You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: 'భారత్‌లో గత 24 గంటల్లో 2,411 కోవిడ్ కేసులు... మొత్తం బాధితులు 37,776' -కేంద్ర ఆరోగ్య శాఖ
భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 37,776కు చేరుకుంది. ఒక్క రోజులోనే 2,411 కొత్త కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. పదివేలకు పైగా కోవిడ్ బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 1,223 మంది చనిపోయారు.
లైవ్ కవరేజీ
భారత్‌లో 37,776.. ఏపీలో 1,525.. తెలంగాణలో 1,061 పాజిటివ్ కేసులు
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం శనివారం రాత్రి 10 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా 33,69,208 మంది కరోనా వైరస్ బారిన పడగా వారిలో 2,39,448 మంది ప్రాణాలు కోల్పోయారు.
* అమెరికాలో 11,07,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా 66,262 మంది మరణించారు.
* స్పెయిన్‌లో 2,13,435 మందికి కరోనావైరస్ సోకగా వారిలో 24,543 మంది చనిపోయారు.
* ఇటలీలో 2,07,428 మందికి వైరస్ సోకగా 28,236 మంది మరణించారు.
* యూకేలో 1,78,689 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా 27,510 మంది మరణించారు.
* ఫ్రాన్స్‌లో 1,67,305 మంది కరోనాబాధితులలో 24,563 మంది మరణించారు.
* భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,776కి పెరిగింది.. మృతుల సంఖ్య 1,223కి చేరింది.
* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 1525 కాగా మృతుల సంఖ్య 33.
* తెలంగాణలో కేసుల సంఖ్య 1061కి పెరగగా.. ఇప్పటివరకు 29 మంది మరణించారు.
బ్రిటన్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా ఉద్ధృతి
బ్రిటన్‌లో కరోనావైరస్ ప్రభావం అత్యధిక స్థాయిని దాటేసి తగ్గుముఖం పడుతోందని.. అయినప్పటికీ దీన్ని ఎదుర్కోవడంలో చేయాల్సింది చాలా ఉందని ఇంగ్లండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జెన్నీ హారిస్ అన్నారు.
కోవిడ్-19తో ఆసుపత్రుల్లో ఉన్నవారి సంఖ్యలో 13 శాతం తగ్గుదల నమోదైందని.. ఎన్‌హెచ్ఎస్‌పై ఒత్తిడి తగ్గుతోందని చెప్పారు.
క్రిటికల్ కేర్ బెడ్ల వినియోగమూ తగ్గుతోందని తెలిపారు. ఇప్పటివరకు 28,131 మంది కరోనావైరస్ కారణంగా మరణించారని.. మరణాల రేటు తగ్గుతున్నప్పటికీ ఆ తగ్గుదల ఇంకా స్వల్పంగానే ఉందని చెప్పారు.
లాక్‌డౌన్ సమయంలో 1400 మంది కార్మికులను ఎలా తొలగిస్తారు: పవన్ కల్యాణ్
1400 మంది కార్మికుల పొట్టకొట్టకండి: పవన్ కల్యాణ్ కరోనా కారణంగా అల్పాదాయ వర్గాలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని.. ఇలాంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగించడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
లాక్‌డౌన్ సమయంలో దేశంలో ఎక్కడా కార్మికులను తొలగించరాదని.. వేతనాలు చెల్లించాలని ప్రధాని మోదీ సూచించినప్పటికీ టీటీడీలో ఇలా 1400 మందిని తొలగించడం సరికాదని ఆయన అన్నారు.
వారిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీని ఆయన కోరారు.
జనసంచారం తగ్గడంతో గ్రామాల్లోకి వస్తున్న ఎలుగుబంట్లు
లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో వన్యప్రాణులు బయటకొస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం గ్రామాల్లోని జీడి తోటల్లో ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు.
