You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: భారత్‌లో గత 24 గంటల్లో 1,775 పాజిటివ్ కేసులు, 77 మరణాలు... మొత్తం కేసుల సంఖ్య 35,365
భారతదేశంలో 24 గంటల వ్యవధిలో 77 కోవిడ్ మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. గురువారం 67 మంది మృతి చెందారు. 1,775 కొత్త కేసులతో కలిపి దేశంలోని కరోనా బాధితుల సంఖ్య 35,365కు చేరింది. ఇప్పటివరకు, 9,064 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
లైవ్ కవరేజీ
కరోనావైరస్: ఈ రోజు ముఖ్యాంశాలు
ప్రపంచవ్యాప్తంగా 32,78,546 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 2,34,020 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
* అమెరికాలో 10,70,032 పాజిటివ్ కేసులు, 63,851 మరణాలు నమోదయ్యాయి.
* స్పెయిన్‌లో 2,13,435 పాజిటివ్ కేసులు, 24,543 మరణాలు నమోదయ్యాయి.
* ఇటలీలో 2,05,463 పాజిటివ్ కేసులు... 27,967 మరణాలు నమోదయ్యాయి.
* యూకేలో 1,72,481 పాజిటివ్ కేసులు.. 26,771 మరణాలు నమోదయ్యాయి.
* ఫ్రాన్స్‌లో 1,67,301 మంది కరోనా వైరస్ సోకగా 24,376 మంది ప్రాణాలు కోల్పోయారు.
* భారత్‌లో పాజిటివ్ కేసులు 35,365కి, మరణాలు 1,152కి పెరిగాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 1463కి చేరగా మృతుల సంఖ్య 33కి పెరిగింది.
* తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 1044 కాగా మృతుల సంఖ్య 28.
* భారత్‌లో లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను వారివారి రాష్ట్రాలకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశాం: జవహర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1,04,060 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.
ఏపీలో కరోనా కేసుల పాజిటివ్ రేటు 1.43శాతం ఉందని చెప్పారు.
1,463 కరోనా పాజిటివ్ కేసులున్నాయని 403 మంది డిశ్చార్జ్ చేశామని ప్రకటించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 27.55శాతం ఉందని పేర్కొన్నారు.
ఏపీలో ఇప్పటివరకు 9 ల్యాబ్‌లలో కరోనా టెస్టులు చేస్తున్నామని, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మరో రెండు ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చామని తెలిపారు.
శ్రీకాకుళం, ప్రకాశంలో ట్రయల్ టెస్టులు మొదలయ్యాయని, నెల్లూరులో ల్యాబ్ ఏర్పాటు పూర్తయిందని జవహర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, ఒక్కో ల్యాబ్‌లో 250 కరోనా పరీక్షలు చేయొచ్చని జవహర్‌రెడ్డి వివరించారు.
తెలంగాణలో కొత్తగా 6 కేసులు.. మొత్తం 1,044
తెలంగాణలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1044కి పెరిగింది.
తాజాగా 24 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జయినవారి సంఖ్య 464కి చేరింది.
ఇప్పటివరకు 28 మంది మరణించారు.
గ్రీన్‌జోన్‌లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు షరతులతో కూడిన అనుమతి
గ్రీన్ జోన్‌లో మద్యం దుకాణాలు, పాన్ షాప్‌లు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.
అయితే, వినియోగదారులు కనీసం 6 అడుగుల దూరం పాటించేలా చూసుకోవాలి.
అలాగే దుకాణం వద్ద అయిదుగురు కంటే ఎక్కువ మంది ఒకేసారి ఉండరాదని హోం మంత్రిత్వ శాఖ సూచించింది.
మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, అంతర్రాష్ట్ర రోడ్డు, రైలు, విమాన రవాణా.. విద్యాసంస్థలు, ఆతిధ్య రంగంపై నిషేధం కొనసాగుతుంది
కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడంతో దేశంలో మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పొడిగింపుతో మే 17 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది.
అయితే, వివిధ సేవలు, కార్యకలాపాలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
విమాన, రైలు, మెట్రో, రోడ్డు మార్గంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు జోన్లతో సంబంధం లేకుండా నిషేధం ఎప్పటిలా అమలవుతుంటుంది. స్కూళ్లు, కాలేజీ, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు... రెస్టారెంట్లు, హోటళ్లు తెరవడంపైనా నిషేధం కొనసాగుతుంది.
