దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ ప్రభుత్వ
పరిధిలోని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాబోయే విద్యా
సంవత్సరానికి ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆయన వీసీలకు సూచించారు.
“యూనివర్సిటీలన్నీ
టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తద్వారా విద్యా సంవత్సరానికి
కలిగిన నష్టాన్ని కొంతవరకూ పూరించే ప్రయత్నం చేయాలి. మహమ్మారిపై పోరాటంలో సామాజిక దూరం
పాటించడం చాలా ముఖ్యమైన అంశం. ఈ నిబంధనలన్నీ దృష్టిలో ఉంచుకుని తరగతుల నిర్వహణకు
ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి” అని
కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా
పాల్గొన్నారు. కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాలు, ప్రస్తుత విద్యార్థుల ప్లేస్‌మెంట్లు,
దానిపై మహమ్మారి ప్రభావం వంటి అంశాలను వీరిద్దరూ వీసీలతో కలసి చర్చించారు.
వాయిదా పడిన పరీక్షల నిర్వహణ అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు
వచ్చింది. ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికై, పరీక్షలు వాయిదా పడిన విద్యార్థుల అంశం
కూడా వారు చర్చించారు.
“పరీక్షలు
రాసి, పాసై డిగ్రీ సర్టిఫికెట్ పొందకపోతే, అలాంటివారికి ఉద్యోగాల్లో చేరడానికి
ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి విద్యార్థులకు ప్రావిజనల్ డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చే
అంశాన్ని కూడా ఈ సమావేశం చర్చించింది” అని
ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
దిల్లీ ఆర్థిక పరిస్థితిని సాధారణ స్థితికి
తీసుకువచ్చేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా సిసోడియా ఆర్థిక శాస్త్ర
నిపుణులకు విజ్ఞప్తి చేశారు.