జులై 24 వరకు ఎమర్జెన్సీ పొడిగించే యోచనలో ఫ్రాన్స్
ఫ్రాన్స్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని జులై 24 వరకు పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలిపింది.
సోమవారం పార్లమెంటు ముందు ఈ ప్రతిపాదన ఉంచుతామని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఒలీవియర్ వెరాన్ తెలిపారు.
మార్చి 24 నుంచి అమలవుతున్న అత్యవసర పరిస్థితిని ఇప్పుడు ఎత్తివేస్తే కేసులు పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 1,67,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 24,628 మంది మరణించారు.
భారత్‌లో 1,223కి పెరిగిన మృతుల సంఖ్య.. మొత్తం కేసులు 37,776
దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 37,776కి పెరిగింది. వీరిలో 10,018 మందికి నయం కావడంతో ప్రస్తుతం 26,535 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇప్పటివరకు 1,223 మంది మరణించినట్లు ప్రకటించింది.
అత్యధికంగా మహారాష్ట్రలో 485 మంది మరణించగా గుజరాత్‌లో 236, మధ్యప్రదేశ్‌లో 145, రాజస్థాన్‌లో 62, దిల్లీలో 61 మంది మరణించారు.
ప్రాణం కంటే విలువైనది లేదు: టీయూడబ్ల్యూజే-టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, కరోనా సోకిన దిల్లీలోని తెలంగాణ జర్నలిస్ట్‌కు అండగా ఉంటామని వెల్లడి
కరోనావైరస్ బారిన పడకుండా జర్నలిస్టులు జాగ్రత్తపడాలని టీయూడబ్ల్యూజే-టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు.
శనివారం దిల్లీకి చెందిన తెలంగాణ పాత్రికేయుడొకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
బాధిత కుటుంబానికి నిత్యవసరాలు, ఇతర తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు వెంటనే బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నట్లు ప్రకటించారు.
క్వారంటైన్‌లో ఉన్న మిగతా జర్నలిస్టుల ఖాతాలకూ రూ.10 వేల చొప్పున జమ చేస్తున్నట్లు చెప్పారు.
కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైన జర్నలిస్ట్ చికిత్స కోసం యాజమాన్యం రూ. లక్ష ప్రకటించినందుకు టీయూడబ్ల్యూజే ధన్యవాదాలు తెలిపింది.
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులందరినీ రాష్ట్రానికి రప్పిస్తాం: ఏపీ మంత్రి కృష్ణదాస్
గుజరాత్‌లోని వీరావల్ నుంచి శ్రీకాకుళం చేరుకున్న మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు.
నరసన్నపేట సెయింట్ క్లారిట్ స్కూల్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో క్వారంటిన్‌లలో ఉన్న వారిని కలెక్టర్ జె.నివాస్ తో కలిసి వెళ్లి పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
క్వారంటైన్ పూర్తయి ఇళ్లకు వెళ్లేటప్పుడు వారికి రూ. 2000 ఆర్థిక సహాయం కూడా అందజేయనున్నట్లు చెప్పారు. వేట నిషేధ సమయంలో అందజేసే రూ.10 వేల భృతిని కూడా అర్హులైన అందరికీ అందజేస్తామని కృష్ణదాస్ చెప్పారు.
లాక్ డౌన్ కారణంగా చిక్కుకొన్న ఆంధ్రప్రదేశ్ కార్మికులందరినీ రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు.
జాతీయ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యంలో 40 శాతం ఏపీ నుంచే అందుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో మెరైన్ సెక్టార్‌ను ప్రోత్సహిస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారుల వలసలు పూర్తిగా తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు.
గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో దేనికి అనుమతి ఉంది.. దేనికి లేదు..
