సొంత రాష్ట్రాలకు చేరుకోవాలనే ప్రతి వలస కార్మికుడి రైలు ప్రయాణాలకు అయ్యే
ఖర్చును ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు భరించాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం
తీసుకుందని ఏఎన్ఐ తెలిపింది.
దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు
సోనియాగాంధీ నేతలకు సూచించారని చెప్పింది..
కష్ట సమయంలో భుజం భుజం కలిపి దేశ ప్రజలకు అండగా నిలుస్తామని సంఘీభావం ప్రకటించడానికి ఇది
కాంగ్రెస్ వినయపూర్వక సహకారం అని సోనియాగాంధీ చెప్పారు.
దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగంధీ ఒక ప్రకటన విడుదల
చేశారు. అందులో...
మన కార్మికులు, కూలీలు ఆర్థికవ్యవస్థకు వెన్నెముక లాంటి వారు. దేశ పునాదుల
కోసం వారు శ్రమిస్తున్నారు.
కేంద్రం లాక్‌డౌన్ అమలుచేసిన తర్వాత, వలస కార్మికులకు సొంత రాష్ట్రాలకు
వెళ్లేందుకు అవకాశం ఇచ్చేందుకు నిరాకరించింది.
1947లో దేశ విభజన తర్వాత వేలాది వలస కార్మికులు, కూలీలు తిండి, నీళ్లు,
మందులు, రవాణా సౌకర్యాలు లేకుండా వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన విషాధాన్ని
ఇప్పుడే చూస్తున్నాం.
లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు తిరిగి తమ సొంత రాష్ట్రాలకు చేరుకోడానికి
ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని కాంగ్రెస్ కేంద్రాన్ని కోరింది. కానీ
కేంద్రం, రైల్వే మంత్రిత్వ శాఖ మా డిమాండును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
అందుకే ప్రతి వలస కార్మికుడి ప్రయాణ ఖర్చులను ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు భరించాలనే నిర్ణయం తీసుకున్నాం. దానికి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. అని సోనియా ప్రకటనలో చెప్పారు.
వలస కార్మికుల దగ్గర చార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్రంగా విమర్శించారు.
"గుజరాత్‌లో ఒక కార్యక్రమం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినపుడు, రైల్వే
మంత్రిత్వ శాఖ 151 కోట్లు పీఎం కేర్ ఫండ్‌కు ఇచ్చినపుడు ఈ కూలీలను ఉచితంగా వారి
సొంత రాష్ట్రాలకు ఎందుకు చేర్చరు" అని ప్రశ్నించారు.
విదేశాల్లో ఉన్నవారిని ఉచితంగా దేశానికి తీసుకొస్తున్నప్పుడు, వలస కార్మికుల దగ్గర మాత్రం రైలు చార్జీలు
ఎందుకు వసూలు చేస్తున్నారు అన్నారు.