గత 21 రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని జిల్లాలు, ఇంతవరకు అసలు పాజిటివ్ కేసులే లేని జిల్లాలు గ్రీన్ జోన్లుగా పరిగణిస్తారు. కేసుల సంఖ్య, కేసులు రెట్టింపవుతున్న వేగం బట్టి రెడ్ జోన్లను నిర్ధరిస్తారు. గ్రీన్, రెడ్ జోన్లు కానివి ఆరెంజ్ జోన్లుగా పరిగణిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ ఈ జోన్ల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది.
కోవిడ్ వారియర్స్‌కు మద్దతుగా పూల వర్షం కురిపించనున్న ఎయిర్‌ఫోర్స్ విమానాలు, త్రివిధ దళాధిపతులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీడీఎస్ వెల్లడి
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతుల మీడియా సమావేశం ప్రారంభమైంది.
కోవిడ్19తో పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, హోంగార్డులు తదితరులు అందరికీ సాయుధ దళాల తరఫున ధన్యవాదాలు చెప్పారు.
‘‘ప్రపంచమంతా కరోనావైరస్‌తో పోరాడుతోంది.. మన దేశమూ దీని ప్రభావానికి లోనయింది. కలసికట్టుగా దీనిపై గెలుస్తామన్న నమ్మకం ఉంది’’ అన్నారు.
కోవిడ్ వారియర్స్‌కు సంఘీభావంగా మే 3న ఎయిర్‌ఫోర్స్ విమానాలు శ్రీనగర్ నుంచి తిరువనంతపురం.. అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు పూలు జల్లుతాయని చెప్పారు. మే 3న సాయంత్రం తీరాల్లో యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగులతో కనిపిస్తాయన్నారు. నేవీ హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలు జల్లుతాయన్నారు.
ఆర్మీ మౌంటెయిన్ బ్యాండ్ ప్రదర్శనలు ఇస్తుందని.. మే 3న పోలీస్ స్మారకాల వద్ద అంజలి ఘటిస్తుని చెప్పారు.
త్రివిధ దళాలపై కరోనావైరస్ ప్రభావం స్వల్పంగానే ఉందని ఇంతకుముందు జనరల్ రావత్ తెలిపారు.
దేశం కరోనా వైరస్‌తో పోరాడుతున్న వేళ సాయుధ దళాల సిబ్బంది తమకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి, ప్రజలకు మద్దతుగా నిలవడానికి వీలుగా వారు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆర్మీలో కరోనావైరస్ బారిన పడిన మొట్టమొదటి జవానుకు ఇప్పుడు పూర్తిగా నయమైందని.. ఆయన తిరిగి విధుల్లో చేరారని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ఎం.నరవానె తెలిపారు.
భారత్‌లో 35,365కి పెరిగిన పాజిటివ్ కేసులు.. 1,152 మరణాలు
భారత్‌లో కోవిడ్ కేసులు సంఖ్య 35,365కి పెరిగింది. మృతుల సంఖ్య 1,152కి పెరిగింది.
ఇప్పటివరకు 9,064 మందికి నయమై ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో 77 మరణాలు, 1755 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరిన వలస కార్మికుల తొలి రైలు
తెలంగాణలోని లింగంపల్లి స్టేషన్ నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది వలస కార్మికులతో 24 బోగీల ప్రత్యేక రైలు బయల్దేరింది. ఆ రైలులో బయలుదేరిన వారంతా ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్మాణ పనులు చేసే ఝార్ఖండ్ వాసులు.
ఝార్ఖండ్ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రైలును ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. దేశంలో వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో ఈ ఏర్పాటు చేశారు.
“వారంతా హైదరాబాద్ ఐఐటీ క్యాంపలో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు. అక్కడ దాదాపు 2,400 మంది ఉన్నారు. వారిలో 1,230 మంది ఝార్ఖండ్ వారు. నిన్న రాత్రి చాలా తక్కువ సమయంలో రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలులో వెళ్లేవారందరికీ క్యాంపులోనే స్క్రీనింగ్ చేశాం. తరువాత వారిని బస్సుల్లో స్టేషన్‌కు తరలించాం’’ అని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఈ మొత్తం ప్రక్రియను ఆయనే పర్యవేక్షించారు. ఈ కార్మికుల ప్రయాణ ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు ధ్రువీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలను బయటపెట్టడం లేదు: పశ్చిమబెంగాల్ గవర్నర్
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనావైరస్ మృతుల సంఖ్యను దాస్తోందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కార్ ఆరోపించారు.