రెండు ప్రైవేట్ సంస్థలను హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు సిద్ధం చేయమని కోరిన కేంద్రం, 11.45 కోట్ల మాత్రలకు ఆర్డర్ ఇవ్వగా ఇప్పటికే 6.64 కోట్ల మాత్రల ఉత్పత్తి
11.45 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఉత్పత్తి చేయాలని దేశీయ సంస్థలు ఐపీసీఏ ల్యాబరేటరీస్, జైడస్ కేడిలాలను కేంద్రం కోరింది.
సాధారణంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ లేటెక్స్ లిమిటెడ్(హెచ్ఎల్ఎల్) లైఫ్ కేర్ ఈ మందును ఉత్పత్తి చేస్తుంది.
మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కరోనా రోగులకు చికత్సలోనూ వాడొచ్చని కోవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సూచించింది.
ఇది వైరస్‌కు నిర్దిష్టమైన చికిత్స కానప్పటికీ వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుండడంతో కరోనాపై పోరాటంలో ముందువరుసలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి కూడా దీన్ని సూచిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఈ ఔషధాన్ని వాడేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతించింది. 11.45 కోట్ల మాత్రలకు ఆర్డర్ పెట్టగా ఇప్పటివరకు 6.64 కోట్ల మాత్రలు తమకు అందాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఓ సీనియర్ అధికారి ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు.
మిగతావి మే 16 నాటికి సిద్ధమవుతాయని చెప్పారాయన. ఈ 6.64 కోట్ల మాత్రలలో 4.3 కోట్ల మాత్రలను ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ చేశామని.. మిగతావి సిద్ధంగా ఉంచామని చెప్పారు.
కొన్ని రాష్ట్రాలు ఈ తయారీసంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నాయని.. అలా 3.8 మాత్రలను కొనుగోలు చేశాయని తెలిపారు. దేశీయ అవసరాల కోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుండడంతో పాటు అవసరమైన ఇతర దేశాలకూ ఈ మాత్రలను భారత్ పంపిస్తోంది.
ఇప్పటివరకు 87 దేశాలకు ఇలా అందించారు. గతంలో నెలకు 12.33 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు భారత్‌లో తయారయ్యేవని.. కానీ, ఏప్రిల్ నెలలో 30 కోట్లు ఉత్పత్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.
కరోనావైరస్‌ను న్యూజీలాండ్ ఎలా ఎదుర్కోగలిగింది?
ఐదు వారాల లాక్ డౌన్ తర్వాత న్యూజీలాండ్‌లో కాఫీ షాపులు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం న్యూజీలాండ్‌లో మూడో స్థాయి అలర్ట్ అమలులో ఉంది. దీంతో కొన్ని అత్యవసర సేవలు కాని వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.
న్యూజీలాండ్ వైరస్‌ని ఎదుర్కోవడానికి కారణం చాలా సత్వర చర్యలు చేపట్టడం అని ప్రముఖంగా చెప్పవచ్చు.
మార్చ్ 19 నుంచి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు నుంచి ప్రయాణాల మీద ఆంక్షలు అమలు చేసింది. దీంతో విదేశాల నుంచి వచ్చే కేసులు తగ్గిపోయాయి. న్యూజీలాండ్‌లో నమోదైన 33 శాతం కేసులు బయట నుంచి వచ్చినవే.
రష్యా మంత్రికి కరోనా పాజిటివ్
రష్యాలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ రష్యాలో కనస్ట్రక్షన్ మినిష్టర్ వ్లాదిమిర్ యకుషెవ్ కరోనా సోకింది.
ఇప్పటికే ఆ దేశ ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషూస్టిన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా ఇప్పుడు యకుషెవ్‌కూ సోకింది.
ఆ శాఖ సహాయ మంత్రికీ కరోనా సోకినట్లు రష్యా మీడియా వెల్లడించింది.
కాగా అధ్యక్షుడు పుతిన్ ప్రస్తుతం మాస్కో వెలుపల ఉన్న తన ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్సుల ద్వారా మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రష్యాలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 1222 మంది మరణించారు.
