్రప్రదేశ్ సచివాలయం సిబ్బందికి మినహాయింపులు, జాగ్రత్తలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నీలం సాహ్ని ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.

    • సచివాలయంలో విధులకు హాజరయ్యే ఉద్యోగులు కోవిడ్-19 వైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, సామాజిక దూరం పాటించాలి.
    • అసిస్టెంట్ సెక్రటరీ స్థాయికి పై అధికారులందరూ విధులకు హాజరు కావాలి. ఒక్కో విభాగంలో పనిచేసే సిబ్బందిలో 33 శాతం మంది కార్యాలయానికి హాజరు కావాలి. సంబంధిత విభాగాల సెక్రటరీలు దీనికి సంబంధించి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తారు.
    • అనారోగ్యంతో ఉన్నవారికి, మధుమేహం లేదా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, శ్వాసకోస వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, కీమో థెరపీ చేయించుకుంటున్నవారు, ఏవైనా రోగ నిరోధక మందులు వాడుతున్నవారికి విధులకు హాజరు కాకుండా మినహాయింపు ఇచ్చారు.
    • ఆఫీసుకు వచ్చేటపుడు, లోపల ఉద్యోగులందరూ మాస్కు వేసుకోవాలి. హాండ్ శానిటైజర్ వాడాలి. అన్ని విభాగాల్లో అవి ఉండేలా చూడాలి. కార్యాలయాల్లో సిబ్బంది కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.
    • జ్వరం లాంటి లక్షణాలు ఉన్నవారిని భవనంలోకి అనుమతించరు. సమావేశాలు రద్దు చేశారు. ఏవైనా సమావేశాలు నిర్వహిస్తే హాజరుఅయ్యేవారు కచ్చితంగా 3 మీటర్ల దూరం పాటించాలి.
    • రోజూ విధులు ముగిసిన తర్వాత కార్యాలయాల్లో మొత్తం విభాగాన్ని శానిటైజ్ చేయాలని ఆదేశించారు.
  6. ఫ్రాన్సులో 'స్టాప్ కోవిడ్' పేరుతో మొబైల్ యాప్ సిద్ధం

    ఫ్రాన్సులో మే 11 నుంచి 'స్టాప్ కోవిడ్' పేరుతో యాప్ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ యాప్ సాయంతో కరోనా లేని వారిని సంప్రదించవచ్చు, ఎవరికైనా కరోనా ఉందా, లేదా అనేది గుర్తించవచ్చు.

    ఈ యాప్ కోవిడ్-19ను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఫ్రాన్స్ డిజిటల్ అఫైర్స్ మంత్రి అన్నారు.

    “ఫ్రాన్సులో ప్రస్తుతం భారీస్థాయిలో జనాలకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఈ యాప్ మంత్రదండం కాదు, కానీ దానివల్ల కాస్త ప్రయోజనం లభిస్తుంది” మంత్రి అన్నారు.

  7. కరోనా పరీక్షలను తిరస్కరించిన అమెరికా ఎంపీలు

    ప్రజా ప్రతినిధులకు 1000 ర్యాపిడ్ కోవిడ్-19 టెస్ట్ చేస్తామన్న ప్రభుత్వ ఆఫర్‌ను అమెరికా ఎంపీలు తిరస్కరించారు.

    అమెరికా పార్లమెంటులో దిగువ సభ అధ్యక్షురాలు నాన్సీ పెలోసీ, ఎగువ సభ సెనేట్ నేత రిపబ్లికన్ ఎంపీ మిచ్ మాక్‌నెల్ శనివారం దీనిపై ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

    "ఎంపీలు ప్రభుత్వ ప్రతిపాదనకు ధన్యవాదాలు చెబుతున్నారు. కానీ ఆ వనరులను అత్యంత అవసరమైన ప్రాంతాలకు పంపించాలని సభ కోరుతోంది" అన్నారు.

    అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక ట్వీట్‌లో "రాజకీయం చేయడానికే ప్రభుత్వ ప్రతిపాదనను ఎంపీలు తిరస్కరిస్తున్నారని, వేరే కారణాలేవీ లేవని అన్నారు.

    ఎగువ సభ సెషన్ సోమవార కూడా జరుగుతుంది. కానీ డాక్టర్ల సూచల మేరకు దిగువ సభ కార్యకలాపాలను రద్దు చేశారు.

  8. మరోసారి చైనాను టార్గెట్ చేసిన అమెరికా

    కరోనా వ్యాప్తికి కారణమంటూ అమెరికా విగేశాంగ మంత్రి మైక్ పాంపేయో మరోసారి చైనాను టార్గెట్ చేశారు.

    ఏబీసీ న్యూస్‌తో మాట్లాడిన ఆయన "ఆ దేశం(చైనా) దగ్గర మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని అడ్డుకునే అవకాశం వచ్చింది. కానీ అది ఆ సమాచారం దాచి, ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేసింది” అన్నారు.

    ట్రంప్ ప్రభుత్వం గత కొన్ని వారాలుగా చైనాపై మాటలయుద్ధం తీవ్రం చేసింది.

  9. ఇటలీలో 29 వేలకు చేరువైన మృతుల సంఖ్య

    ఇటలీలో ఆదివారం 174 మంది చనిపోయారు. మార్చిలో లాక్‌డౌన్ అమలు చేసిన తర్వాత ఇంత తక్కువగా మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి.

    ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ ఇటలీలో 28884 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,717కు చేరింది.

    గణాంకాల ప్రకారం కరోనా లక్షణాలు ఉన్న 17,242 మంది ఆస్పత్రుల్లో చేరారు. 1501 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా, 81,436 మంది తమ ఇళ్లలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు.

    ఇటలీలో మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ను కొద్దిగా సడలించారు. జనం తమ బంధువులను కలిసేందుకు అనుమతిస్తున్నారు. కానీ తక్కువ సంఖ్యలోనే కలవాలని షరతులు విధించారు.

    పార్కులు, పరిశ్రమలు, బిల్డింగ్ సైట్స్ మళ్లీ తెరిచారు. కానీ స్కూళ్లు సెప్టెంబర్ వరకూ తెరిచేది ఉండదని అధికారులు ప్రకటించారు.

  10. కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం, ఇప్పటివరకూ ముఖ్యాంశాలు

    • ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 35,04,129కి చేరింది. మృతుల సంఖ్య 2,47,326కు పెరిగింది.
    • అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 11,57,753కు పెరిగింది. దేశంలో మొత్తం 67,674 మంది చనిపోయారు.
    • స్పెయిన్‌లో కరోనా కేసులు 2,17,466కు చేరాయి. ఇక్కడ మొత్తం 25,264 మంది మృతిచెందారు.
    • భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 40,263 వేలకు చేరింది. కోవిడ్-19తో ఇప్పటివరకూ 1306 మంది చనిపోయారు.
    • దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కేసుల సంఖ్య 12296కు చేరింది. మొత్తం 521 మంది చనిపోయారు.
    • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 1583కు చేరింది. మొత్తం 33 మంది మరణించారు. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1063కు చేరగా, ఆదివారం ఇద్దరి మృతితో మొత్తం మృతుల సంఖ్య 28కి చేరింది.