You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 2.08 లక్షల మరణాలు; భారత్‌లో 28,380 బాధితులు, 886 మృతులు

ప్రపంచదేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. భారతదేశంలో మొదటిసారి 24 గంటల వ్యవధిలో 60 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం 28,380 మంది కోవిడ్ బాధితులలో 6,362 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. 24గంటల్లో 1396 కొత్త కేసులు, 48 మంది మృతి- కోవిడ్-19 తాజా గణాంకాలను వెల్లడించిన కేంద్రం

    కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అందించిన తాజా గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 48 మంది ప్రాణాలు కోల్పోయారు.

    దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,892కి చేరుకుంది. మొత్తం 872 మంది మరణించారు. ఇప్పటి వరకు 6,185 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోగా 20,835 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

  2. ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్

    అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ తదితర పరిణామాలపై వారితో చర్చించనున్నారు.

    లాక్ డౌన్ కొనసాగింపు, సడలింపుల విషయంలో కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచనలను పక్కనబెడుతున్నాయి. అలాగే మరి కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్‌ను కొనసాగించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తాజా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    కోవిడ్-19 సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో ఇప్పటి వరకు రెండు సార్లు సమావేశమయ్యారు. ఇది మూడోసారి.

  3. అమెరికాలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వివరాల ప్రకారం అమెరికాలో మరణాల సంఖ్య 55వేలకు చేరుకుంటోంది. నిర్దరణైన కేసుల సంఖ్య 9.65 లక్షలు. కేసుల పరంగా రెండో స్థానంలో ఉన్న స్పెయిన్ కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

    పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలను సడలించడం ప్రారంభించాయి. జార్జియా, ఓక్లహామా, అలాస్కా, సౌత్ కరోలినాలు ఇప్పటికే కొన్ని వ్యాపారాలు తిరిగి ప్రారంభం కావడానికి అనుమతులిచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలు సోమవారం నుంచి అనుమతిస్తున్నాయి.

    వేసవి ముగిసే వరకూ సామాజిక దూరం పాటించాలని యూఎస్ వైరస్ టాస్క్ ఫోర్స్ దేశ ప్రజలకు సూచిస్తోంది.

    డిస్‌ఇన్ఫెక్టెంట్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటే వైరస్‌ చనిపోతుందని డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడలేదు.

  4. ఆసియాలో ఏం జరుగుతోంది?

    • చైనాలో ఆదివారం మరణాలు నమోదుకాలేదు. కొత్తగా 3 కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఒక్కటే స్థానికంగా నమోదైన కేసు.
    • వుహాన్‌లో కొత్త కోవిడ్-19 పేషెంట్లు ఎవరూ లేరని, ఇప్పటివరకూ ఉన్న వారంతా డిశ్ఛార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.
    • సింగపూర్‌లో కేసుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో ఎక్కువమంది విదేశీ కార్మికులే ఉన్నారు. ఇప్పటివరకూ 13,600కు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం డార్మిటరీల్లో నివసించే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినవే.
    • ఇండోనేషియాలో ఆదివారం 275 కొత్త కేసులు నమోదయ్యాయి. 23 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 743కు చేరింది.
  5. ఆస్ట్రేలియాలో వివాదాస్పదమైన ట్రేసింగ్ యాప్

    కరోనావైరస్ కాంటాక్టులను ట్రేస్ చెయ్యడానికి ఆస్ట్రేలియా ఓ కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. విడుదల చేసిన గంటల వ్యవధిలోనే దాదాపు 10 లక్షలమంది ఆస్ట్రేలియన్లు (మొత్తం జనాభా 2.5 కోట్లు) కోవిడ్‌సేఫ్‌ అనే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

    మొబైల్‌లోని బ్లూటూత్ ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది. 1.5 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణై ఉంటే, 15 నిమిషాలకు మించి సమయం అలా గడిపితే ఈ యాప్ నోటిఫికేషన్ పంపిస్తుంది.

    కానీ ఈ యాప్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత, సమాచార భద్రతకు భంగం కలుగుతుందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. అయితే, ఈ యాప్ ద్వారా సేకరించే సమాచారం కేవలం కాంటాక్ట్ ట్రేసింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తామని, ఆ సమాచారం అంతా సర్వర్‌లో తాత్కాలికంగానే స్టోర్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వివరాల ప్రకారం ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో 6,714పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది మరణించారు.

    గత కొన్ని వారాలుగా కొత్త కేసుల పెరుగుదల నెమ్మదించింది. ఆదివారం నాడు కేవలం 16 కేసులు నమోదయ్యాయి.

  6. సోమవారం నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభించనున్న బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి తన అధికారిక కార్యకలాపాలను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు.

    కరోనావైరస్ బారిన పడి మూడు వారాల పాటు విధులకు దూరంగా ఉన్న జాన్సన్ తిరిగి విధుల్లో చేరడం దేశానికి ఉత్తేజాన్నిచ్చే చర్య అని డొమినిక్ రాబ్ వ్యాఖ్యానించారు. జాన్సన్ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన స్థానంలో డొమినిక్ రాబ్ అత్యవసర విధులను నిర్వర్తించారు.

    ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్‌కు బోరిస్ జాన్సన్ 15 రోజుల తర్వాత చేరుకున్నారు.

    సోమవారం ఉదయం జరిగే కరోనావైరస్ సమీక్షా సమావేశాలకు ఆయన అధ్యక్షత వహిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

    ఏప్రిల్ 5న హాస్పటల్‌లో చేరిన జాన్సన్ మూడురోజులు ఐసీయూలో చికిత్స పొందారు. శ్వాసలో ఎదురైన ఇబ్బందులను అధిగమించేందుకు ఆక్సిజన్ చికిత్స తీసుకున్నారు.

    ఏప్రిల్ 12న డిశ్ఛార్జ్ తర్వాత ఆయన తనకు చికిత్స అందించిన వైద్య సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటానని వెల్లడించారు. సెయింట్ థామస్ హాస్పటల్ సిబ్బందిని ఎంతగానో ప్రశంసించారు.

  7. కరోనావైరస్‌పై బీబీసీ తెలుగు LIVE అప్‌డేట్స్ పేజీకి స్వాగతం

    ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు

    • ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బాధితుల సంఖ్య 29,68,627. మొత్తం 2,06,402 మంది మరణించారు. 8,64,122 మంది పూర్తిగా కోలుకున్నారు.
    • అమెరికాలో తీవ్రత కొనసాగుతోంది. 9,65,426 మంది కోవిడ్-19 బారిన పడగా, అత్యధికంగా 54,856మంది ప్రాణాలు కోల్పోయారు.
    • స్పెయిన్‌లో కేసుల సంఖ్య 2.26 లక్షలు కాగా, ఇటలీలో 1.97 లక్షల కేసులు నమోదయ్యాయి.
    • ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌లతో పాటు టర్కీలో కూడా కేసుల సంఖ్య లక్ష దాటింది.
    • భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,197కు చేరుకుంది. మొత్తం 826 మంది మృతిచెందారు.
    • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1097కి చేరింది. ఇప్పటివరకూ 31 మంది చనిపోయారు.
    • తెలంగాణలో మొత్తం కేసులు 1001కు చేరింది. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 25గా ఉంది.