కాంక్రీట్ మిక్సర్ ట్యాంక్‌లో మహారాష్ట్ర నుంచి లఖ్‌నవూ వెళ్లేందుకు ప్రయత్నం, 18 మందిని గుర్తించిన ఇండోర్ పోలీసులు
కాంక్రీట్ మిక్సర్‌లో 18 మంది వెళ్తుండగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు గుర్తించారు.
వీరంతా మహారాష్ట్ర నుంచి లఖ్‌నవూ వెళ్తున్నారు.
పోలీసులు ఆ ట్రక్‌ను స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కోవిడ్-19 మీద జానపద చిత్రకారుల పోరు
సామాజిక సందేశాల కోసం భారత జానపద చిత్రకళాకారులు సంప్రదాయ చిత్రకళను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కరోనావైరస్ వ్యాప్తిని నివారించటం కోసం సామాజిక దూరం, పరిశుభ్రత ఆవశ్యతలను చాటిచెప్పటానికి ఒక చిత్రకారుల బృందం పెయింటింగ్‌లు విడుదల చేసింది.
భౌతిక దూరం పాటించటం, ఫేస్ మాస్కులు ధరించటం, చేతులను సోపుతో శుభ్రంగా కడుక్కోవటం, గుంపులుగా ప్రయాణించకుండా ఉండటం ఎంత ముఖ్యమో చెప్తూ.. కళలు, కళాకారులతో కూడిన సంఘం ‘దస్తకర్’ గత మార్చి నెల నుంచి వర్ణచిత్రాలను రూపొందిస్తూ ఉంది.
కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స చేస్తున్న ఆస్పత్రుల దృశ్యాలు కూడా ఈ చిత్రాల్లో ఉన్నాయి.
ఎల్ సాల్వెడార్‌లో సగానికి పడిపోయిన హత్యల రేటు
ప్రపంచంలో అత్యంత హింసాత్మక దేశాల్లో ఒకటైన ఎల్ సాల్వెడార్‌లో హత్యల రేటు గణనీయంగా పడిపోయింది.
ఈ దేశంలో అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 441 హత్యలు జరిగాయి. 2019 సంవత్సరంలో ఇదే కాలంలో 1,049 హత్యలు జరిగాయి. అంటే 58 శాతం మేర హత్యలు తగ్గాయి.
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి ఎల్ సాల్వెడార్ కఠినమైన క్వారంటైన్ నిబంధనలు అమలు చేసింది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో నిబంధనలు అతిక్రమించిన వారి మీద కఠిన చర్యలు చేపట్టాలని భద్రతా బలగాలకు అధ్యక్షుడు నయీబ్ బుకేల్ ఆదేశించారు.
అయితే కిక్కిరివున్న జైళ్లలో వైరస్ వ్యాపిస్తోందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
స్పెయిన్‌లో అడుగు బయటపెట్టిన జనం.. క్వారంటైన్ నిబంధనలు సడలింపు
స్పెయిన్ వీధుల్లో కొన్ని వారాల తర్వాత మొదటిసారిగా జనం నడుస్తూ, జాగింగ్ చేస్తూ, సైకిళ్లు తొక్కుతూ కనిపించారు.
కరోనావైరస్‌ను ఎదుర్కోవటానికి దేశంలో విధించిన కఠిన ఆంక్షలను సడలించి.. పెద్ద వాళ్లు వ్యాయామం కోసం బయటకు రావటానికి అనుమతి ఇవ్వటంతో ప్రజలు వీధుల్లోకి అడుగు పెట్టారు.
చిన్నారుల కోసం వారం రోజుల కిందటే ఈ నిబంధనలు సడలించారు.
కరోనావైరస్ పంజాకు స్పెయిన్ విలవిలలాడింది. మొత్తం 2,13,000కు పైగా కేసులు నమోదు కాగా 24,500 మంది చనిపోయారు. ఈ పరిస్థితుల్లో మార్చిలో కఠినమైన ఆంక్షలతో లాక్‌డౌన్ విధించారు.