‘‘పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో 105 మంది కోవిడ్-19తో మరణించారు.
కానీ, వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. మరణాలను ఎందుకు దాయాలనుకుంటున్నారు? పరిస్థితి తీవ్రంగా మారుతుందని తెలిస్తే ప్రజలు జాగ్రత్త పడతారు కదా’’ అన్నారాయన.
కరోనా వైరస్ విషయంలో వాస్తవ పరిస్థితులు అంచనాకు రాష్ట్రాల్లో తిరుగుతున్న ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం(ఐఎంసీటీ) ఇబ్బందులు ఎదుర్కొన్న ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్ అని.. దేశమంతా కరోనాతో పోరాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐఎంసీటీకి రెడ్ కార్పెట్ పరవాల్సిందిపోయి పశ్చిమబెంగాల్‌లో ఇబ్బందులు సృష్టించారని ఆయన ఆరోపించారు.
విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మళ్లీ ఇవి ఎప్పుడు రాకపోకల్ని ప్రారంభిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బీబీసీ ఎయిర్ పోర్ట్స్ అథార్టీ, విమానాశ్రయ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించింది. తమ పేర్లు వెల్లడించకూడదన్న షరతుతో కొందరు సమాచారం ఇచ్చారు.
వారు వెల్లడించిన వివరాల ప్రకారం, మే నెలలోనే విమానాలు, రైల్వేల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాలను మే నెల రెండో వారంలో ప్రారంభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైళ్లను కూడా రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ ప్రారంభించే అవకాశాలున్నాయి.
అయితే, వీటిలో ప్రయాణాలు మాత్రం ఇదివరకు ఉన్నట్లు ఉండవు. అవి పూర్తిగా మార్పు చెందుతాయని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు.
వలస కార్మికులు, విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు మొదలయ్యాయి
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, పర్యటకులు, యాత్రికులు, విద్యార్థులను వారివారి స్వరాష్ట్రాలకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లు తిప్పేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించడంతో రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్‌లోని లింగపల్లి నుంచి ఝార్ఖండ్‌లోని హతియాకు.. కేరళలోని అలువా నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు, మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు, రాజస్తాన్‌లోని జైపూర్ నుంచి బిహార్‌లోని పట్నాకు.. రాజస్థాన్‌లోని కోట నుంచి ఝార్ఖండ్‌లోని హతియాకు ప్రత్యేక రైళ్లు వేసినట్లు రైల్వే శాఖ చెప్పింది.
రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు గట్టి చర్యలు చేపట్టాలి: లవ్ అగర్వాల్
కరోనా వ్యాప్తి చెందకుండా ఆ చైన్‌ను బ్రేక్ చేయడంలో రాష్ట్రాలు, జిల్లాల యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.
‘75 వేల వెంటిలేటర్లు అవసరం కాగా 19,398 ఉన్నాయి’
దేశంలో 75 వేల వెంటిలేటర్లు అవసరం కాగా 19,398 అందుబాటులో ఉన్నాయని.. 60,884 వెంటిలేటర్లకు ఆర్డర్ పెట్టామని ఎంపవర్డ్ గ్రూప్-3 చైర్మన్ పీడీ వాఘేలా చెప్పారు. 2.49 కోట్ల ఎన్95 మాస్కులకూ ఆర్డరిచ్చినట్లు తెలిపారు.
ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని స్వరాష్ట్రాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వలస కార్మికులు, పర్యటకులు, యాత్రికులు, ఇతరులను ప్రత్యేక రైళ్లలో తరలించేందుకు హోం మంత్రిత్వశాఖ అనుమతించిందని.. రాష్ట్రాలు, రైల్వే బోర్డులు తగిన ఏర్పాట్లు చేస్తాయని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు.
సీఆర్‌పీఎఫ్‌లో ఒకే బెటాలియన్‌లో 60 మందికిపైగా కరోనా పాజిటివ్
సీఆర్‌పీఎఫ్‌లో ఓ బెటాలియన్‌కు చెందిన జవాన్లు పెద్ద సంఖ్యలో కోవిడ్-19బారిన పడినట్లు సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది.
శుక్రవారం ఆ బెటాలియన్‌లో 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ కావడంతో అక్కడ మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 60 దాటాయి.
