లండన్ వృద్ధాశ్రమంలో కోవిడ్-19 వల్ల భారతీయ మహిళా సంపాదకురాలు మృతి
బ్రిటన్‌లో నివసిస్తున్న ప్రముఖ భారతీయ జర్నలిస్ట్ గుల్షన్ ఈవింగ్.. లండన్‌లోని ఒక వృద్ధాశ్రమంలో కోవిడ్-19 వల్ల చనిపోయారు.
ఆమె వయసు 92 సంవత్సరాలు. వృద్ధాశ్రమాలు, సంరక్షణాలయాల్లో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో గుల్షన్ ఆ వైరస్‌కు బలయ్యారు.
గుల్షన్ ప్రఖ్యాత భారతీయ మేగజీన్లు ఈవ్స్ వీక్లీ, స్టార్ అండ్ స్టైల్‌లకు 1966 నుంచి 1989 వరకూ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె ‘‘భారతదేశపు విఖ్యాత మహిళా సంపాదకురాలు’’ అని నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నయీపాల్ ఒక సందర్బంలో అభివర్ణించారు.
ఆమె.. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హేమాహేమీలను ఇంటర్వ్యూ చేశారు. ప్రిన్స్ చార్లెస్, ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ వంటి వారితో ఆమెకు మంచి సంబంధాలున్నాయి. దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, నర్గీస్ వంటి దిగ్గజాలతో తరచుగా పార్టీల్లో పాల్గొనేవారు.
‘‘అమ్మ చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది.ఆమె కెరీర్‌లో అధ్బుతంగా రాణించారు. ఆమె భర్తను ఆమెను ఆరాధించేవారు. ఆమె నిండుగా జీవించారు’’ అని గుల్షన్ కుమార్తె అంజలి తనతో పేర్కొన్నట్లు బీబీసీ ప్రతినిధి గీతా పాండే చెప్పారు.