గత వారం వరకూ పిల్లలు కూడా ఇంటి నుంచి బయట అడుగు పెట్టకూడదని ఆంక్షలు విధించిన ఏకైక యూరప్ దేశంగా స్పెయిన్ నిలిచింది.
ఆంక్షలను కొంత సడలిస్తూ.. జనం ఆహారం, మందులు కొనుగోలు చేయటానికి, పెంపుడు జంతువులను బయట నడకకు తీసుకెళ్లటానికి, ఇంటి నుంచి పనిచేయటం సాధ్యం కాకపోతే ఆఫీసులు, కార్యాలయాలకు వెళ్లటానికి అనుమతులు ఇచ్చారు.
అయితే.. ఇంటి నుంచి ఎక్కువ దూరం వెళ్లకూడదు. సామాజిక దూరం నిబంధనలు పాటించాల్సిందే. జనసమ్మర్థం లేకుండా వ్యాయామం చేయటానికి టైమ్‌టేబుళ్లు అమలు చేస్తున్నారు.
సహాయ ప్యాకేజీలు పంచిన ప్రిన్సెస్ చార్లట్
బ్రిటన్ చిన్నారి యువరాణి ప్రిన్సెస్ చార్లట్.. కరోనావైరస్ సంక్షోభంలో అవసరంలో ఉన్న వారికి ఇంట్లో తయారు చేసిన సహాయ ప్యాకేజీలను పంపిణీ చేసింది.
ఆమె ఐదో పుట్టినరోజు సందర్భంగా ఇందుకు సంబంధించిన ఫొటోలను రాజ కుటుంబం విడుదల చేసింది.
ఇంగ్లండ్‌లోని నార్ఫోక్‌లో తమ ఇంటికి సమీపంలో ఉన్న వృద్ధులు, అవసరార్థులకు రాజ కుటుంబం సహాయ ప్యాకేజీలు పంపిణీ చేస్తున్నపుడు ప్రిన్సెస్ చార్లట్ వారికి సాయపడుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
ఈ ఫొటోలను ప్రిన్సెస్ చార్లట్ తల్లి, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఏప్రిల్ తీశారు.
కరోనావైరస్‌ను న్యూజీలాండ్ ఎలా ఎదుర్కోగలిగింది?
న్యూజీలాండ్‌లో ఐదు వారాల లాక్‌డౌన్ తర్వాత కాఫీ షాపులు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. కొన్ని అత్యవసర సేవలు కాని వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం ఈ దేశంలో మూడో స్థాయి హెచ్చరిక అమలులో ఉంది. ఇలాంటపుడు ప్రజల్ని ఇంటి వద్ద నుంచే పని చేయమని సలహా ఇస్తారు. ఇతరులెవరినీ తాకకుండా సేవలు అందించగలిగితే కొన్ని వ్యాపారాలు తెరవడానికి అనుమతి ఇస్తారు.
50 లక్షల జనాభా ఉండే న్యూజీలాండ్‌లో ప్రస్తుతం 1124 కేసులు నమోదు కాగా 19 మరణాలు చోటు చేసుకున్నాయి. కొత్తగా నమోదు అయిన కేసులు చాలా తక్కువగా ఉండటంతో ప్రభుత్వం వైరస్‌ని అరికట్టినట్లు ప్రకటించింది.
కరోనావైరస్‌ని ఎదుర్కోవడానికి న్యూజీలాండ్ ఏం చేసింది? ఎలా అరికట్టింది?
బెంగళూరులో ఉన్నవారికి వన్‌టైమ్ బస్సు ప్రయాణం
కర్ణాటకలో బెంగళూరులో చిక్కుకుపోయిన ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లటానికి ఒక్కసారి ప్రయాణించటానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో బెంగళూరులోని మెజస్టిక్ బస్ టెర్మినల్‌కు జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించి బస్సుల్లోకి అనుమతిస్తున్నారు.