వలస కార్మికులెవరూ వెళ్లిపోవద్దు.. త్వరలో ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతాయి: కర్ణాటక
తమ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులెవరూ వెనక్కు వెళ్లొద్దని కర్ణాటక ప్రభుత్వం కోరింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని.. ఎవరూ వెళ్లొద్దని కోరింది.
ఈ మేరకు ఆ రాష్ట్రం వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో సమావేశమైంది.
త్వరలో ఆర్థిక కార్యకలాపాలు పున:ప్రారంభించేవరకు కార్మికులకు వేతనాలు చెల్లిస్తూ, వారి బాగోగులు చూడాలని కోరింది.
వ్యాయామం కోసం ఇంటి బయటకు వెళ్లొచ్చు: లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి విధించిన లాక్‌డౌన్ చర్యలు కొన్నిటిని నేడు సడలించింది. కొన్ని వ్యాపారాలను తెరవటానికి అనుమతించారు. రెస్టారెంట్లు ఆహారాన్ని పంపిణీ చేయవచ్చు. కుటుంబాలు వ్యాయామం కోసం ఇల్లు వదిలి బయటకు రావచ్చు.
కానీ కొన్ని విషయాల్లో ఐదు వారాల లాక్‌డౌన్ మునుపటి లాగానే కఠినంగా కొనసాగుతుంది.
మద్యం విక్రయాలపై నిషేధం ఉంటుంది. ఈ ఆంక్షల వల్ల దేశంలోని ఆస్పత్రుల బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించబోతోంది. దానిని అమలు చేయటానికి వీధుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది.
ఇప్పటికే భద్రతా బలగాలు బలప్రయోగానికి పాల్పడుతున్నాయని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇంకా వేలాది మంది సైనికులు రహదారుల్లో పహరా కాయనున్నారు.
వైరస్ మీద పోరాటానికి వేగంగా కదిలిందని ఇప్పటివరకూ ప్రశంసలందుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇన్‌ఫెక్షన్ రేటు తక్కువగానే ఉండేలా చూడటానికి.. ఇప్పటికే తీవ్ర అసమానతలతో ఉన్న సమాజంలో నిస్పృహ, ఆగ్రహం పెరగకుండా సంతులనం సాధించాల్సి ఉంటుంది.
నౌకల్లో కోలుకున్న కార్మికులకు బస ఏర్పాటు చేస్తున్న సింగపూర్
సింగపూర్ తన రేవులో నిలిచివున్న రెండు నౌకల్లో.. కోవిడ్-19 నుంచి కోలుకున్న తమ విదేశీ కార్మికులకు బస ఏర్పాటు చేయటం మొదలుపెట్టింది.
వైరస్ సంక్రమణను నివారించటానికి వీరి విషయంలో కఠినమైన నియంత్రణ చర్యలు, భద్రతా విధానాలు అమలు చేస్తామని, వీరిని ఉంచే ప్రాంతంలో ఐసొలేషన్ కేంద్రాలు కూడా ఉంటాయని అధికారులు చెప్పారు.
సామాజిక దూరం పాటించటానికి వీలులేని ఇరుకైన డార్మిటరీల్లో నివసించే విదేశీ కార్మికుల్లో ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ ఉండమే సింగపూర్‌లో అత్యధిక కేసులు నమోదవటానికి కారణం.
ఈ కార్మికుల డార్మిటరీలు ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నాయి. ప్రభావిత కార్మికులను దూరదూరంగా ఉంచటానికి అధికారులు ఇతర ప్రాంతాలను అన్వేషిస్తున్నారు.
సింగపూర్‌లో 3,00,000 మందికి పైగా విదేశీ కార్మికులున్నారు. వారిలో అధిక శాతం మంది దక్షిణాసియాకు చెందిన వారే. వైరస్ నియంత్రణలో ఆరంభంలో నమూనాగా ప్రశంసలందుకున్న సింగపూర్‌లో ఇప్పుడు 16,000కు పైగా నిర్ధారిత కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 60 కేసుల నమోదు.. మొత్తం కేసుల సంఖ్య 1,463
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 60 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర నోడల్ అధికారి తాజా బులెటిన్‌లో తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,463కు పెరిగింది.
ఇప్పటివరకూ కోవిడ్-19 నుంచి కోలుకుని 403 మంది డిశ్చార్జ్ అయ్యారని.. 33 మంది మృతి చెందారని చెప్పారు.
ప్రస్తుతం 1,027 మంది చికిత్స పొందుతున్నట్లు వివరించారు.
గడచిన 24 గంటల్లో నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల చనిపోయారు.